మాటల్లోనే కట్టేశారు! చేతల్లో మాత్రం...!

ABN , First Publish Date - 2022-09-23T17:51:56+05:30 IST

కొత్త వైద్య కళాశాలల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కపైసా ఖర్చు పెట్టలేదు. రూ.8500 కోట్లు అవసరం కాగా... అందులో కేంద్రం మూడు కాలేజీలకు రూ.585 కోట్లు కేటాయించింది. మరో మూడు కాలేజీలకు నాబార్డు నుంచి

మాటల్లోనే కట్టేశారు! చేతల్లో మాత్రం...!

మెడికల్‌ కాలేజీలపై మొదటి నుంచీ మాయే

ఆచరణ సాధ్యంకాని ప్రణాళికలతో తంటాలు

అధికారులు చెప్పినా వినిపించుకోని జగన్‌

ఒకేసారి 16 మెడికల్‌ కాలేజీలు అంటూ గొప్పలు

బ్యాంకు రుణం కోసం అనేక విఫల విన్యాసాలు

3 కాలేజీలకు కేంద్ర సాయం రూ.585 కోట్లు

మరో మూడింటికి నాబార్డు రుణం 1146 కోట్లు 

రాష్ట్ర ఖజానా నుంచి ఒక్కపైసా ఇవ్వని వైనం

కేంద్ర, నాబార్డు నిధులే ఇతర కాలేజీలకూ...

ఒక్కటీ పూర్తిచేయలేక అన్నీ అరకొరగానే!

2027 తర్వాతే పనులు పూర్తయ్యే అవకాశం

అధికారుల్లో ఇప్పటికే స్పష్టత


కొత్త వైద్య కళాశాలల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కపైసా ఖర్చు పెట్టలేదు. రూ.8500 కోట్లు అవసరం కాగా... అందులో కేంద్రం మూడు కాలేజీలకు రూ.585 కోట్లు కేటాయించింది. మరో మూడు కాలేజీలకు నాబార్డు నుంచి రూ.1146 కోట్లు రుణం తీసుకున్నారు. ఎన్ని విన్యాసాలు చేసినా బ్యాంకులు అప్పు ఇవ్వడంలేదు. మరి... కాలేజీల నిర్మాణానికి నిధులు ఎలా?


చేతిలో చిల్లిగవ్వ లేదు. సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించలేదు. అధికారులు నచ్చ చెప్పినా వినలేదు. కానీ... ‘ఒకేసారి 16 వైద్యకళాశాలలు కడుతున్నాం’ అని గొప్పగా చెప్పుకోవడమే లక్ష్యంగా ఒక ప్రకటన చేశారు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే... కొన్ని కాలేజీల పనులు మొదలే కాలేదు. కొన్ని పునాదుల దశ కూడా దాటలేదు. కానీ... ఆ కాలేజీలన్నీ కట్టేసినట్లుగా, ఈ రాష్ట్రంలో వైద్య విద్య అంటూ ఒకటి ఉందంటే తాను, తన తండ్రే కారణమన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీలో చెప్పుకొన్నారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ‘ఎన్టీఆర్‌’ పేరును తొలగించేశారు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘‘సాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏపీలో కేవలం 11 మెడికల్‌ కాలేజీలే ఉన్నాయి. మేం వచ్చిన తర్వాత 17 మెడికల్‌ కాలేజీలు(Ap Medical Colleges) ) ఏర్పాటు చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి జగన్‌(Chief Minister Jagan) అసెంబ్లీ వేదికగా ప్రకటించేశారు. ‘ఆహా... ఇది వైద్య విద్య చరిత్రలోనే ఒక అద్భుతం’ అనిపించేలా మాట్లాడారు. అసలు విషయంలోకి వెళితే... సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల, కేంద్రం నిధులిచ్చిన మచిలీపట్నం, పాడేరు, పిడుగురాళ్ల మినహా మరెక్కడా పనులు పునాదుల దశ దాటలేదు. మెడికల్‌ కాలేజీల విషయంలో మొదటి నుంచీ ఈ సర్కారుది వింత వైఖరే. ‘కాలేజీలు కడతామో లేదో తర్వాతి విషయం. కట్టేశామని చెప్పుకొందాం’ అనే తరహాలోనే ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తొలుత ప్రభుత్వం 16 మెడికల్‌ కాలేజీలపై ప్రకటన చేసింది. ఆ తర్వాత... పార్వతీపురంలో మరో మెడికల్‌ కాలేజీ పెడతామని తెలిపింది. ఈ కాలేజీ ఏర్పాటుకు ఇంకా స్థలం కూడా గుర్తించలేదు.


ఆచరణ సాధ్యం కాదని చెప్పినా...

ఒకేసారి 16 మెడికల్‌ కాలేజీల నిర్మాణం చేపట్టడం సాధ్యపడదని అధికారులు సీఎంకు ముందుగానే చెప్పారు. ‘ఒకేసారి అన్ని కాలేజీలు కట్టలేం. నిధులు అందుబాటులో ఉండవు. విడతల వారీగా నిర్మిద్దాం’ అని సూచించారు. కానీ... జగన్‌ వినిపించుకోలేదు. ‘‘డబ్బుల విషయం మీకేందుకు. అన్నీ నేను చూసుకుంటాను. మీరు ముందు పనులు ప్రారంభించండి. మూడేళ్లలో 16 మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి రావాలి’’ అని ఆదేశించారు. అప్పటి నుంచి నిధుల వేట ప్రారంభించారు. రూ.8500 కోట్లు అప్పు తెచ్చి 16 మెడికల్‌ కాలేజీలు కట్టేస్తామని చెప్పారు. వీటికి అప్పుల కోసం ప్రభుత్వం, ఆరోగ్యశాఖ అడగని బ్యాంక్‌ లేదు! ఎక్కని మెట్లు లేవు! చివరికి 16 కొత్త కాలేజీల భూములు, 11 ప్రస్తుత కాలేజీల ఆస్తులు తాకట్టు పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు. ప్రైవేటు కాలేజీల తరహాలో ఎంబీబీఎస్‌ సీట్లు(MBBS seats) అమ్మి ఆ డబ్బులతో అప్పులు తిరిగి కడతామన్నారు. పేదలకు పనికొచ్చే రూ.కోట్ల ఆరోగ్యశ్రీ నిధులు మళ్లించారు. ‘ఆయన’ వస్తే రుణాలు వచ్చేస్తాయని ఒక కొత్త అధికారిని కూడా నియమించుకున్నారు. ఇప్పటికీ ఆ అధికారి మీడియా కళ్లుగప్పి రుణాల కోసం ముంబై చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయినా... ఫలితం శూన్యం. మూడేళ్ల తర్వాతే సీఎంకి అసలు తత్వం బోధపడింది. అధికారులు చెప్పిందే నిజమైంది. నిధులు అందుబాటులో లేకపోవడంతో... మిగిలినవన్నీ వదిలేసి తొలుత విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల కాలేజీలను ఈ ఏడాది డిసెంబరుకి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ... ఆ పనులు పూర్తి కావడం కష్టంగానే మారింది.


కేంద్రం నిధుల కోసం...

బ్యాంకుల నుంచి అప్పు పుట్టకపోవడంతో జగన్‌ కేంద్రమే దిక్కు అనే స్థితికి వచ్చారు. నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి... కొత్త మెడికల్‌ కాలేజీలకు కేంద్రం ఆర్థిక సహాయం చేస్తోంది. ఒక్కో మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి రూ.325 కోట్లు వ్యయమవుతుందనే అంచనాతో... అందులో 60 శాతం నిధులను కేంద్రం భరిస్తుంది. మిగిలింది రాష్ట్ర వాటా! ఈ పథకం కింద ఏలూరు, మర్కాపురం, పులివెందుల, విజయనగరం, పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నం మెడికల్‌ కాలేజీలకు సుమారు రూ.3000 వేల కోట్లు నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కానీ... వీటిలో పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నం మెడికల్‌ కాలేజీలకు మాత్రమే ప్రమాణాలకు లోబడి నిధులు ఇస్తామని కేంద్రం తెలిపింది. ఈ 3 కాలేజీలకు కలిపి కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.585 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.303.04 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది.


పైసా ఇవ్వని రాష్ట్రం... 

3 కాలేజీలకు కేంద్రం రూ.585 కోట్లు కేటాయించగా... విజయనగరం, రాజమండ్రి, పులివెందుల కాలేజీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1146 కోట్లు నాబార్డు నుంచి అప్పుగా తీసుకుంది. అంటే... మొత్తం ఆరు కాలేజీలకు కేంద్రం, నాబార్డు నుంచి అందుబాటులో ఉన్న డబ్బులు రూ.1731 కోట్లు. మరి... మిగిలిన కాలేజీల పనులకు రాష్ట్ర నిధులు ఖర్చు పెడుతున్నారనుకుంటే తప్పులో కాలేసినట్లే! ఇక్కడ రాష్ట్రం అతి తెలివి ప్రదర్శించి రూ.1731 కోట్లనే 16 మెడికల్‌ కాలేజీల కోసం వాడుతున్నట్లు తెలిసింది. కాలేజీల పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతా నుంచి ఒక్క రూపాయీ విడుదల చేయలేదని సమాచారం! కేంద్రం అనుమతిచ్చిన 3 కాలేజీలకు రాష్ట్రం 40 శాతం వాటా కింద రూ.620 కోట్లు, నాబార్డు కింద కట్టే మూడు కాలేజీలకు అదనంగా రూ.329 కోట్లు ఇవ్వాల్సి ఉంది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరు కాలేజీలకు కలిపి రూ.949 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. కానీ కేంద్రం, నాబార్డు నుంచి తీసుకోవడం తప్ప రాష్ట్ర వాటా కింద మాత్రం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం విడుదల చేయడం లేదు. దీంతో మొత్తం కాలేజీల పనులు నీరసిస్తున్నాయి. ఇలా కాకుండా మొదట్లోనే అధికారులు చెప్పినట్లుగా తొలి దశలో మూడు లేదా నాలుగు కాలేజీల పనులు చేపట్టి ఉంటే ఈ పాటికే అవి అందుబాటులోకి వచ్చేవి. అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగిన అధికారులు అలసిపోయారు. ఇక బ్యాంకులను నమ్ముకొని లాభం లేదనే అంచనాకు వచ్చారు. మళ్లీ కేంద్రాన్నే ఆశ్రయించాలని భావిస్తున్నారు. ఎంత గట్టిగా ప్రయత్నించినా 2027 తర్వాతే కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేయగలమన్న సృష్టత అధికారులకు వచ్చింది.

Read more