Jagan Govt: చదువులు చెప్పే గురువులపై కక్షగట్టారు!

ABN , First Publish Date - 2022-12-06T11:02:42+05:30 IST

పాఠశాలలు మూసివేయద్దని, విలీనాల పేరున పాఠశాలలను విద్యార్థులకు దూరం చేయొద్దని, సంస్కరణల పేరున విద్యా వ్యవస్థను బలహీనపరచవద్దని అడిగిన నేరానికి ఉపాధ్యాయుల

Jagan Govt: చదువులు చెప్పే గురువులపై కక్షగట్టారు!
గురువులపై కక్షగట్టారు!

పాఠశాలలు మూసివేయద్దని, విలీనాల పేరున పాఠశాలలను విద్యార్థులకు దూరం చేయొద్దని, సంస్కరణల పేరున విద్యా వ్యవస్థను బలహీనపరచవద్దని అడిగిన నేరానికి ఉపాధ్యాయుల (Teachers)పై జగన్‌ ప్రభుత్వం (Jagan Govt.) కక్షపూరితంగా వ్యవహరించడం ఏ మాత్రం క్షంతవ్యం కాదు. గతంలో ప్రభుత్వాలకు, ఉపాధ్యాయ సంఘాలకు వివిధ సందర్భాలలో అభిప్రాయ భేదాలు వచ్చినా, వాటిని చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకున్నారు. కానీ ఇలా ప్రభుత్వమే కర్కశంగా వ్యవహరించిన తీరు ఎన్నడూ లేదు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసమూ, ప్రభుత్వం హామీ ఇచ్చిన సీపీఎస్‌ రద్దు వంటి అంశాల అమలు కోసమూ ఉద్యమిస్తున్న ఉపాధ్యాయులను అక్రమంగా అరెస్టు చేయించడం, గృహ నిర్బంధాలకు పాల్పడటం, వారిపై బైండోవరు కేసులు పెట్టడం, పాఠశాలల వద్ద కూడా పోలీసు పహారా పెట్టడం వంటి విపరీత చర్యలు సభ్య సమాజం, సాధారణ పౌరులు ఈసడించుకునేవిగా ఉన్నాయి. ఇంత అనుచితంగా ప్రవర్తించడానికి ఉపాధ్యాయులేమైనా రౌడీషీటర్లని అనుకుందా ప్రభుత్వం? విద్యార్థులపై ఈ చర్యల ప్రభావం ఏ రకంగా పడుతుందన్న కనీసమైన ఆలోచన కూడా లేదా ప్రభుత్వానికి?

దేశ భవిష్యత్తు పాఠశాలల నాలుగు గోడల మధ్యే నిర్మితమవుతుందని 1966లో విద్యా రంగంపై కొఠారి కమిషన్‌ తన నివేదిక మొదటి వాక్యంలో పేర్కొంది. ఆ గోడల మధ్య ఉపాధ్యాయులు నేర్పే విద్య ద్వారానే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరతారు. అక్షరాస్యతలో అగ్రభాగాన ఉన్న నార్వే, స్వీడన్‌, ఫిన్‌లాండ్‌, డెన్మార్క్‌ వంటి దేశాలే ఆర్థిక, సామాజిక, పౌరుల ఉన్నత ప్రమాణాల వంటి అన్ని అంశాల్లోనూ కూడా అగ్రభాగాన ఉన్నాయి. సమాజంలో విద్యకున్న ప్రాధాన్యత అటువంటిది. కానీ, ప్రపంచ దేశాలతో పోలిస్తే నేడు మన దేశం 73శాతం అక్షరాస్యతతో 191 దేశాలకు గాను 145వ స్థానంలో ఉంది. అందులో కూడా ఆంధ్ర రాష్ట్రం 67శాతం అక్షరాస్యతతో దేశంలోని 36 ప్రాంతాలకు గాను 31వ స్థానంలో ఉండడం సిగ్గుపడవలసిన విషయం. దాన్ని ఎలా మెరుగుపరచాలా అని ఆలోచన చేయవలసిన ప్రభుత్వం, విచిత్రంగా దాన్ని ఇంకా అగమ్యగోచరంలోనికి నెట్టేసే విధానాలను అవలంబిస్తోంది.

ప్రభుత్వాలు కొన్ని సందర్భాలలో పొరపాట్లు చేయడం అసహజమేమీ కాదు. కానీ ఆ పొరపాట్లను వేలెత్తి చూపడమే నేరంగా చూడడమే అసలైన నేరం. అటువంటి నేరానికే రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతోంది. తప్పులు సరిచేసుకోండి మహాప్రభో అని చెప్పిన ప్రోగ్రసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ శాసనమండలి సభ్యులు, సమాజంలో గౌరవ స్థానాలలో ఉన్న కెఎస్‌.లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వర రావు, షేక్‌ సాబ్జీ వంటి ఉన్నత విద్యావంతుల పట్ల కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని, అరెస్టులు చేయడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి?

ఈ ప్రభుత్వం నేడు ఉపాధ్యాయులకు బోధనేతర పనులను ఎక్కువగా అప్పగిస్తోంది. బాత్ రూములు, మధ్యాహ్న భోజనం, హాజరు వంటి వివిధ ఏప్‌ల పేరున పని భారం పెంచుతోంది. దీనివల్ల సహజంగానే పాఠాలు చెప్పడానికి వెచ్చించే సమయం తగ్గుతోంది. ‘మమ్మల్ని ఈ బోధనేతర పనుల నుంచి తప్పించి, పాఠాల మీదే సమయాన్ని వెచ్చించే అవకాశం కల్పించండి’ అని ప్రభుత్వానికి ఉపాధ్యాయులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం కలగలేదు. సరికదా, తాజాగా ప్రభుత్వం ఆ పనులన్నింటినీ అలాగే ఉంచి, బోధనేతర పనులని చెప్పి, వీరిని ఎప్పుడో ఐదేళ్ళకోసారి వచ్చే ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఆగమేఘాల మీద నిర్ణయించింది. దీని వెనుక మర్మమేమిటో కొద్దిగా ఆలోచించేవారెవరికైనా ఇట్టే అర్థమవుతుంది.

ఇప్పడు ప్రభుత్వం ఏం చేయాలి, ఉపాధ్యాయులు ఏం చేయాలీ అన్నదాని కంటే ముఖ్యమైనది పౌర సమాజం ఏం చేయాలీ అన్నది. ఇదేదో మనకు సంబంధించిన సమస్య కాదు అనుకుంటే పొరపాటే. సమాజం పురోగమనంలో ముందుకు సాగాలంటే అంతిమంగా ప్రజలే సూత్రధారులు, పాత్రధారులు. ఎవరైనా ఆ పురోగమనానికి అడ్డంకిగా ఉంటే ప్రమాదమే. అందులోనూ ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వమే అడ్డంకిగా ఉంటే ఇంకా ప్రమాదం. భావి భారత సమాజ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించే గురువులకు అవమానం జరగడమంటే, అది మొత్తం సమాజానికి జరిగినట్లే. అందుకే తమ పిల్లలకు చదువు సంధ్యలు చెప్పే ఉపాధ్యాయులకు పౌరసమాజం భరోసాగా నిలబడాలి.

-ఎ. అజ శర్మ

ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక

Updated Date - 2022-12-06T11:02:44+05:30 IST