పోలీసు కొలువులు.. కటాఫ్‌ తగ్గింపు

ABN , First Publish Date - 2022-10-03T17:38:42+05:30 IST

పోలీసు కొలువుల అభ్యర్థులకు శుభవార్త..! ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కటాఫ్‌ మార్కులను మరింతగా తగ్గిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి

పోలీసు కొలువులు.. కటాఫ్‌ తగ్గింపు

ఎస్సీ, ఎస్టీలకు క్వాలిఫై మార్కులు 20%

బీసీలకు 25%, ఓసీలకు 30%

పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడి

2 లక్షల మంది అభ్యర్థులకు ప్రయోజనం


హైదరాబాద్‌, అక్టోబరు 2, (ఆంధ్రజ్యోతి): పోలీసు కొలువుల అభ్యర్థులకు శుభవార్త..! ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కటాఫ్‌ మార్కులను మరింతగా తగ్గిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వెల్లడించింది. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం ప్రిలిమినరీ పరీక్షలో ఈ కేటగిరి అభ్యర్థులకు కటాఫ్‌ మార్కులను తగ్గిస్తూ టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం.. 30% మార్కులు సాధించిన ఓసీ అభ్యర్థులు తదుపరి పరీక్షలకు అర్హత పొందుతారు. బీసీలకు 25%, ఎస్సీ, ఎస్టీలకు 20% మార్కులు వస్తే ప్రిలిమినరీ పరీక్షల్లో క్వాలిఫై అవుతారు. కాగా.. పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్‌, 63 ట్రాన్స్‌పోర్ట్‌, 614 ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకేౖస్‌జ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తొలుత ఈ పరీక్షల్లో కటాఫ్‌ మార్కులకు స్లాబ్‌ వ్యవస్థను ప్రకటించారు. అభ్యర్థులెవరైనా 30% (200 మార్కులకు 60) మార్కులు సాధిస్తేనే తదుపరి పరీక్షలకు అర్హత పొందుతారు.


అయితే.. 2018 నోటిఫికేషన్‌లో మాత్రం ఓసీలకు 40%, బీసీలకు 35%, ఎస్సీ, ఎస్టీలకు 30% మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. ఈ సారి స్లాబ్‌ వ్యవస్థను అమలు చేయడంతో.. ఓసీ, బీసీల కటా్‌ఫను 30శాతానికి తగ్గించి.. తమకు అదే కటా్‌ఫను కొనసాగించడంపై ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. స్లాబ్‌ పద్ధతి వల్ల ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులు ఆదివారం సప్లమెంటరీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నిర్ణయం వల్ల సుమారు 2 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు తదుపరి ఈవెంట్స్‌కి అర్హత సాధించే అవకాశం ఉంది.



Updated Date - 2022-10-03T17:38:42+05:30 IST