UP bypoll: చిన్నాన్నకు పాదాభివందనం చేసిన అఖిలేష్

ABN , First Publish Date - 2022-11-20T16:00:18+05:30 IST

మెయిన్‌పురి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తన చిన్నాన్న శివపాల్ యాదవ్ పట్ల విధేయత..

UP bypoll: చిన్నాన్నకు పాదాభివందనం చేసిన అఖిలేష్

ఇటావా: మెయిన్‌పురి లోక్‌సభ ఉప ఎన్నికల (Mainpuri Lok Sabha bypoll) ప్రచారంలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) తన చిన్నాన్న శివపాల్ యాదవ్ (Shivpal Yadav) పట్ల విధేయత చాటుకున్నారు. ఆయన పాదాలకు నమస్కరించారు. ములాయం కుటుంబానికి కంచుకోటలాంటి సైఫై (Saifai)లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత నెలలో ములాయం సింగ్ యాదవ్ కన్నుమూయడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మొయిన్‌పురి లోక్‌సభకు ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడి నుంచి సమాజ్‌వాది పార్టీ అభ్యర్థిగా అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ పోటీలో ఉన్నారు.

''నేతాజా (ములాయం) మన మధ్య లేని తరుణంలో జరుగుతున్న ఉప ఎన్నిక ఇది. యావత్ దేశం ఈ ఎన్నికల వైపు చూస్తోంది. సమాజ్‌వాది పార్టీ ఎలాంటి చారిత్రక విజయం సాధించనుందో యావత్ ప్రపంచం చూడబోతోందని నేను చెప్పదలచుకున్నాను'' అని ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ అఖిలేష్ అన్నారు.

అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్ మధ్య 2017 నుంచి పొరపొచ్చాలు ఉన్నప్పటికీ 2002 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. యునైటెడ్ ఫ్రెంట్‌గా ఎన్నికలకు వెళ్లారు. అయితే, బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్యా మళ్లీ సయోధ్య లేనట్టు కనిపించింది. దీనిపై అఖిలేష్ ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, చాచా (చిన్నాన్న)కు, నాకూ మధ్య దూరం ఉందని జనం ఒక్కోసారి మాట్లాడుతుంటారని, రాజకీయాల్లో దూరం అనేది ఉంటుందని, అయితే తనకు, చిన్నాన్నకు మధ్య ఎలాంటి దూరం లేదని అన్నారు. రాజకీయాల్లో దూరానికి కూడా ఈరోజుతో తెరపడిందని సభికుల హర్షధ్వానాల మధ్య అఖిలేష్ చెప్పారు. చిన్నాన్న ప్రాతినిధ్యం వహిస్తు్న జస్వంత్ నగర్, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కర్హాల్ ప్రజలు సమాజ్‌వాదీ పార్టీతోనే కలిసి ముందుకు వెళ్లాలనే బలమైన నిశ్చయంతో ఉన్నారని చెప్పారు. ఈ విషయం బీజేపీకి కూడా బాగా తెలుసునని అన్నారు.

అఖిలేష్ యాదవ్‌, శివపాల్ యాదవ్‌తో పాటు సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్ యాదవ్ ఒకే వేదికపై ప్రచారం చేయడంతో పార్టీ కార్యకర్తల్లో రెట్టించిన ఉత్సాహం కనిపించింది. ఈ ఉప ఎన్నికలో డింపుల్ యాదవ్‌పై బీజేపీ అభ్యర్థి రఘురాజ్ సింగ్ పోటీలో ఉన్నారు. డిసెంబర్ 5న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 8న ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - 2022-11-20T16:00:18+05:30 IST

Read more