విద్యార్థుల నుంచీ హరిత నిధి సేకరణ! ఆర్థిక శాఖ ఉత్తర్వులు

ABN , First Publish Date - 2022-02-19T16:46:06+05:30 IST

రాష్ట్రంలో అటవీ సంపదను రక్షించేందుకు, హరితహారం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించేందుకు హరిత నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం... ఆ దిశగా తొలి అడుగు వేసింది. హరిత నిధికి అన్ని వర్గాల నుంచి విరాళాల రూపంలో..

విద్యార్థుల నుంచీ హరిత నిధి సేకరణ! ఆర్థిక శాఖ ఉత్తర్వులు

ఏడాదికి ఒకసారి రూ.10 నుంచి రూ. 100

ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో కోత

నియోజకవర్గ అభివృద్ధి నిధి నుంచి 10శాతం

ప్రతి రిజిస్ట్రేషన్‌పై రూ.50 చొప్పున వసూలు

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ


హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అటవీ సంపదను రక్షించేందుకు, హరితహారం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించేందుకు హరిత నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం... ఆ దిశగా తొలి అడుగు వేసింది. హరిత నిధికి అన్ని వర్గాల నుంచి విరాళాల రూపంలో నిధులు సేకరిస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు తమ వంతుగా ఆర్థిక సహాయం అందించాలని సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎవరెవరి నుంచి ఎంత విరాళం సేకరించాలి? ఉద్యోగుల వేతనాల్లో ఎంత కోత విధించాలి?... అన్న అంశాలపై ఆర్థిక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి శుక్రవారం రెండు ఉత్తర్వులు జారీ చేశారు.


ఈ మేరకు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించడంతోపాటు విద్యార్థుల వద్ద రూ. 10 నుంచి రూ. 100 వరకు వసూలు చేయనున్నారు. ఏడాదిలో ఒకసారి ఏప్రిల్‌ నెల (మే నెలలో వచ్చే) వేతనం నుంచి ఈ మేరకు కోతలు విధించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 2.75 కోట్ల ఎకరాల భూమి ఉండగా.. అందులో 66.25 లక్షల ఎకరాల మేర అటవీ భూములు ఉన్నాయి. తాజాగా ఏర్పాటు చేయనున్న హరిత నిధిని వృక్ష సంపదను కాపాడేందుకు ఉపయోగించనున్నారు.


ఎవరెవరి నుంచి ఎంతంటే..

ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు రూ. 6000

జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు రూ.1200

ఎంపీపీ చైర్‌పర్సన్లు రూ.600

కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు రూ.120

కేంద్ర సర్వీస్‌ అధికారులు రూ.1200

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులు రూ.300


ఒక్కో విద్యార్థి నుంచి.. 

పదో తరగతి వరకు రూ.10

ఇంటర్‌ రూ.15

డిగ్రీ రూ.25

ప్రొఫెషనల్‌ కోర్సులు రూ.100


ఇతర వర్గాల నుంచి..

ప్రతి రిజిస్ట్రేషన్‌పై రూ.50

వ్యాపార సముదాయాల లైసెన్సు రెన్యూవల్‌ రూ.1000

బార్‌, వైన్‌షాపుల లైసెన్సు రెన్యూవల్‌ రూ.1000

ఇంజనీరింగ్‌ విభాగం నిర్వహించే పనుల నుంచి 0.01%

నియోజకవర్గ అభివృద్ధి నిధి నుంచి 10%Read more