చిన్న పొరపాట్లకే చావబాదుతున్న గురువులు

ABN , First Publish Date - 2022-10-03T20:26:30+05:30 IST

బిడ్డ పుట్టిన తరువాత మూడేళ్లు మాత్రమే అమ్మ ఒడిలో, నాన్న చేతుల్లో ఉంటుంది. ఆ తరువాత బడి మొదలవుతుంది. ఉదయం వెళితే.. సాయంత్రం వరకూ గడిపేది గురువు సన్నిధిలోనే..!

చిన్న పొరపాట్లకే చావబాదుతున్న గురువులు

కొట్టొద్దు టీచర్‌

బడిలో దండన చట్టవిరుద్ధం

పసివారితో సున్నితంగా మెలగాలి

చితకబాదుతున్న గురువులు

ప్రైవేటు బడుల్లో ‘శిక్షణ పొందని’ టీచర్లు

చైల్డ్‌ సైకాలజీ తెలియక.. హింసాత్మక  చర్యలు


అనంతపురం విద్య: 


బిడ్డ పుట్టిన తరువాత మూడేళ్లు మాత్రమే అమ్మ ఒడిలో, నాన్న చేతుల్లో ఉంటుంది. ఆ తరువాత బడి మొదలవుతుంది. ఉదయం వెళితే.. సాయంత్రం వరకూ గడిపేది గురువు సన్నిధిలోనే..! ఈ వేగవంతమైన, ఆధునిక కాలంలో పసివారిపై గురువుల ప్రభావమే ఎక్కువ. శిలను శిల్పంగా తీర్చిదిద్దాలన్నా, బండరాయిని చేసి బయట పడేయాలన్నా.. వారి చేతుల్లోనే ఉంటుంది. బాల్యం అత్యంత సున్నితమైనది. చిన్నారుల మనస్తత్వంపై పూర్తి అవగాహన ఉన్నవారినే ఉపాధ్యాయులుగా నియమించుకోవాలి. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆ మేరకు శిక్షణ పొంది ఉంటారు. కానీ ప్రైవేటు.. కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఏ శిక్షణా పొందనివారినీ నియమించు కుంటున్నారు. ఇది విద్యార్థులకు తీరని నష్టం కలిగిస్తోంది. అందుకే.. పసివారిని కొట్టకండి టీచర్‌..! వారితో సంభాషించండి. సందేహాలను నివృత్తి చేయండి. తరగతి గదిలో మీకు బాల్యం తిరిగొస్తుంది. బాలలు సమున్నతంగా ఎదిగేందుకు ఇది తోడ్పడుతుంది. ఒత్తిడులు ఏవైనా ఉంటే.. గది బయటే వదిలేసి వెళ్లండి.




పసివారితో పైశాచికంగా..

అనంతపురం రూరల్‌లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో రబ్బరు కోసం విద్యార్థి వెనక్కు తిరిగాడు. అంతే.. ఆ చిన్నారి వీపుపై వాతలు తేలేలా టీచర్‌ ఉతికేసింది. ఇది చాలదన్నట్లు వార్డెన్ కూడా ప్రతాపం చూపాడు. కర్ర తీసుకుని బాలుడిని చితకబాదాడు. ఇద్దరి దెబ్బలకు పిల్లాడి ఒళ్లు హూనమైంది.  ఎస్కే యూనివర్సిటీ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌ దెబ్బలకు విద్యార్థి చెవికి గాయమై, రక్తం వచ్చింది. ఇలాంటి సంఘటనలపై విద్యాశాఖ అధికారులు పెదవి విప్పడం లేదు. పసివారిని శారీరకంగా, మానసికంగా వేధించరాదని చట్టం ఉంది. అయినా పాటించడం లేదు. కొన్ని పాఠశాలల్లో టీచర్లు, నిర్వాహకులు విచక్షణ కోల్పోతున్నారు. పసివారి పట్ల పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు.




పగలు టీచర్‌.. రాత్రి వార్డెన్..

అనంతపురం రూరల్‌ మండలంలోని ఆలమూరు రోడ్డులో ఉన్న ఎస్‌ఆర్‌ స్కూల్‌లో కనగానపల్లి  మండలం తగరకుంటకు చెందిన చిన్నపరెడ్డి కుమారుడు అచ్యుత ప్రసాద్‌ రెడ్డి 4వ తరగతి చదువుతున్నాడు. తరగతి గదిలో ఎరేజర్‌ కోసం వెనక్కు తిరిగాడని టీచర్‌ ఫౌజియా బాలుడిని చితకబాదింది. అదే రోజు రాత్రి అ అబ్బాయి వద్ద ఉండాల్సిన డబ్బు కంటే ఎక్కువ ఉందన్న నెపంతో వార్డెన్‌ కూడా రెచ్చిపోయాడు. రీఫర్‌ కర్రతో చితకబాదాడు. దీంతో బాలుడి తొడ వాచిపోయింది. ఉదయం టీచర్‌ కొట్టిన దెబ్బలకు వీపుపై వాతలు తేలాయి. మరుసటి రోజు పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులకు విషయం తెలిసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. డీఈఓ విచారణకు ఆదేశించారు. 19వ తేదీ డిప్యూటీ డీఈఓ పద్మప్రియ విచారించారు. 20 వ తేదీ డీఈఓకు నివేదిక ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ చర్యలు లేవు. నిబంధనలకు విరుద్ధంగా, 9, 10 తరగతుల అడ్మిషన్లు తీసుకున్నారని, అందుకు రూ.50 వేలు జరిమానా విధించామని విద్యాశాఖాధికారులు ప్రకటించి, చేతులు దులుపుకున్నారు. విద్యార్థిని చితకబాదిన వ్యవహారంలో ఎలాంటి చర్యలూ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.


దండన చట్టవిరుద్ధం

విద్యార్థులను హింసించడం చట్ట విరుద్ధం. చదువు, క్రమశిక్షణ.. మరే ఇతర కారణాలతోనూ వారిని కొట్టకూడదు. వేధించకూడదు. ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009(ఆర్టీఈ) సెక్షన్‌17 ప్రకారం, పాఠశాలల్లో పిల్లల శారీరక దండన, మానసిక వేధింపులు నిషిద్ధం. ఈ నేరాలకు పాల్పడిన వారు సబ్‌ సెక్షన్‌ 1 ప్రకారం శిక్షార్హులు. జువైనల్‌ జస్టిస్‌(కేర్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ఆఫ్‌ చిల్డ్రన్‌) చట్టం-2000, సెక్షన్‌ 23 ప్రకారం పిల్లలను కొట్టిన వారికి 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. ఒక్కోసారి జైలు శిక్షతోపాటు, జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.


బయటి ఒత్తిడి.. బడిలో..

కొందరు పంతుళ్లు బయటి ఒత్తిడిని బడిలో పిల్లలపై రుద్దుతున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు రెండింటిలోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల ఎస్కే యూనివర్సిటీ  క్యాంపస్‌ స్కూల్‌లో 6వ తరగతి విద్యార్థిని కొట్టారు. గణితం హోంవర్క్‌ సరిగా రాయలేదని టీచర్‌ ఉతికేశాడు. దీంతో జ్ఞానేశ్వర్‌ అనే విద్యార్థి చెవికి గాయమైంది. పసివారిని కొట్టే సమయంలో విచక్షణ కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో వారికి ఏదైనా  జరిగితే పరిస్థితి ఏమిటని ఆలోచించలేకున్నారు. ప్రైవేట్‌ స్కూళ్లలో బోధనా సిబ్బందిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తక్కువ జీతాల కారణంగా వ్యక్తిగత ఇబ్బందులూ ఉంటాయి. ఈ కోపాన్నంతా విద్యార్థులపై చూపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పైగా చాలా ప్రైవేట్‌ స్కూళ్లలో బీఈడీ, టీటీసీ వంటి కోర్సులు పూర్తి చేసిన వారు ఎక్కువగా ఉండరు. శిక్షణ పొందినవారికి చైల్డ్‌ సైకాలజీపై అవగాహన ఉంటుంది. కానీ సాధారణ డిగ్రీలు చేసినవారు, డిగ్రీ కూడా పూర్తి చేయనివారిని ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లుగా తీసుకుంటున్నారు. తక్కువ వేతనాలు ఇస్తున్నారు. విద్యార్థులతో ఎలా ప్రవర్తించాలి, బోధన ఎలా చేయాలన్న అంశాలపై వీరికి పెద్దగా అవగాహన ఉండదు. ఇది చిన్నారుల పాలిట శాపంగా మారుతోంది.


సిగ్గుమాలిన చర్య..

ప్రైవేట్‌ స్కూళ్లలో పిల్లలపై వేధింపులు అధికమయ్యాయి. చదువుల పేరుతో చితక్కొట్టడం  దుర్మార్గం. ఎస్‌ఆర్‌ ప్రైం స్కూల్‌కు 9, 10 తరగతులకు అనుమతి రాక ముందే అడ్మిషన్లు తీసుకున్నారు. పిల్లలకు వాతలు పడేలా కొట్టారు. ఆ స్కూల్‌ను సీజ్‌ చేయాలి. విద్యాశాఖ అధికారులు జరిమానాలు విధించి చేతులు దులుపుకోవడం సిగ్గుమాలిన చర్య. ఇప్పటికైనా ఆ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఆందోళన చేస్తాం.

- సురేష్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సమాఖ్య


దండన సరికాదు..

పిల్లలు సున్నిత మనస్కులు. తల్లిదండ్రుల వద్ద కంటే ఎక్కువ సమయం బడిలో టీచర్ల వద్దే గడుపుతారు. పిల్లలపై గురువుల ప్రభావం అధికంగా ఉంటుంది. వారిని కొట్టడం సరికాదు. దెబ్బలు తగిలేలా కొడితే, పిల్లలు శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతారు. శారీరక దండన నేరం. పాఠశాలల్లో శిక్షణ పొందిన టీచర్లను నియమించాలి. అలాంటివారే పిల్లలతో సక్రమంగా వ్యవహరిస్తారు. 

- మేడా రామలక్ష్మి, సీడబ్ల్యూసీ చైర్‌ పర్సన్‌


అవగాహన కల్పించాలి..

బడి పిల్లలపై ఒత్తిడి సరికాదు. ప్రాథమిక, ప్రాథమికోన్నత తరగతులు చదివే విద్యార్థుల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ వయసు వారిని కొడితే.. బడి అంటేనే భయపడే ప్రమాదం ఉంది. చిన్నారులతో సున్నితంగా వ్యవహరించాలి. విద్యాశాఖ అధికారులు పాఠశాలల్లో చట్టాలపై అవగాహన కల్పించాలి.

- లక్ష్మీనరసింహ, రాష్ట్ర కార్యదర్శి, టీఎన్‌ఎస్‌ఎఫ్‌అమానుషం: రబ్బరు కోసం వెనక్కి తిరిగిన పాపానికి చావబాదారు

Updated Date - 2022-10-03T20:26:30+05:30 IST