పాత పద్ధతిలోనే పరీక్షలు

ABN , First Publish Date - 2022-10-04T21:54:35+05:30 IST

పాఠశాల విద్యలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు క్లాస్‌రూమ్‌ బేస్డ్‌ అసెస్‌మెంట్‌ (సీబీఏ) పద్ధతిలో పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం

పాత పద్ధతిలోనే పరీక్షలు

ఓఎమ్మార్‌ షీట్‌ ద్వారా బిట్‌లు గుర్తించాలి

నవంబరు 2వ తేదీ  నుంచి పరీక్షలు 

ఎఫ్‌ఏ-1కు బదులుగా సీబీఏ-1 పద్ధతిలో పరీక్షలు


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : పాఠశాల విద్యలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు క్లాస్‌రూమ్‌ బేస్డ్‌ అసెస్‌మెంట్‌  (సీబీఏ) పద్ధతిలో పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.  ఓఎమ్మార్‌ షీట్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ ఉన్నతాధికారులు గత నెలలో చెప్పారు. ఓఎమ్మార్‌ షీట్ల ద్వారా 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించే విషయంపై విమర్శలు రావడంతో కొద్దిపాటి మార్పులు చేసి పరీక్షలు నిర్వహించేందుకు బ్లూప్రింట్‌ను విడుదల చేశారు. ఓఎమ్మార్‌ షీట్‌తో పాటు జవాబులు రాసే విధానంలోనూ పరీక్షలు జరుపుతారు. 


నవంబరు 2వ తేదీ నుంచి పరీక్షలు

గతంలో దసరా సెలవులకు ముందే పాఠశాల స్థాయిలో సమ్మెటివ్‌-1 పరీక్షలు నిర్వహించేవారు. దసరా సెలవుల తరువాత అక్టోబరులో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే సీబీఏ పద్ధతిలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతో నవంబరు 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ప్రాథమిక స్థాయిలో 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నవంబరు 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పరీక్షలు జరుపుతారు. 6 నుంచి 8 తరగతులకు సీబీఏ పద్ధతిలో 9, 10 తరగతులకు నిర్మాణాత్మక మూల్యాంకన పద్ధతిలో పరీక్షలు జరపనున్నారు. పాఠశాలలు ప్రారంభమైన 5 నెలలకు పరీక్షలు నిర్వహిస్తుండటం గమనించదగ్గ అంశం. గతంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆయా సబ్జెక్టుల వారీగా ప్రశ్నాపత్రాలు తయారుచేసి విద్యార్థులకు ఇచ్చి జవాబులు రాయించేవారు. ఈ ఏడాది పరీక్షల్లో ప్రయోగాలు చేస్తుండటం గమనించదగ్గ అంశం.


ప్రశ్నాపత్రంలో నాలుగు రకాల ప్రశ్నలు 

సీబీఏ పద్ధతిలో తయారు చేసే ప్రశ్నాపత్రంలో బిట్‌లు, చాలా చిన్న సమాధానాలు, సంక్షిప్త జవాబులు, దీర్ఘ సమాధానాలు ఉంటాయి. ఇందులోనే పాఠ్యపుస్తకంలో ఉన్నది ఉన్నట్లుగా రాయడం, పాఠ్యాంశంపై ఉన్న అవగాహనతో జవాబు రాయడం, పాఠ్యాంశంలో  ఉన్న విషయాన్ని అర్థం చేసుకుని జవాబును విస్తరించి రాయడం వంటి పద్ధతుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా సబ్జెక్టుల వారీగా ఈ మూడు అంశాల్లో మార్కులను నిర్ణయించారు. ఉదాహరణకు ఇంగ్లీష్‌ సబ్జెక్టులో పాఠ్యపుస్తకంలో ఉన్నది ఉన్నట్లుగా రాస్తే 30 మార్కులు, అవగాహన చేసుకుని రాస్తే 40 మార్కులు, జవాబును విస్తరించి రాస్తే 30 మార్కులు వేయాలని నిర్ణయించారు. తొలిగా నూతన పద్ధతిలో పరీక్షలు  జరపడం, అదీ కూడా ఐదు నెలల తరువాత పరీక్షలు నిర్వహించనుండటంతో ఈ ప్రయోగం ఎంతవరకు  విజయవంతమవుతుంది? విద్యార్థులు ఎంతమేర సీబీఏ పద్ధతిలో పరీక్షలు రాసి మార్కులు తెచ్చుకుంటారో వేచి చూడాల్సిందే. 

Read more