మళ్లీ చదువుల వసంతం

ABN , First Publish Date - 2022-06-11T17:58:27+05:30 IST

కరోనా తెరపినిచ్చినట్లనిపిస్తున్నది. ఓ మూడు విద్యా సంవత్సరాలు చదువుల్లో చోటు చేసుకున్న వాక్యూంకు తెర వేయాల్సిన కీలక తరుణం ఆసన్నమైంది. విద్యా సంవత్సర క్రమబద్ధీకరణ ద్వారానే సాధ్యమయ్యే ఈ ప్రక్రియకు ఆరంభం నుంచే తగురీతిలో కార్యాచరణ రూపొందించుకోవాలి. ప్రభుత్వం, విద్యాశాఖ, తల్లిదండ్రులు, విద్యార్థుల ఉమ్మడి కార్యాచరణ ద్వారానే ఇది సాధ్యమవుతుంది...

మళ్లీ చదువుల వసంతం

కరోనా తెరపినిచ్చినట్లనిపిస్తున్నది. ఓ మూడు విద్యా సంవత్సరాలు చదువుల్లో చోటు చేసుకున్న వాక్యూంకు తెర వేయాల్సిన కీలక తరుణం ఆసన్నమైంది. విద్యా సంవత్సర క్రమబద్ధీకరణ ద్వారానే సాధ్యమయ్యే ఈ ప్రక్రియకు ఆరంభం నుంచే తగురీతిలో కార్యాచరణ రూపొందించుకోవాలి. ప్రభుత్వం, విద్యాశాఖ, తల్లిదండ్రులు, విద్యార్థుల ఉమ్మడి కార్యాచరణ ద్వారానే ఇది సాధ్యమవుతుంది.


మొదటిసారి లాక్‌డౌన్ విధించిన సమయానికి విద్యాసంవత్సరం వార్షిక పరీక్షల దశలో ఉంది. ఆ ఏడాది చదువులను బేరీజు వేయకుండానే విద్యాసంవత్సరాన్ని ముగించాల్సి వచ్చింది. దాంతో కీలకమైన పదవ తరగతిలో కూడా విద్యార్థులు ప్రమోషన్ ఊతంగా ఇంటర్ చదువులకు వెళ్ళారు. ఒక పూర్తి సంవత్సరం చదువులు ఆన్‌లైన్‌లో నిర్వహించాల్సి వచ్చింది. ప్రభుత్వ రంగంలో, గ్రామీణ ప్రాంతాలలో ఆ కోణంలో విద్యార్థులకు ఆశించిన స్థాయిలో సహకారం లభించలేదనే చెప్పుకోవచ్చు. 2021–22 విద్యా సంవత్సరం కూడా పూర్తిగా కాకున్నా ప్రభుత్వ రంగంలోని విద్యార్థులకు బడి చదువులను ఆశ్రయించకుండానే అర్ధసంవత్సరం ముగిసింది. తర్వాత పాఠశాలలను ఆరంభించి యథాతథ స్థితిలో పిల్లల చదువులను తీర్చిదిద్దే రీతిలో చర్యలు చేపట్టినప్పటికీ సిలబస్‌లు కుదించడం వలన ఆ విద్యా సంవత్సరం కూడా విద్యార్థులకు ఆశించిన స్థాయి విద్యను అందించలేక పోయిందనే చెప్పాలి. 


2022–23 విద్యా సంవత్సరం అతి కీలక విద్యా సంవత్సరం. ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆరంభం నాటికి ఆరోగ్య రీత్యా సవాళ్ళు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ కీలక తరుణంలో అటు ప్రభుత్వం, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు నూతన తరాల విద్యార్జన క్రమబద్ధీకరణపై దృష్టిసారించగలిగే అవకాశం లభిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రూపొందించించిన ప్రత్యేక కార్యాచరణతో ‘మన ఊరు–మన బడి’ ప్రణాళిక ప్రభుత్వ రంగంలోని పాఠశాలల్లో విద్యార్థులకు ఉపయోగకారిగా నిలిచే అవకాశం ఉన్నది.


వాస్తవానికి 2019–2020 విద్యాసంవత్సరంలో అంటే కరోనా లాక్‌డౌన్‌కు పూర్వం చదువులు సజావుగానే కొనసాగాయి. పాఠశాల విద్యలో ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యార్థులు తమ చదువులు కొనసాగించారు. అయితే దీర్ఘకాలం లాక్‌డౌన్ పెట్టాల్సి రావడం, తరువాత గుమిగూడడం శ్రేయస్కరం కాదని షరతులు ఉండడం వలన తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యమే ప్రధానంగా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో పాఠశాల విద్యపై ప్రభావం పడింది. 2021–22 విద్యాసంవత్సరంలో ప్రైవేట్ రంగంలో విద్యా సంవత్సరాన్ని ఆన్‌లైన్ తరగతులతో ఆరంభించినప్పటికీ ప్రభుత్వ రంగంలో ఆ అవకాశం ఆలస్యంగా లభించింది.


కరోనా లాక్‌డౌన్‌ల పర్యవసానంగా పిల్లల చదువులపై విపరీతమైన ప్రభావం పడింది. రెండు విద్యాసంవత్సరాలలో పరీక్షలతో ప్రమేయం లేకుండా కామన్ బోర్డ్‌తో సంబంధం లేని పరీక్షలన్నీ పై తరగతి ప్రమోషన్ ప్రాతిపదికన ఫలితాల వెల్లడితో ముగిసాయి. 2019–20 విద్యాసంవత్సరానికి చదువులు, సిలబస్ పూర్తిగా సాధారణంగానే జరిగినా పరీక్షల నిర్వహణ కష్టతరమవటం వలన బోర్డ్ పరీక్షలు కూడా జరగకుండానే విద్యార్థులకు పై తరగతి ప్రమోషన్ లభించింది. ఆ యేటికి విద్యార్థులకు మానసికంగా కూడా ఎలాంటి ఇబ్బంది జరగలేదనే చెప్పవచ్చు. 2020–21 విద్యా సంవత్సరం ఇందుకు భిన్నంగా మొదలయింది. ప్రమోషన్ పొందిన విద్యార్థులకు పై తరగతి చదువులలోకి రావడం రెండు విడతల కరోనా వలన అసాధ్యమయింది. ఆరంభంలో వ్యాక్సిన్ వస్తే గాని పాఠశాలల నిర్వహణ సాధ్యమవవచ్చనుకున్నా సెకండ్ వేవ్ తీవ్రత ఫలితంగా రెండోసారి విద్యార్థులకు ప్రమోషన్ ఇవ్వవలసి వచ్చింది. ఒక విద్యా సంవత్సరం పూర్తిగా ఇళ్ళ వద్దనే గడిపిన విద్యార్థులకు ఈ కాల పరిమితిలో మానసికంగా చదువుల పట్ల శ్రద్ధ తగ్గింది. సుమారు ఏడాది పాటు తరగతి గది చదువులకు దూరంగా వుండడం వలన విద్యార్థులు పాఠశాలల పట్ల ఆసక్తిని కోల్పోయే దుస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులు రెండువిడతల కరోనా నుంచి తమ పిల్లలను ఆరోగ్యంగా నిలుపుకోవడమే పరమావధిగా భావించడం వలన ఏడాదిన్నర పాటు తరగతి గది విద్య ముందుకు సాగలేదు. ఈ దశలో ప్రైవేట్ విద్యాసంస్థలు తమ విద్యార్థుల చదువుల కొనసాగింపునకు వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఊతంగా తీసుకొని ఆన్‌లైన్ విద్య కొనసాగించాయి. వీటికి దీటుగా ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్లో విద్య కొనసాగింపు కష్టతరమైంది. అయితే మధ్య తరగతి ఆదాయవర్గాలకు చేదోడు వాదోడుగా నిలువగలిగే ప్రైవేట్ రంగంలోని అనేక సంస్థలు ఏడాదిన్నర వ్యవధిలో ఎదురయిన ఒడిదొడుకుల పర్యవసానంగా మూతపడడం 2021–22 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ రంగంలో విద్యార్థుల సంఖ్య పెరగడానికి ఉపకరించిందనే వాదనను వివిధ గణాంకాలను పరిశీలించినప్పుడు అంగీకరించాల్సి వస్తుంది. వరుసగా రెండేళ్ల పాటు ప్రైవేట్ రంగంలోని విద్యా సంస్థలు పిల్లలకు ఆన్‌లైన్ విధానంలో చదువులు కొనసాగేలా చేసాయి. ఈ దశలో తరగతిగది విద్యకు దూరమైన విద్యార్థుల్లో మానసిక పరిపక్వతపై ప్రభావం పడిందనే విశ్లేషణలు వెలుగు చూసాయి. ఆన్‌లైన్ విద్య విద్యార్థుల్లో తరగతిగది విద్యలాంటి సామూహిక అధ్యయనాన్ని, స్వేచ్ఛను వారికి దూరం చేసాయని సర్వేలు వెల్లడించాయి. ఈ తరుణంలో విద్యార్థుల మానసిక పరిపక్వతపై ప్రభావం పడింది. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో నిర్వహించే తరగతుల ద్వారా లభించే పరిజ్ఞానం స్థాయిలో ఆన్‌లైన్ విద్య విద్యార్థులను ముందుకు తీసుకెళ్ళలేదనే చెప్పుకోవచ్చు.


జూన్ 13న కొత్త విద్యా సంవత్సరం ఆరంభమవనున్నది. 2022–23 విద్యా సంవత్సరం విద్యార్థుల చదువులను గాడిలో పెట్టేందుకు అన్ని రకాలుగా అనువైన పరిస్థితులు ఉన్నాయి. కొవిడ్ తరహా వ్యాధుల విస్తరణను అడ్డుకోగలిగే వ్యాక్సిన్ పెద్ద తరగతుల విద్యార్థులకి అందుబాటులోకి వచ్చింది. ఇదే ఈ విద్యాసంవత్సరం సాఫీగా సాగేందుకు ఉపయోగపడే ప్రధాన అంశం. ఇదే తరుణంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ రంగంలోని పాఠశాలలకు తమ పిల్లలను పంపేందుకు హేతువుగా మారుతున్నది.


-డాక్టర్ కడియం కావ్యచైర్‌పర్సన్, కడియం ఫౌండేషన్–వరంగల్‌

Read more