Medical Posts: కొత్తగా 3,897 వైద్య కొలువులు

ABN , First Publish Date - 2022-12-02T11:41:09+05:30 IST

వచ్చే సంవత్సరం రాష్ట్రం(Telangana)లో ఏర్పాటు చేయనున్న తొమ్మిది కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు(Government Medical Colleges), వాటి అనుబంధ జనరల్‌ ఆస్పత్రుల కోసం ప్రభుత్వం 3,897 పోస్టులను మంజూరు చేసింది. వివిధ కేటగిరీలకు సంబంధించి

Medical Posts: కొత్తగా 3,897 వైద్య కొలువులు
వైద్య కొలువులు

వచ్చే ఏడాది ఏర్పాటు చేసే 9 మెడికల్‌ కాలేజీల కోసం

కాలేజీ, అనుబంధ ఆస్పత్రికి 433 పోస్టుల చొప్పున..

ప్రొఫెసర్ల పోస్టులే 990.. మిగతావి నర్సింగ్‌, ఫార్మసీ విభాగాల్లో..

‘ఆరోగ్య తెలంగాణ’ దిశగా అడుగులు: మంత్రి హరీశ్‌ రావు

హైదరాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): వచ్చే సంవత్సరం రాష్ట్రం(Telangana)లో ఏర్పాటు చేయనున్న తొమ్మిది కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు(Government Medical Colleges), వాటి అనుబంధ జనరల్‌ ఆస్పత్రుల కోసం ప్రభుత్వం 3,897 పోస్టులను మంజూరు చేసింది. వివిధ కేటగిరీలకు సంబంధించి కాలేజీకి 433 చొప్పున పోస్టులను మంజూరు చేసింది. ప్రధానంగా ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వంటి ఆచార్యులు, ఇతర ఆస్పత్రి సంబంధిత పోస్టులున్నాయి. ఈమేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వుల (జీవో 181)ను జారీ చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో వైద్య సదుపాయాలను విస్తృతం చేసేందుకు జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని.. గ్రామీణ స్థాయికి సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను తీసుకెళ్లాలని నిర్ణయించింది. తెలంగాణ ఆవిర్భావ సమయానికి రాష్ట్రంలో కేవలం ఐదు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉండగా నాలుగు వైద్య కళాశాలలను మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, నల్లగొండ, సూర్యపేటలో సర్కారు ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మరో 8 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 17కు పెరిగింది. ఫలితంగా 2014లో 850 ఉన్న ఎంబీబీఎస్‌ సీట్లు.. 2,790కి పెరిగాయి. ఆ మేరకు కొత్తగా 1,150 మెడికల్‌ సీట్లు అందుబాటులోకొచ్చినట్లయింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది కొత్తగా తొమ్మిది వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిని సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, భూపాలపల్లి, ఆసిఫాబాద్‌, జనగాం, నిర్మల్‌ జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త కాలేజీలు, అనుంబంధ ఆస్పత్రుల్లో ప్రొఫెసర్‌, అధికారులు, సిబ్బంది పోస్టులను కొత్తగా సృష్టించాలంటూ వైద్య విద్యా సంచాలకులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌(ఎన్‌ఎంసీ) నిబంధనల ప్రకారం ఒక్కో మెడికల్‌ కాలేజీకి 433 పోస్టుల చొప్పున మొత్తం 3,897 పోస్టులను సృష్టించాలని కోరారు. ఈమేరకు ప్రభుత్వం 3,897 పోస్టులను సృష్టిస్తూ, వాటి భర్తీకి అనుమతులు మంజూరు చేసింది. కాగా తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రారంభించిన 12 మెడికల్‌ కాలేజీలు సహా కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్‌ కాలేజీల కోసం ఇప్పటి వరకు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలో మొత్తం 15,476 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసినట్లయింది.

990 ఆచార్యుల పోస్టులు

కొత్త మెడికల్‌ కాలేజీల్లోని వివిధ విభాగాల్లో పోస్టులు భర్తీ కానున్నాయి. అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ప్యాథాలజీ, మైక్రో బయాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, కమ్యూనిటీ మెడిసిన్‌, జనరల్‌ మెడిసిన్‌, రెస్పిరేటరీ మెడిసిన్‌, డెర్మటాలజీ, ఫిజికల్‌ మెడిసిన్‌, సైకియాట్రి, పీడియాట్రిక్స్‌, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్‌, ఈఎన్‌టీ, ఆఫ్తాల్మాలజీ, ఆబ్ట్సెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, రేడియో డయాగ్నోసిన్‌, అనెస్థీషియా, డెంటల్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌ వంటి విభాగాల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వంటి 990 ఆచార్యుల పోస్టులున్నాయి. ఇందులో 225 ప్రొఫెసర్‌,, 252 అసోసియేట్‌ ప్రొఫెసర్‌, 512 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులున్నాయి. రూరల్‌ హెల్త్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌, అర్బన్‌ హెల్త్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌లలో మెడికల్‌ ఆఫీసర్‌ ఆఫ్‌ హెల్త్‌, లేడి మెడికల్‌ ఆఫీసర్‌, మెడికో సోషల్‌ వర్కర్‌ గ్రేడ్‌-2, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌, హెల్త్‌ అసిస్టెంట్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌, రికార్డ్‌ క్లర్క్స్‌/రికార్డ్‌ అసిస్టెంట్లు వంటి పోస్టులు భర్తీ కానున్నాయి. బ్లడ్‌ బ్యాంక్‌లకు సంబంధించి బ్లడ్‌ బ్యాంక్‌ మెడికల్‌ ఆఫీసర్‌, సెంట్రల్‌ లైబ్రరీలో లైబ్రేరియన్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, సెంట్రల్‌ రికార్డ్‌ సెక్షన్‌లో మెడికల్‌ రికార్డ్‌ ఆఫీసర్‌, స్టాటిస్టీషియన్‌, నర్సింగ్‌ విభాగంలో నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ గ్రేడ్‌-1, గ్రేడ్‌-2, హెడ్‌ నర్స్‌, స్టాఫ్‌ నర్స్‌ పోస్టులు ఉన్నాయి. ఆస్పత్రి పరిపాలనా విభాగంలో సీఎస్‌ ఆర్‌ఎంఓ, డిప్యూటీ సీఎస్‌ ఆర్‌ఎంఓ, డైటీషియన్‌, ఫార్మసీ సూపర్‌వైజర్‌, ఫార్మసిస్ట్‌, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు, మార్చురీ విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌, ప్రిన్సిపాల్‌ కార్యాలయంలో ప్రిన్సిపాల్‌/డీన్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో మెడికల్‌ సూపరింటెండెంట్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు వంటి పోస్టులున్నాయి.

నాణ్యమైన వైద్యం, వైద్య విద్య కోసం ముందడుగు

అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం, వైద్య విద్యను అందించే లక్ష్యంలో ఇదో ముందడుగు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం ‘ఆరోగ్య తెలంగాణ’ దిశగా వేగంగా అడుగులేస్తోంది. కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో ఒకవైపు నాణ్యమైన వైద్యం, మరోవైపు మెడికల్‌ విద్య రాష్ట్ర ప్రజలకు చేరువవుతోంది. ఆనాడు పెద్ద పట్టణాలకు మాత్రమే పరిమితమైన స్పెషాలిటీ వైద్యం జిల్లాకొక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు వల్ల గ్రామీణ ప్రజలకు చేరువైంది. తద్వారా పేదలకు సమీపంలోనే ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందుతుండటంతో పాటు వైద్యం కోసం చేసే ఆర్థిక భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. డాక్టర్‌ కావాలని కలలు కనే విద్యార్థులకు... స్థానికంగా ఉంటూనే వైద్య విద్యను అభ్యసించే అవకాశాలు మెరుగుపడ్డాయి.

- వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు

Haresh-New.gif

Updated Date - 2022-12-02T11:41:10+05:30 IST