గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ కోసం తహసీల్దార్లు లాంగ్‌లీవ్‌.. ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు విద్యార్థుల ఇబ్బందులు

ABN , First Publish Date - 2022-05-30T16:17:22+05:30 IST

జిల్లాలోని రెవెన్యూశాఖలో పనిచేస్తున్న నాయబ్‌ తహసీల్దార్లు దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్తున్నారు. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో ఆయా మండలాల్లో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు ఉన్నత ఉద్యోగం సాధించే లక్ష్యంతో లాంగ్‌లీవ్‌ పెడుతున్నారు...

గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ కోసం తహసీల్దార్లు లాంగ్‌లీవ్‌.. ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు విద్యార్థుల ఇబ్బందులు

ఇప్పటివరకు విధులకు దూరంగా 13 మంది

మరో 18 మంది ప్రభుత్వానికి దరఖాస్తు

ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు విద్యార్థుల ఇబ్బందులు


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రెవెన్యూశాఖలో పనిచేస్తున్న నాయబ్‌ తహసీల్దార్లు దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్తున్నారు. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో ఆయా మండలాల్లో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు ఉన్నత ఉద్యోగం సాధించే లక్ష్యంతో లాంగ్‌లీవ్‌ పెడుతున్నారు. దీంతో రెవెన్యూ కార్యాలయాల్లో నాయబ్‌ తహసీల్దార్లు అందించే సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. హైదరాబాద్‌ జిల్లాలో 31 మంది నాయబ్‌ తహసీల్దార్లు ఉన్నారు. ఇందులో కొంతమంది మండల కేంద్రాల్లోని తహసీల్దార్‌, రెవెన్యూ డివిజన్‌ ఆఫీసుల్లో, మరికొందరు కలెక్టరేట్‌లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. గ్రూప్‌-2 కింద ఉద్యోగాలు సాధించిన వీరందరూ కొంతకాలంగా జిల్లా ప్రజలకు సేవలందిస్తున్నారు. అయితే, గతంలో గ్రూప్‌-1 పోస్టులకు ఎదురుచూసినా నోటిఫికేషన్‌ రాకపోవడంతో గ్రూప్‌-2 పరీక్ష రాసి రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు సాధించారు. ఈ క్రమంలో సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్‌-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేయడంతో నాయబ్‌ తహసీల్దార్లు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. ఈ మేరకు గ్రూప్‌-1 ఆఫీసర్‌గా స్థిరపడేందుకు ముందుకు సాగుతున్నారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ.. పోటీ పరీక్షలకు సిద్ధమవడం కష్టమని భావిస్తున్న వారు సెలవుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటున్నారు.


జిల్లాలో పనిచేస్తున్న 31 మంది నాయబ్‌ తహీసీల్దార్లలో ఇప్పటివరకు 13 మంది సెలవులో ఉన్నట్లు తెలిసింది. మరో 18 మంది లాంగ్‌ లీవ్‌కోసం తహసీల్దార్ల ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దీంతో నాయబ్‌  తహసీల్దార్లు జారీచేసే ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇతర పనులకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌ కోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నప్పటికీ.. సంబంధిత నాయబ్‌ తహసీల్దార్లు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభంకానున్న తరుణంలో ఇంటర్‌, డిగ్రీ, ఇతర కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కులం, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకుంటున్నా సకాలంలో అందడంలేదని వారు చెబుతున్నారు. వాస్తవంగా మీ సేవలో దరఖాస్తు చేసుకున్న తర్వాత క్షేత్రస్థాయి విచారణ చేసి ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌ను వారం రోజుల్లో ఆన్‌లైన్‌ ద్వారా డిజిటల్‌ సంతకం చేసి నాయబ్‌ తహసీల్దార్లు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే ఆయా మండలాల్లో పనిచేస్తున్న వారిలో కొందరు ఇప్పటికే సెలవుపై వెళ్లడంతో తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. 


తహసీల్దార్లపై అదనపు భారం

గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో నాయబ్‌ తహసీల్దార్లు సెలవుల్లో వెళ్తుండడంతో తహసీల్దార్లపై అదనపు భారం పడుతోంది. ఇప్పటికే కులం, నివాస సర్టిఫికెట్లను జారీ చేస్తున్నామని, ప్రస్తుతం అదనంగా ఇన్‌కమ్‌ సర్టిఫికెట్ల బాధ్యతను తమపై వేస్తుండడంతో ఇతర విధులకు ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఆసరా పింఛన్ల దరఖాస్తులను పరిష్కరించడంతోపాటు రెవెన్యూ స్థలాల ఆక్రమణలపై కోర్టుల్లో నడుస్తున్న కేసులకు తరచూ హాజరుకావాల్సి వస్తోందని, ఈ సమయంలో నాయబ్‌ తహసీల్దార్లు చేసే పనులను తమకు అప్పగిస్తుండడంతో సతమతమవుతున్నామని పేర్కొంటున్నారు. ఇన్‌కమ్‌ సర్టిఫికెట్ల జారీ బాధ్యతను ఇతర ఉద్యోగులకు అప్పగించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2022-05-30T16:17:22+05:30 IST