చదువుల తల్లికి నేషనల్‌ స్థాయిలో గుర్తింపు

ABN , First Publish Date - 2022-09-29T17:26:27+05:30 IST

తమ భూములు పోయినా పర్వాలేదు. ఈ ప్రాంతం వారు ఉన్నతస్థాయికి ఎదగాలనే సంకల్పంతో ఆనాటి రైతులు, కలెక్టర్‌ బీఎస్‌ రామన్‌ చేసిన కృషికి ఎందరో జీవితాల్లో వెలుగులు నిండాయి. మొక్కగా మొదలై చెట్టుగా ఎదిగి ఎందరినో ఉన్నతస్థాయికి చేరుస్తూ

చదువుల తల్లికి నేషనల్‌ స్థాయిలో గుర్తింపు

రైతులు, అప్పటి కలెక్టర్‌ కృషితో విద్యావృక్షానికి బీజం

మొక్కగా మొదలై చెట్టుగా ఎదిగి ఎందరినో ఉన్నతస్థాయికి చేర్చిన కళాశాల

ఇటీవల కళాశాలను పరిశీలించిన న్యాక్‌ బృందం

చదువుతో పాటు ఆహ్లాద వాతావరణాన్ని అందిస్తున్న కళాశాలకు మంత్రముగ్ధులైన బృందం

పరిశీలన అనంతరం ఏ గ్రేడ్‌ ప్రకటించిన బృందం

న్యాక్‌ బృందం గుర్తింపుతో స్వయం ప్రతిపత్తి పొందిన కళాశాల

అనేక కోర్సులకు ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతున్న కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల


కామారెడ్డి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): తమ భూములు పోయినా పర్వాలేదు. ఈ ప్రాంతం వారు ఉన్నతస్థాయికి ఎదగాలనే సంకల్పంతో ఆనాటి రైతులు, కలెక్టర్‌ బీఎస్‌ రామన్‌ చేసిన కృషికి ఎందరో జీవితాల్లో వెలుగులు నిండాయి. మొక్కగా మొదలై చెట్టుగా ఎదిగి ఎందరినో ఉన్నతస్థాయికి చేరుస్తూ వస్తోంది కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Kamareddy Govt Degree College). అట్లాంటి కళాశాలకు నేషనల్‌ స్థాయిలో గుర్తింపు(National level recognition) లభించడం పట్ల ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు, అధ్యాపకులు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో న్యాక్‌బృందం కళాశాల పరిశీలనకు వచ్చి కళాశాల పరిసరాల్లో, ఉన్న కోర్సులు, విద్యార్థులకు చదువుతో పాటు ఆహ్లాదమైన వాతావరణాన్ని అందించడం పట్ల మంత్రముగ్దులై కళాశాలకు ఏ గ్రేడ్‌ ప్రకటించారు. దీంతో కళాశాలకు స్వయం ప్రతిపత్తి వచ్చింది. అనేక కోర్సులకు ఆహ్వానం పలుకడంతో పాటు ప్రస్తుతం నిజామాబాద్‌, హైదరాబాద్‌ లాంటి ప్రాంతాలకు వెళ్తున్న విద్యార్థులకు ఇక్కడే అడ్మిషన్‌లు తీసుకునే అవకాశం లభించింది.


రైతులు, అప్పటి కలెక్టర్‌ కృషితో విద్యావృక్షానికి బీజం

కామారెడ్డి ప్రాంతంలో ఉన్నత విద్యావకాశాలు లేకపోవడంతో 1964 సంవత్సరంలో అప్పటి కలెక్టర్‌ బీఎన్‌ రామన్‌ ఆధ్వర్యంలో కేఆర్‌. రాజిరెడ్డి, కేపీ. రాజిరెడ్డి, విఠల్‌రెడ్డి, నారాయణరావు తదితర పెద్దమనుషులు కలిసి కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీని ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేసి రైతులకు వివరించారు. దీంతో రైతులు ముందుకు వచ్చి భూములు అందించడంతో కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాలను స్థాపించారు. కామారెడ్డి పట్టణం మూడు, నాలుగు జిల్లాలకు ప్రధాన కూడలిగా ఉండేది. ఈ ప్రాంతం చెరుకు సాగు, బెల్లం తయారీకి పెట్టింది పేరుగా ఉండేది. హైదరాబాద్‌కు 110 కి.మీ దూరం ఉన్నా విద్యావసతి లేకపోవడంతో చాలా మంది పదో తరగతి చదివి చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టేవారు. చదువులకు మధ్యలోనే ఫుల్‌స్టాప్‌ పెట్టడంతో పలువురిని కలిచివేయడంతో ఓ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలకు అనుగుణంగా రైతుల నుంచి 262 ఎకరాల భూమిని సేకరించి అందులో భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా రెండోంతస్తుల భారీ భవనాన్ని నిర్మించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టి కాలేజీకి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు.


ఉన్నతస్థాయిలో స్థిరపడ్డ కళాశాల విద్యార్థులు

కళాశాలలో చదువుకున్న విద్యాకుసుమాలు ఇప్పుడు దేశ, విదేశాలతో పాటు ఉన్నతస్థాయిలో స్ధిరపడ్డారు. ఆనాటి కలెక్టర్‌, పెద్దమనుషులు, రైతులు ఆశయాలను నిజం చేస్తూ కళాశాల ఎందరికో అండగా నిలిచి ఉన్నత శిఖరాలకు చేర్చింది. కామారెడ్డి జిల్లాగా ఏర్పడినప్పటి కలెక్టర్‌గా వచ్చిన, ప్రస్తుతం రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కమిషనర్‌ సత్యనారాయణ ఈ కళాశాల విద్యార్థే. ఐఫీఎస్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్‌, సోమశేఖర్‌రెడ్డి, జపాన్‌లో పనిచేస్తున్న శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డితో పాటు పోలీసు, లాయర్‌, డాక్టర్‌లుగా, రాజకీయ నాయకులుగా స్థిరపడిన ఎందరితో పాటు ఈ కళాశాలలో అధ్యాపకులుగా చేస్తున్న పలువురు ఈ కళాశాల బిడ్డలే కావడం గమనార్హం. ప్రైవేట్‌కు దీటుగా ప్రతిఏటా పదుల సంఖ్యలో ఉన్నత ర్యాంకులు సాధించడమే కాకుండా జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా నిలదొక్కుకునేలా కల్పిస్తున్న చదువుల తల్లి కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనడంలో అతిశయోక్తి లేదు. బీఎస్‌సీ ఫారెస్ట్రి, బీఎస్‌సీ ఫిషరీస్‌, బయో టెక్నాలజీ, మైక్రో బయోలజీ లాంటి తదితర కోర్సులతో పాటు పలు పీజీ కోర్సులు అందిస్తోంది.


న్యాక్‌ బృందం గుర్తింపుతో స్వయంప్రతిపత్తి పొందిన కళాశాల

ఎన్నో ఏళ్లుగా తన ఒడిలో చేరిన విద్యార్థులకు అద్భుతంగా తీర్చిదిద్దిన కళాశాలకు న్యాక్‌ బృందం గుర్తింపుతో స్వయం ప్రతిపత్తి రావడంతో పాటు దేశవ్యాప్త గుర్తింపులో నిలిచింది. ఈనెల 21, 22 తేదీల్లో కళాశాల పరిశీలనకు వచ్చిన న్యాక్‌ బృందం కళాశాలలో అందిస్తున్న కోర్సులను, అధ్యాపక బృందం చేస్తున్న కృషిని, కళాశాలలో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంను అందిస్తుండడం పట్ల మంత్రముగ్దులైన బృందం సభ్యులు కళాశాలకు 3.22 సీజీపీఏతో  ఏ గ్రేడ్‌ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. రూ.5 కోట్ల నిధులను కళాశాల అభివృద్ధికి రానున్నాయి. ఈ నిధులతో అనేక కోర్సులను తీసుకురావడంతో పాటు విద్యార్థులకు వసతులు, సౌకర్యాలు కల్పించవచ్చునని కళాశాల అధ్యాపక బృందం పేర్కొంటుంది. మరిన్ని కోర్సులను తీసుకువచ్చి కామారెడ్డితో పాటు చుట్టు పక్కల జిల్లాల వారికి కూడా మంచి విద్యను అందించవచ్చని పేర్కొంటున్నారు.


కళాశాలకు ఏ గ్రేడ్‌ రావడం హర్షించదగిన విషయం

- కిష్టయ్య, ప్రిన్సిపాల్‌, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల

ఎందరినో ఉన్నత శిఖరాలకు చేర్చిన కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రతీ సంవత్సరం ఎంతో మందిని విద్యాకుసుమాలుగా తీర్చిదిద్దుతుంది. అట్లాంటి కళాశాలకు దేశస్థాయిలో గుర్తింపు రావడం హర్షించదగిన విషయం. ఇటీవల న్యాక్‌ బృందం పరిశీలించి కళాశాలకు 3.22 సీజీపీఏతో ఏ గ్రేడ్‌ ప్రకటించారు. దీంతో కళాశాలకు రూ.5 కోట్ల నిధులు రానున్నాయి. ఈ నిధులతో అనేక కోర్సులను తీసుకురావడంతో పాటు విద్యార్థులకు వసతులు, సౌకర్యాలు కల్పించవచ్చు

Updated Date - 2022-09-29T17:26:27+05:30 IST