సైకిల్‌ షెడ్‌లో కళాశాల..! పరీక్షలు ఎలా రాయాలి?

ABN , First Publish Date - 2022-02-23T22:09:41+05:30 IST

సైకిల్‌ షెడ్‌కు రెండు వైపులా రేకులు.. కింది నుంచి సగం గోడలు నిర్మిస్తే అదే జూనియర్‌ కళాశాల. దేవరపల్లి మండలం యర్నగూడెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సైకిల్‌ షెడ్‌లోనే నిర్వహిస్తున్నారు. ఎక్కడా స్థలం లేకపోవ డంతో యర్నగూడెం జడ్పీ హైస్కూల్‌ ఆవరణలో..

సైకిల్‌ షెడ్‌లో కళాశాల..! పరీక్షలు ఎలా రాయాలి?

దేవరపల్లి, ఫిబ్రవరి 22: సైకిల్‌ షెడ్‌కు రెండు వైపులా రేకులు.. కింది నుంచి సగం గోడలు నిర్మిస్తే అదే జూనియర్‌ కళాశాల. దేవరపల్లి మండలం యర్నగూడెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సైకిల్‌ షెడ్‌లోనే నిర్వహిస్తున్నారు. ఎక్కడా స్థలం లేకపోవ డంతో యర్నగూడెం జడ్పీ హైస్కూల్‌ ఆవరణలో మూడేళ్ల క్రితం జూనియర్‌ కళాశాల ఏర్పాటైంది. పాఠశాలకే సరిపడా తరగతి గదులు లేవంటే.. కళాశాల తరగతులు ఎలా.. సైకిల్‌ షెడ్‌ కనిపించింది. 60మంది విద్యార్థులతో కళాశాల తరగతులు ప్రారంభించారు. ప్రస్తుతం 140 మంది విద్యార్థులు అదే షెడ్‌లో చదువు సాగిస్తున్నారు. తరగతి గదులు, పరిపాలన కార్యాలయం కానీ లేని కళాశాలలో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కోరడం అత్యాశే అవుతుందేమో. ప్రస్తుత విద్యా సంవత్సరం మూడు గ్రూపులకు ముగ్గురు అధ్యాపకులతో నెట్టుకొచ్చారు. పరీక్షలు సమీపిస్తున్నాయని విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, స్థానిక పెద్దల ఒత్తిడితో పక్షం రోజుల క్రితం గెస్ట్‌ లెక్చరర్లను నియమించారు. ప్రస్తుతం ప్రి ఫైనల్‌, వచ్చే నెలలో ఫైనల్‌ పరీక్షలు ఉన్నాయి. సిలబస్‌ పూర్తి కాకుండా పరీక్షలు ఎలా రాయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

Read more