బాంబే IITలో సీటే అందరి లక్ష్యం! జెఈఈ మెయిన్‌ టాపర్స్‌ వాయిస్‌

ABN , First Publish Date - 2022-08-10T21:42:43+05:30 IST

జేఈఈ మెయిన్‌ ఫలితాలు(JEE Main Results) విడుదలయ్యాయి. ఇందులో టాప్‌ రెండున్నర లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు తద్వారా ఐఐటీలో చేరేందుకు అవకాశం లభిస్తుంది. జేఈఈ మెయిన్‌లో సాధించిన ర్యాంక్‌ ఆధారంగా ఎన్‌ఐటీ సహా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న

బాంబే IITలో సీటే అందరి లక్ష్యం! జెఈఈ మెయిన్‌ టాపర్స్‌ వాయిస్‌

జేఈఈ మెయిన్‌ ఫలితాలు(JEE Main Results) విడుదలయ్యాయి. ఇందులో టాప్‌ రెండున్నర లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు తద్వారా ఐఐటీలో చేరేందుకు అవకాశం లభిస్తుంది. జేఈఈ మెయిన్‌లో సాధించిన ర్యాంక్‌ ఆధారంగా ఎన్‌ఐటీ సహా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఇంజనీరింగ్‌ సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. జేఈఈ మెయిన్‌లో ఇరవై నాలుగు మంది వంద పర్సంటైల్‌ సాధించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ప్రిపేరవుతున్న వారిలో కొంత మంది తమ ప్రిపరేషన్‌పై విలువైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.  బాంబే ఐఐటీ(Bombay IIT)లో  సీఎస్‌ఈలో చేరడమే వారందరి ఆకాంక్ష. అదే తమ గోల్‌ అని కుండబద్దలు కొట్టారు. తదుపరి కొందరు పరిశోధన వైపు మొగ్గు చూపితే మరికొందరు సొంతంగా స్టార్ట్‌పపై ఆసక్తి కనబరిచారు. కొద్దిమంది సివిల్స్‌ తమ లక్ష్యం అని చెప్పారు. జేఈఈ  మెయిన్‌లో ప్రధాన టాపిక్స్‌ మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలో ఒకొక్కరు ఒక్కోదానిలో వీక్‌. దానిపై పట్టు సాధించేందుకు స్టడీ అవర్స్‌లో ఎక్కువ సమయం కేటాయించుకున్నామని తెలిపారు. అలా అని మిగిలిన వాటిని నిర్లక్ష్యం చేయలేదని, తమ లెక్చరర్లు, మెంటార్ల సహకారంతో అడ్డంకులను అధిగమించి ర్యాంకు సాధించామని తెలిపారు. 


కలిసిన కొద్దిమందిలో ఒకొక్కరుగా ఏమి చెప్పారంటే..


భయాన్ని వీడాలి

ఇంటర్‌లో మార్కులు: 962

తండ్రి: ఆదినారాయణ(ఇంజనీరింగ్‌ కాలేజీలో లైబ్రేరియన్‌)

తల్లి: నందకుమారి(ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్స్‌)

సోదరుడు: సాయిమనోజ్‌ కుమార్‌(శ్రీసిటీ ఐఐఐటీలో బీటెక్‌)

ఇలాంటి టెస్టులు రాసేటప్పుడు భయం ఉండకూడదు. మనకు మనమీద విశ్వాసం ఉండాలి. ప్రిపరేషన్‌లో ఎక్కడా లొసుగులు ఉండకూడదు. మొదట్లో కొద్దిగా కెమిస్ట్రీ ఇబ్బందిగా అనిపించేది. టీచర్లు చెప్పిన మీదట, సందేహాలు తీర్చుకున్నాక ఆ ఇబ్బంది తొలగింది. ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో చిన్న చిన్న క్లారిఫికేషన్స్‌ ఎక్కువ ఉంటాయి. వాటన్నిటినీ క్లియర్‌ చేసుకున్నాను. అప్పుడు నమ్మకం ఏర్పడింది. మేథ్స్‌, ఫిజిక్స్‌కు సంబంధించి అసైన్‌మెంట్స్‌ బాగా చేశాను. ఎప్పుడైనా సరే, 50 శాతం పాఠం విన్నమీదట తెలుస్తాయి. మరో 30 శాతం ప్రాక్టీస్‌తో లభిస్తాయి. చివరి ఇరవై శాతానికి మాత్రం చాలా కష్టపడాలి. కాన్సెప్ట్‌ లెర్నింగ్‌, అప్లికేషన్‌ అన్నవి ఎక్కువ పరీక్షలు రాయడం ద్వారానే తెలుస్తాయి. ఆ ప్రాక్టీస్‌ ఎక్కువ లేకుంటే పర్ఫెక్షన్‌ రాదు. ప్రాక్టీస్‌లో భాగంగానే తప్పులకు ఆస్కారం లేకుండా చూసుకోవాలి. ఒకవేళ తప్పు చోటుచేసుకుంటే అదే పదేపదే రిపీట్‌ కాకుండా జాగ్రత్త పాటించాలి. తప్పు రిపిటేషన్‌ అన్నది ఉండకూడదు. స్టడీ ఫస్ట్‌, తరవాత నాకు సినిమాలంటే చాలా ఇష్టం. ఇప్పటికీ ఐఐటీలో చేరడమే  నా లక్ష్యం. 


క్లారిటీతో ప్రాక్టీస్‌

ఇంటర్‌లో మార్కులు: 972

తండ్రి: రవిశంకర్‌(ప్రభుత్వ టీచర్‌)

తల్లి: స్వరాజ్యలక్ష్మి(ప్రభుత్వ టీచర్‌)

సోదరుడు: జైదీప్(ఎయిమ్స్‌, ఢిల్లీలో మెడిసిన్‌)

కెమిస్ట్రీలో గుర్తుంచుకోవడానికి పదేపదే చదవడం ఒక్కటే మార్గం. మేథ్స్‌ నాకు చాలా సులువు అనిపిస్తుంది. ఫిజిక్స్‌ ఇబ్బందిగా ఏమీ ఉండదు. మేథ్స్‌లో సరిపోను ప్రాక్టీస్‌ ఉండాలి. ఫిజిక్స్‌లో కాన్సెప్ట్‌ ఫౌండేషన్‌ చాలా అవసరం. కెమిస్ట్రీలో పటు కోసం జ్ఞాపకశక్తి బాగా ఉండాలి. అందులో ఎక్కువ మెమెరీ ఆధారితం. లెర్నింగ్‌, ప్రాక్టీస్‌, అప్లికేషన్‌... మూడూ ముఖ్యమే. రివిజన్‌ కూడా చాలా లోతుగా జరగాలి. క్షుణ్ణంగా నేర్చుకుంటే సగం పని అవుతుంది. తదుపరి ప్రాక్టీస్‌ మొదలుపెట్టాలి. వేర్వేరు ప్రాబ్లెమ్స్‌కు ఎక్స్‌పోజ్‌ కావాలి. ఏ ప్రశ్నకు మరే కాన్సెప్ట్‌ అన్నది తెలియాలంటే ఎగ్జామ్స్‌ను భయం లేకుండా రాయాలి. ఎక్కువ పరీక్షలు రాస్తేనే అసలు టెస్టులో ప్రశ్నను చూడగానే సంబంధిత కాన్సెప్ట్‌ తళుక్కున మదిలోకి వస్తుంది. సందేహాలతో బ్రేక్‌ ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు అవి తెలుసుకుని, క్లారిటీతో నేర్చుకుంటే సాఫీగా ప్రాక్టీస్‌ ముందుకు సాగిపోతుంది. ప్రిపరేషన్‌లో ఎక్కడా లోపం రానివ్వకూడదు. నేను పాటించేది అదే. చదువు తరవాత సినిమాలు అంటే నాకు ఎక్కువ ఇష్టం.


ప్రామాణిక పుస్తకాలకు ప్రాధాన్యం

ఇంటర్‌లో మార్కులు: 983 

తండ్రి: గోవిందరావు(ప్రభుత్వ టీచర్‌)

తల్లి: జయలక్ష్మి(గృహిణి)

సోదరి: లావణ్య(మెడిసిన్‌)

ప్రతి సబ్జెక్టుకు కొన్ని ప్రామాణిక పుస్తకాలు ఉన్నాయి. వాటిని పూర్తి చేశాను. అలాగే నాకు కొద్దిగా బెరుకుగా ఉండే కెమిస్ట్రీలో సందేహాలను ఎప్పటికప్పుడు సార్‌లను అడిగి తెలుసుకునేదాన్ని. మిగిలిన రెండు సబ్జెక్టులకు అసైన్‌మెంట్స్‌తో పట్టు లభించింది. సబ్జెక్టు ఏదైనప్పటికీ నోట్స్‌ పర్ఫెక్ట్‌గా ఉంచుకోవాలి. అదే బాగా పనిచేస్తుంది. ప్రాబ్లెమ్స్‌ను పదేపదే సాల్వ్‌ చేయడం ద్వారా పర్ఫెక్షన్‌ వస్తుంది. తప్పులు పదేపదే రిపీట్‌ కాకుండా చూసుకోవాలి. ప్రాబ్లెమ్స్‌ సాల్వింగ్‌కు సంబంధించి విపరీతమైన ఎక్స్‌పోజర్‌ బాగా ఉపయోగపడుతుంది. అప్పుడు పరీక్షలో ఎటునుంచి మరెటు ప్రశ్న అడిగినప్పటికీ తడబాటుకు లోనుకాము. ప్రశ్న అర్థం కాకపోవడం అంటూ ఏమీ ఉండదు. కాన్సెప్టు సహా నేర్చుకోవడం, ప్రాక్టీస్‌, రివిజన్‌ ఏ టెస్టు రాసేందుకైనా మూలం అని చెప్పకతప్పదు. జాతీయ స్థాయిలో అయినా మరేదైనా టెస్టు రాస్తున్నప్పుడు అందులో అత్యున్నత స్థాయిని అందుకునేందుకు అసలు ఏమి తెలుసుకోవాలి, మరేవి నేర్చుకోవాలి అన్న అవగాహన ఉండాలి. వాటన్నింటినీ మదిలో పెట్టుకుని ప్రాక్టీస్‌ను పక్కాగా చేస్తే ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాదు.


సులువు నుంచి కష్టానికి

ఇంటర్‌లో మార్కులు: 937

తండ్రి: కోటేశ్వరరావు(బిజినెస్‌)

తల్లి: కోటేశ్వరమ్మ(గృహిణి)

సోదరుడు: నీల్‌కాంత్‌(ఎనిమిదో తరగతి)

ఆరంభంలో కెమిస్ట్రీలో వీక్‌. అయితే టీచింగ్‌తో కలిపి స్టడీ అవర్స్‌ రోజుకు పద్నాలుగు గంటలు కాగా కెమిస్ట్రీకి ఆరు గంటలు కేటాయించుకునేవాడిని. కెమిస్ట్రీలో మూడు భాగాలు. ఫిజికల్‌ కెమిస్ట్రీపై పట్టుకోసం కాన్సెప్ట్‌పై క్లారిటీ సాధించి ప్రాక్టీస్‌పై దృష్టిపెట్టేవాడిని. ఆర్గానిక్‌ కెమిస్ట్రీ కోసం మెకానిజం ఆధారంగా రియాక్షన్స్‌ను అర్థం చేసుకునేవాడిని. ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ కోసం బాగా చదివే వాడిని. అదే మేథ్స్‌, ఫిజిక్స్‌ విషయానికి వస్తే కాన్సెప్ట్‌ క్లారిటీ ఆపై ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇచ్చేవాడిని. ఇంటర్నల్‌ టెస్టుల్లో మార్కులు తగ్గితే తప్పు ఎక్కడ దొర్లింది చూసుకుని అది మళ్ళీ జరగకుండా చూసుకునేవాడిని. అందుకు కాన్సెప్ట్‌ సహా అంతా మొదటి నుంచి నేర్చుకునేవాడిని. ఏ రోజైనా ఒక సబ్జెక్టులో నాలుగు టాపిక్స్‌ లేదంటే కాన్సెప్ట్స్‌ నేర్చుకోవాలంటే సులువుతో మొదలుపెట్టే వాడిని. కష్టంగా ఉన్నవాటిని చివర్లో ఉంచుకుని,ఎక్కువ సమయం అందుకోసం వెచ్చించేవాడిని. బాగా ఒత్తిడి అనిపించినప్పుడు అమ్మ,నాన్నతో మాట్లాడే వాడిని. నాకు క్రికెట్‌ తప్ప ఏ ఆటైనా ఇష్టమే. రీసెర్చ్‌ నా గోల్‌.   ఆ దిశగానే నా కెరీర్‌ను తీర్చిదిద్దుకోదలిచాను. 
ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్‌తో టైమ్‌ మేనేజ్‌మెంట్‌


ఇంటర్‌లో మార్కులు: 975

తండ్రి: సిమ్మన్న(టీచర్‌)

తల్లి: సుధారాణి(గృహిణి)

సోదరుడు: సుస్రుత్‌(మెడిసిన్‌)

మొదట్లో నాకు ఫిజిక్స్‌ కష్టంగా అనిపించేది. సార్‌ దగ్గర కాన్సెప్టులు నేర్చుకుని, అదే పనిగా ప్రాబ్లెమ్స్‌ను ప్రాక్టీస్‌ చేయడం ద్వారా ఆ సమస్యను అధిగమించాను. కెమిస్ట్రీ కోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలపై ఆధారపడ్డాను. ఆర్గానిక్‌, ఫిజికల్‌ కెమిస్ట్రీకి నా నోట్స్‌ సరిపోయింది. రోజువారి అసైన్‌మెంట్స్‌తో మేథ్స్‌లో పట్టువచ్చింది. ఫిజిక్స్‌కీ అదే పద్ధతిని పాటించాను. సందేహం వస్తే మొదట స్నేహితులతో చర్చించేవాడిని. ఇంకా క్లారిటీ రాకుంటే మాత్రం సార్‌ లేదంటే మెంటార్‌ను అడిగి క్లియర్‌ చేసుకునేవాడిని. ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్‌ ఎక్కువ రాయడంతో టైమ్‌ మేనేజ్‌మెంట్‌ బాగా తెలిసివచ్చింది. అంటే అసలు ఎగ్జామ్‌ రాసినప్పుడు టైమ్‌ విషయంలో జాగ్రత్తగా ఉండటం అన్నది ఆటోమేటిక్‌గా కుదిరింది.  మేథ్స్‌ విషయంలో క్రమం   తప్పకుండా ప్రాక్టీస్‌ ఉండాలి. ఫిజిక్స్‌లో కాన్సెప్టులు తెలియాలి, ప్రాక్టీస్‌ ఉండాలి. కెమిస్ట్రీకి ఎక్కువ సేపు చదివితే సరిపోతుంది.  క్రికెట్‌ నాకు ఇష్టమైన క్రీడ.

Read more