Police posts: మడమ తిప్పేసిన జగన్ సర్కార్!

ABN , First Publish Date - 2022-11-30T14:17:26+05:30 IST

రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి హోం శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే, దీనిపై నిరుద్యోగులు పెదవి విరుస్తున్నారు. నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా జగన్‌ ఇచ్చిన హామీ ఏంటి?

 Police posts: మడమ తిప్పేసిన జగన్ సర్కార్!
మడమ తిప్పేశారు..

ఏటా ఇస్తానని.. మూడేళ్లకు!

25 వేల ఖాళీల్లో నాలుగో వంతే భర్తీ.. 6,511 పోస్టులకే నోటిఫికేషన్‌

లక్షల సంఖ్యలో అభ్యర్థుల నిరీక్షణ.. నిరుద్యోగుల పెదవి విరుపు

తెలంగాణతో పోలిస్తే ఏపీలో నియామకాలు నామమాత్రమే

ఏటా భర్తీ చేస్తామంటూ 2019లో ఇచ్చిన హామీ ఊసేదీ?

సిబ్బంది లేక ఉన్నతాధికారుల్లో తీవ్ర అసంతృప్తి, అసహనం

(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి హోం శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే, దీనిపై నిరుద్యోగులు పెదవి విరుస్తున్నారు. నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా జగన్‌ ఇచ్చిన హామీ ఏంటి? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్నదేంటని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే.. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన నిరుద్యోగులకు, ముఖ్యంగా పోలీసు శాఖకు హామీలపై హామీలు గుప్పించారు. ఏటా నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు. ఉద్యోగాలను క్రమం తప్పకుండా భర్తీ చేస్తామని చెప్పారు. ప్రధానంగా 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అక్టోబరు 21న జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలోనూ ఇదే మాట వల్లెవేశారు. ఇప్పటికి మూడేళ్లు గడిచిపోయినా, పోలీసులపై నిరంతర ఒత్తిడి పెరుగుతున్నా, నిరుద్యోగులు కొలువుల కోసం ఎదురు చూస్తున్నా ముఖ్యమంత్రి మాత్రం పట్టించుకోలేదు. తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్‌లోనూ కేవలం 6,511 పోస్టులను మాత్రమే చూపించి.. తమ ఆశలపై నీళ్లు చల్లారని పోలీసు ఉద్యోగార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా 6,500 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తానని మాటిచ్చి మడమ తిప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తం ఖాళీల్లో పావు వంతు భర్తీకి పచ్చజెండా ఊపి తమను విస్మయానికి గురి చేశారని అంటున్నారు.

అలా చేసి ఉంటే!

2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌.. తానిచ్చిన మాట ప్రకారం జనవరి 2020లో తొలి నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంది. 2021లో రెండోది, 2022 జనవరిలో మూడోది ఇవ్వాలి. అలా చేసి ఉంటే, ఇప్పటికే 19,500 మంది పోలీసులు డిపార్ట్‌మెంట్‌లోకి వచ్చి చేరేవారు. కానీ, అలా చేయలేదు. ఇక, తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రక్రియ ప్రారంభమై ఎంపిక విధానం మొదలయ్యే(జనవరి 2023) నాటికి 26వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ కావాల్సి ఉంది. అయితే, ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్‌ సజావుగా సాగితే 6,511 మంది మాత్రమే డిపార్ట్‌మెంట్‌లోకి రానున్నారు. దీనివల్ల పోలీసుల కొరత ఎప్పటిలానే ఉంటుందని డిపార్ట్‌మెంట్‌ వర్గాలు అంటున్నాయి.

వీరి పరిస్థితి ఏంటి?

గత మూడేళ్లుగా ఎలాంటి నోటిఫికేషన్‌ లేకపోవడంతో చాలా మంది ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్‌ మేరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోయారు. దీనికి కారణం నిబంధనల మేరకు వయో పరిమితిని మించిపోవడమే! దీంతో వీళ్లంతా తమ సంగతేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అదేసమయంలో ఒకేసారి మూడేళ్లకు సంబంధించి మొత్తం ఖాళీ పోస్టులు 26 వేల భర్తీకి నోటిఫికేషన్‌ వస్తుందని ఎదురు చూశారు. కానీ, 6,511 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాట తప్పను.. మడమ తిప్పను.. అని పదే పదే చెప్పే ముఖ్యమంత్రి తన మాట ప్రకారమే మిగిలిన వాటికి కూడా మరో నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరుతున్నారు. ఇదిలావుంటే, తెలంగాణలో ఒకేసారి 16,500 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసి ఎంపిక కూడా పూర్తి చేశారని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, తాజాగా తెలంగాణలో మరో 6,500 మంది పోలీసు పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైందని చెబుతున్నారు.

జిల్లాలు పెరిగినా..

పని ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నామంటూ పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు వెయ్యి మంది వరకు కొరత ఉంటే నేరాలు ఎలా అరికట్టాలని 26 జిల్లాల ఎస్పీలు సైతం ప్రశ్నిస్తున్నారు. శాఖలో ఉన్న ఖాళీలు, కొత్త జిల్లాలతో పెరిగిన పని ఒత్తిడికి తగ్గట్టు పోస్టుల భర్తీ లేకపోవడం ఇబ్బందిగా మారుతోందని చెబుతున్నారు. అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు, సైబర్‌ నేరాలు వంటివి పెరుగుతుండడం, ప్రభుత్వ పరంగా పెరుగుతున్న సేవలు వంటివి సిబ్బంది కొరత కారణంగా తమకు సవాలుగా మారుతున్నాయని అంటున్నారు. దీంతో జిల్లాల్లో పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వలేక పోతున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

నాడు చెప్పిందేంటి?

రాష్ట్రంలో పోలీసులు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. ఇప్పటి వరకు ఉన్న ఖాళీలు, వీక్లీ ఆఫ్‌ దృష్ట్యా పోలీసు ఉద్యోగాల భర్తీకి ఈ డిసెంబరు నుంచే నోటిఫికేషన్‌ ఇస్తాం. ప్రతి సంవత్సరం 6,500 చొప్పున ఉద్యోగాలను భర్తీ చేస్తాం. నాలుగేళ్లలో 26 వేల ఖాళీలను భర్తీ చేసేలా ప్రతి జనవరిలో క్యాలెండర్‌ విడుదల చేస్తాం -అమరవీరుల సంస్మరణ కార్యక్రమం సందర్భంగా 2019 అక్టోబరు 21న సీఎం జగన్‌ ఇచ్చిన మాట ఇది.

నేడు చేసిందేంటి?

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మూడేళ్ల క్రితం ఇచ్చిన మాట సీఎం జగన్‌కు ఇప్పుడు గుర్తొచ్చింది. పోనీ, మూడేళ్లకు కలిపి 6,500 చొప్పున 19,500 పోస్టుల భర్తీకైనా నోటిఫికేషన్‌ ఇచ్చారా అంటే అదీలేదు. కేవలం 6,511 పోస్టులు ప్రకటించి చేతులు దులుపుకొన్నారు. నిజానికి 2019కి ముందున్న పరిస్థితి కన్నా పోలీసులు ఇప్పుడు ఎక్కువగా సతమతమవుతున్నారు. సిబ్బంది చాలడం లేదనే మిషతో ‘వీక్లీ ఆఫ్‌’ల వాగ్దానం కూడా అటకెక్కించారు. అయినప్పటికీ పోస్టుల భర్తీలో మాత్రం మరోసారి మడమ తిప్పేశారు!.

లెక్క తక్కువైంది!

రాష్ట్ర జనాభా ఐదున్నర కోట్ల మంది ఉన్నారు. వీరి సేవలకుగాను 26 జిల్లాల్లో 1,021 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. మరి సిబ్బంది సంఖ్యను చూస్తే.. హోం శాఖ లెక్కల ప్రకారం 75,412 మంది ఉండాలి. కానీ, ఇప్పుడు కనీసం 54 వేల మంది కూడా లేకపోవడం గమనార్హం. దీంతో పోలీసులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఆశావహులు లక్షల్లోనే

పోలీసు శాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలకు డిగ్రీ, కానిస్టేబుల్‌ పోస్టులకు ఇంటర్‌ను అర్హతగా పేర్కొన్నారు. అయితే, డిగ్రీ, ఇంటర్‌ చదువుకున్న యువకులు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరంతా ఇప్పుడు 6,511 పోస్టుల కోసం పోటీపడాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్‌కు లక్షల సంఖ్యలోనే దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని పోలీసు నియామక విభాగం అంచనా వేస్తోంది. 6,511 పోస్టులంటే ఒక్క శాతం మంది ఆశావహులకే అవకాశం దక్కొచ్చని అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2022-11-30T14:17:28+05:30 IST