బడికి బై..బై! బడుల విలీనమే కారణమా?

ABN , First Publish Date - 2022-10-03T20:55:18+05:30 IST

ఒక్క సారిగా ఇంతపెద్దసంఖ్యలో విద్యార్థులు స్కూలు తెరిచిన రెండునెలల్లోనే బడికి దూరం కావడానికి కారణాలపై పలురకాల విశ్లేషణలు, అభిప్రాయాలు ఉన్నాయి

బడికి బై..బై! బడుల విలీనమే కారణమా?

ఏలూరు జిల్లాలో 6,704  మంది డ్రాపవుట్లు

వెతికి బడికి పంపే పనిలో సచివాలయ సిబ్బంది, సీఆర్పీలు

బడుల విలీనమే కారణమా?


ఏలూరు ఎడ్యుకేషన్‌, అక్టోబరు 2 : ఉమ్మడి జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో బడిమానేసిన (డ్రాపవుట్‌ చిల్డ్రన్‌) బాల బాలికలు 11,483 మందిగా అధికారికంగానే వెల్లడైంది. ఒక్క సారిగా ఇంతపెద్దసంఖ్యలో విద్యార్థులు స్కూలు తెరిచిన రెండునెలల్లోనే బడికి దూరం కావడానికి కారణాలపై పలురకాల విశ్లేషణలు, అభిప్రాయాలు ఉన్నాయి. వీటిలో ఈ ఏడాది నూతన విద్యావిధానంలో భాగంగా జరిగిన పాఠశాలల విలీనం ఓ ప్రధానకారణం కావచ్చునన్నదే హైలైట్‌గా నిలుస్తోంది. స్థానికంగా వున్న ఊరిబడిని దూరంగా వున్న మరో పాఠశాల లోకి ప్రాథమిక తరగతులను విలీనం చేయడంతో మధ్యలోనే బడిమానేసిన విద్యార్థుల సంఖ్య పెరగడానికి కారణమని చెబుతున్నారు. అయితే విద్యాశాఖ వాదనమాత్రం మరోలా ఉంది. విద్యార్థులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోవడం, కుటుంబ పరిస్థితులు, ఇతర పాఠశాలల్లో చేరినా వారిని డ్రాపవుట్లుగా చూపించడం, అనారోగ్య పరిస్థితులు, వైకల్యం తదితర కారణాలను అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని డ్రాపవుట్‌ విద్యార్థులందరినీ వెతికిపట్టుకుని, వారి తల్లితండ్రులకు నచ్చజెప్పడం ద్వారా సంబంధిత పిల్లలందరినీ మళ్లీ బడికి రప్పించే కార్యాచరణ ప్రారంభించారు. ఇంతవరకు గుర్తించిన డ్రాపవుట్లను సమీప ప్రభుత్వ బడుల్లో చేర్చినట్టు చెబుతున్నప్పటికీ, దసరా సెలవుల అనంతరం బడులు తెరిచినప్పుడు వీరిలో ఎంతమంది మళ్లీ తరగతులకు రెగ్యులర్‌గా వస్తారన్నది ప్రశ్నార్థకంగా ఉంది.


ఉమ్మడి డ్రాపవుట్లు ఇలా

ఏలూరు జిల్లాలో 6,704 మంది డ్రాపవుట్లలో బాలురు 3,822 మంది, బాలికలు 2,882 మంది ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 4,779 మంది డ్రాపవుట్లలో బాలురు 2,779 మంది, బాలికలు 2 వేల మంది ఉన్నట్టు అధికారికంగా ధ్రువీకరించారు. డ్రాపవుట్లకు కారణాలపై సమగ్రశిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో ఎక్కడా పాఠశాలల్లో ప్రాథమిక తరగతుల విలీన అంశాన్ని లేవనెత్తకుండా, ఇతర అంశాలను కారణాలుగా చూపేందుకు ప్రాధాన్యత నిచ్చారు. కొందరు విద్యార్థులు చనిపోయారని, మరికొందరు ఇతర ప్రాంతాలకు,  వలస వెళ్లి పోయారని విశ్లేషించారు. మొత్తంమీద 9 రకాల కారణాలను డ్రాపవుట్లకు ప్రధాన అంశాలుగా పేర్కొన్నారు. కొందరు విద్యార్థులు టీసీలు తీసుకోకుండానే ప్రైవేటు పాఠశాలల్లో చేరిపోయిన సందర్భాల్లో వారంతా డ్రాపవుట్ల జాబితాలో చేరిపోయారని చెబుతున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందని ప్రైవేటు పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ప్రభుత్వ పరంగా యూడైస్‌ కోడ్‌ ఉండకపోవడం కూడా ఓ కారణమంటు న్నారు. కిడ్నీ, గుండెజబ్బులు, అనారోగ్యం, సీడబ్ల్యుఎస్‌ఎన్‌ (వైకల్యం) కారణంగా బడిమానేసినవారి సంఖ్యకూడా దీనికి జత కావడం వల్ల ఎక్కువగా కనబడుతున్నారని అధికార వర్గాల విశ్లేషణగా ఉంది. ముఖ్యంగా 5,7,8 తరగతుల్లోనే డ్రాపవుట్ల సంఖ్య ఎక్కువగా ఉందని తేల్చారు.


ఫాలో అప్‌ ఉంటేనే సత్ఫలితాలు

గుర్తించిన డ్రాపవుట్‌ విద్యార్థులందరినీ సమీప ప్రభుత్వ పాఠశాలల్లో మళ్లీ చేర్చేందుకు ప్రస్తుతం కార్యాచరణ ప్రారంభిం చారు. ఆ మేరకు కొందరిని సచివాల యాల్లో విధులు నిర్వర్తించే ఎడ్యుకేషన్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, వలంటీర్లు, సమగ్రశిక్ష సీఆర్పీలు, ఎంఈవోలు తిరిగి బడుల్లో చేర్పించే కార్యక్రమం జరుగుతోంది. అయితే ప్రస్తుతం దసరా సెలవులు కొనసాగుతున్నాయి. సెలవుల అనంతరం ఆయా బడుల్లో చేర్చిన డ్రాపవుట్‌ విద్యా ర్థుల్లో ఎంతమంది రెగ్యులర్‌గా తరగతులకు వెళుతున్నారో మానటరింగ్‌ చేయడంపైనే ఫలతాలు ఆదారపడి ఉంటాయని చెప్పవచ్చు. గుర్తించిన విద్యార్థులందరికీ విద్యాకానుక కిట్లు, అమ్మఒడిని వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటామని సమగ్రశిక్ష జిల్లా అధికారులు వివరించారు.

Read more