పోషకాహారం కాదు.. విషాహారం! గురుకులాల్లో తరచుగా ఫుడ్‌ పాయిజనింగ్‌

ABN , First Publish Date - 2022-07-05T20:36:15+05:30 IST

సిద్దిపేటలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో జూన్‌ 26న వంకాయ కూరలో ముందు రోజు మిగిలిపోయిన చికెన్‌ గ్రేవీ కలపడంతో అది తిన్న 150 మంది విద్యార్థులు అస్వస్థతకు

పోషకాహారం కాదు.. విషాహారం! గురుకులాల్లో తరచుగా ఫుడ్‌ పాయిజనింగ్‌

గురుకులాల్లో తరచుగా ఫుడ్‌ పాయిజనింగ్‌

వారం వ్యవధిలోనే వందల మంది విద్యార్థులకు అస్వస్థత

తల్లిదండ్రుల ఆందోళన

సాంఘిక సంక్షేమ శాఖ దిద్దుబాటు చర్యలు

ఆహార నాణ్యతపై రోజూ విద్యార్థుల ఫీడ్‌ బ్యాక్‌

సంక్షేమ హాస్టళల్లో విద్యార్థులపై కొరవడిన నిఘా


  • సిద్దిపేటలోని మైనారిటీ గురుకుల పాఠశాల(Minority Gurukula School)లో జూన్‌ 26న వంకాయ కూరలో ముందు రోజు మిగిలిపోయిన చికెన్‌ గ్రేవీ కలపడంతో అది తిన్న 150 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
  • అదే రోజున జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో కలుషితాహారం తిని 60 మందికి పైగా విద్యార్థులు దవాఖానలో చేరారు.
  • ఈ నెల 1న ఆసిఫాబాద్‌ జిల్లా కొటాల మండలం మొగడ్‌దగడ్‌ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం వడ్డించారు. 

హైదరాబాద్‌, జూలై 4(ఆంధ్రజ్యోతి): గురుకులాలు, ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల్లో(Govt Welfare Hostel) కలుషితాహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని అనారోగ్యం పాలైన ఘటనలు రోజుకొకటి చొప్పున వెలుగులోకి వస్తున్నాయి. బాధిత విద్యార్థుల సంఖ్య రెండువందలకు పైనే ఉంది. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమైన రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటనలు జరగడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. గురుకులాల్లో విద్యార్థులకు ఆహారం అందించడానికి ముందు ఉపాధ్యాయులు రుచి చూసి నాణ్యత పరిశీలించాలనే నిబంధన ఉంది. కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు. కూరగాయల నాణ్యత, వంటలో వాడే ఇతర పదార్థాలు నిర్ణీత ప్రమాణాల మేరకు ఉన్నాయా.. లేవా.. అనేది అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. అదీ జరగడం లేదు. తనిఖీల లోపంతో చాలా చోట్ల కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఉపయోగిసున్నారు. దీని వల్ల ఆహారం విషపూరితం అవుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. 


ఆరోగ్య పరీక్షలకు మంత్రి ఆదేశం

గురుకులాల్లో విద్యార్థుల అస్వస్థతపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ స్పందించారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయించాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ వల్ల సుమారు రెండేళ్ల తర్వాత విద్యార్థులు పాఠశాలలకు వస్తుండటంతో వారికి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా.. అని ప్రాథమిక పరీక్షల ద్వారా గుర్తించనున్నారు. విద్యార్థుల హెల్త్‌ ప్రొఫెల్‌ తయారు చేసి, ఇబ్బందికరంగా ఉందనుకున్న వారి సమాచారం తల్లిదండ్రులకు ఇస్తారు.


ప్రధాన కార్యాలయంలో కంట్రోల్‌ రూం 

ఫుడ్‌ పాజియన్‌, విద్యార్థుల అనారోగ్యం నేపథ్యంలో సాంఘిక సంక్షేమ, గురుకుల విద్యాసంస్థల అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. అన్ని సాంఘిక సంక్షేమ గురుకులాల నుంచి ప్రతి రోజు మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక ఉపాధ్యాయుడు, విద్యార్థి నుంచి ఆహారం, రుచి, నాణ్యత వివరాలు తెలుసుకుని నమోదు చేస్తున్నారు.


నిఘా లోపంతో విద్యార్థి ఆత్మహత్య

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మునిసిపాలిటీ పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి విద్యార్ధి చంటి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. గురుకుల అధికారుల నిర్లక్షం, నిఘా లోపం వల్లే చంటి గురుకులం నుంచి బయటకు వెళ్లి పురుగుల మందు కొనుక్కొని వచ్చాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చంటి జూన్‌ 22న టౌన్‌కు వెళ్లి  పురుగుల మందు డబ్బాలు కొని తెచ్చుకొన్నాడు. గదిలో దాచుకుని మరుసటి రోజు మధ్యాహ్నం తాగాడు. హైదరాబాద్‌ ఫీర్జాదిగూడలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అనిత అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. గుండెపోటుతో  మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే గురుకులంలో అపరిశుభ్ర వాతావరణం, కలుషిత ఆహారమే విద్యార్ధిని మృతికి కారణమని విద్యార్ధి సంఘాలు ఆరోపించాయి.

Read more