బయోమెట్రిక్‌ పడట్లే..! చేతిచమురు వదిలించుకుంటున్న వార్డెన్లు

ABN , First Publish Date - 2022-09-17T19:41:05+05:30 IST

సోంపేట మండలం ఎంజీ పురం ఎస్టీ వసతి గృహంలో చదువుతున్న విద్యార్థి బుధవారం ఉదయం బయోమెట్రిక్‌ హాజరు(Biometric attendance) వేసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ పడలేదు. చివరకు హాజరునమోదు కాకుండానే తరగతి గదికి వెళ్లిపోయాడు.

బయోమెట్రిక్‌ పడట్లే..! చేతిచమురు వదిలించుకుంటున్న వార్డెన్లు

వసతిగృహాల్లో పనిచేయని యంత్రాలు

హాజరు నమోదుకు విద్యార్థుల పాట్లు

మెస్‌ బిల్లులపై ఆందోళన

చేతిచమురు వదిలించుకుంటున్న వార్డెన్లు 


(సోంపేట): సోంపేట మండలం ఎంజీ పురం ఎస్టీ వసతి గృహంలో చదువుతున్న విద్యార్థి బుధవారం ఉదయం బయోమెట్రిక్‌ హాజరు(Biometric attendance) వేసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ పడలేదు. చివరకు హాజరునమోదు కాకుండానే తరగతి గదికి వెళ్లిపోయాడు. ఈ వసతి గృహంలోని విద్యార్థులందరి పరిస్థితి ఇదే. బయోమెట్రిక్‌ యంత్రం సక్రమంగా పనిచేయకపోవడంతో విద్యార్థుల హాజరు నమోదు కావడంలేదు. 


కవిటి మండలం రాజపురం వసతిగృహంలోని 116 మంది విద్యార్థులు చదువుతున్నారు. బుధవారం ఉదయం బయోమెట్రిక్‌ హాజరు వేసేందుకు ఎంత ప్రయత్నించినా.. నమోదు కాలేదు. ప్రతిసారీ సర్వర్‌ బిజీగా ఉంది.. వేచి ఉండండి.. మళ్లీ ప్రయత్నించండి అంటూ మెసెజ్‌ వచ్చేది. విద్యార్థులు ఒకరి తరువాత మరొకరు వరుసగా బయోమెట్రిక్‌ వేసినా యంత్రం మాత్రం పనిచేయలేదు. 


ఇచ్ఛాపురం వసతిగృహంలో బయోమెట్రిక్‌ యంత్రం పనిచేయకపోవడంతో మూలపడేశారు. ఈ వసతి గృహంలో 37 మంది విద్యార్థులు చదువుతున్నారు. దీంతో విద్యార్థుల హాజరు సరిగా లేకపోవడంతో మెస్‌ బిల్లులు, కాస్మోటిక్‌ చార్జీలు, పుస్తకాలు తదితర వస్తువులు అందించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా మెస్‌ బిల్లుల కోసం విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని అన్ని వసతిగృహాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. 


శ్రీకాకుళం: జిల్లాలో వసతిగృహాల్లో విద్యార్థుల హాజరు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బయోమెట్రిక్‌ యంత్రాలు మొరాయిస్తున్నాయి. దీంతో విద్యార్థులు, వార్డెన్లు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. విద్యార్థులు బయోమెట్రిక్‌ ద్వారా హాజరు వేస్తేనే దానికి అనుగుణంగా  వారికి మెస్‌ బిల్లులు, కాస్మోటిక్‌ చార్జీలు, పుస్తకాలు తదితర వస్తువులను అందించేందుకు వీలుంటుంది. చాలా వసతిగృహాల్లో ఈ బయోమెట్రిక్‌ యంత్రాలు పెట్టిన రోజు నుంచే పనిచేయడం లేదు. జిల్లాలో ఉన్న 81 బీసీ వసతి గృహాల్లో 6,025 మంది, 31ఎస్సీ వసతి గృహాల్లో రెండు వేల మంది, ఐటీడీఏ పరిధిలోని 63 ఎస్టీ వసతిగృహాలు, 12 గురుకులాల్లో కలిపి 1,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి హాజరు కోసం ప్రభుత్వం ప్రతీ వసతి గృహానికి ఒక బయోమెట్రిక్‌ యంత్రం, ఒక హైరిస్‌ యంత్రాన్ని ఇచ్చింది. బయోమెట్రిక్‌ ద్వారా వసతి గృహానికి ఎంతమంది విద్యార్థులు వచ్చారు, ఎవరెవరు భోజనాలు చేశారన్న విషయం తెలుస్తుంది. కాస్మోటిక్‌ చార్జీలు, విద్యార్థికి అందించే పుస్తకాలు, సామగ్రి, రాత్రిపూట భోజనం, తదితర వాటికి హైరీస్‌ యంత్రాన్ని ఉపయోగిస్తారు. వీటిద్వారా నమోదుకాబడిన విద్యార్థులకు మెస్‌ బిల్లులను ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఈ యంత్రాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి పనిచేయకపోవడంతో విద్యార్థుల హాజరు నమోదు కావడంలేదు. దీంతో వార్డెన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల హాజరులేకపోతే తమకు మెస్‌ బిల్లులు ఎలా అందుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ చేతిలోని డబ్బుపెట్టి విద్యార్థులకు భోజనాలు పెడుతున్నారు.  


ఆఫ్‌లైన్‌లో నమోదుకు ఏర్పాట్లు

వసతిగృహాల్లో బయోమెట్రిక్‌ పని చేయకపోవడంతో ఆఫ్‌లైన్‌లో విద్యార్థుల హాజరు నమోదుకు చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక యాప్‌లో ఫేసియల్‌ ద్వారా హాజరు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 

- శ్రీనివాసరావు, సహాయ గిరిజన సంక్షేమాధికారి


కాస్మెటిక్‌ చార్జీలకు బ్రేక్‌ 

8 నెలలుగా చెల్లించని ప్రభుత్వం

ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు 


(ఇచ్ఛాపురం): బీసీ వసతి గృహాల్లోని విద్యార్థులకు ప్రభుత్వం 8 నెలలుగా కాస్మెటిక్‌ చార్జీలను చెల్లించడం లేదు. దీంతో విద్యార్థులు ఇంటి నుంచి డబ్బులు తెచ్చుకొని కాస్మెటిక్‌ కొనుగోలు చేసుకుంటున్నారు. జిల్లాలోని 81 బీసీ వసతి గృహాలు ఉన్నాయి. ఇందులో పాఠశాల స్థాయి బాలురు హాస్టళ్లు 53, బాలికల హాస్టళ్లు 10, జూనియర్‌ కళాశాలలకు సంబంధించి 8 బాలురు, 10 బాలికల హాస్టళ్లు ఉన్నాయి. ఈ వసతి గృహాల్లో 6,025మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ప్రభుత్వం ప్రతినెలా కాస్మెటిక్స్‌ చార్జీల కింద రూ.155 చెల్లించాల్సి ఉంది. అయితే, గత 8 నెలలుగా కాస్మెటిక్‌ చార్జీలు విడుదల కాలేదు. దీంతో విద్యార్థులు ఇంటి నుంచి డబ్బులు తెచ్చుకొని సబ్బులు, నూనె, టూత్‌పేస్ట్‌, తదితరవి కొనుగోలు చేసుకుంటున్నారు. సీఎఫ్‌ఎంఎస్‌లో ఆంక్షలు వల్ల బకాయిలు విడుదల కాకపోవడంతో ఆ భారాన్ని విద్యార్థుల తల్లిదండ్రులే భరిస్తున్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపడుతున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. విద్యార్థుల బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బులు జమవుతాయని చెబుతున్నారే తప్ప.. ఇంతవరకు పైసా కూడా పడలేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. 


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

ఇచ్ఛాపురం బాలుర బీసీ హాస్టల్‌లో 37మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ఎనిమిది నెలల నుంచి కాస్మెటిక్స్‌ చార్జీలు అందడం లేదు. కొంతమంది తల్లిదండ్రులు ఇంటి నుంచి కాస్మెటిక్స్‌ తీసుకువచ్చి వారి పిల్లలకు అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ట్రెజరీకి బిల్లులు పంపించాం. త్వరలోనే విద్యార్థుల బ్యాంక్‌ ఖాతాలో డబ్బులు జమవుతాయి. 

- రవికుమార్‌, ఇన్‌చార్జి వార్డెన్‌, ఇచ్ఛాపురం బీసీ హాస్టల్‌


సబ్‌ట్రెజరీలకు బిల్లులు 

వసతి గృహ విద్యార్థుల కాస్మెటిక్స్‌ చార్జీలకు సంబంధించిన బిల్లులను అన్ని సబ్‌ట్రెజరీలకు పంపించాం. విద్యార్థుల బ్యాంక్‌ ఖాతాల్లోకి డబ్బులు జమవుతాయి. కొంతమంది విద్యార్థులకు బ్యాంక్‌ ఖాతాలు లేకపోడంతో బిల్లులు అందడంలేదు. అంతేగానీ మరో సమస్య లేదు.

- అనురాధ, జిల్లా వసతి గృహ సంక్షేమ అధికారిణి 

Read more