వచ్చేవారం ఉద్యోగపర్వం! తొలి నోటిఫికేషన్‌ జారీకి రంగం సిద్ధం?

ABN , First Publish Date - 2022-03-18T12:36:33+05:30 IST

ఎనభై వేల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించి వారం గడుస్తున్నా ఎలాంటి కదలిక లేదని నిట్టూరుస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రంగం...

వచ్చేవారం ఉద్యోగపర్వం! తొలి నోటిఫికేషన్‌ జారీకి రంగం సిద్ధం?

సోమవారం తర్వాత ఎప్పుడైనా?

సీఎం వద్దకు ఉద్యోగ పోటీ పరీక్షల ఫైలు

సీఎస్‌తో సమీక్ష అనంతరం పంపిన ఆర్థిక శాఖ

పోలీస్‌, ‘పంచాయతీ’, విద్య, వైద్యానికి ప్రాధాన్యం

సీఎం ఆమోదించే శాఖలకే ఆర్థిక శాఖ అనుమతి

రిజర్వేషన్లు, రోస్టర్లు నిర్ణయించనున్న శాఖలు

తర్వాత రిక్రూట్‌మెంట్‌ బోర్డులకు ప్రతిపాదనలు

సిలబస్‌ అప్‌డేట్‌పై టీఎస్‌పీఎస్సీ దృష్టి 

ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్న కమిషన్‌

ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాగానే నోటిఫికేషన్లు

పుస్తకాలను ముద్రిస్తున్న తెలుగు అకాడమీ

కొత్త జిల్లాల సమాచారంతో తెలంగాణ జాగ్రఫీ

నాలుగు నగరాల్లో పుస్తకాల విక్రయ కేంద్రాలు


హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ఎనభై వేల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించి వారం గడుస్తున్నా ఎలాంటి కదలిక లేదని నిట్టూరుస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఏ క్షణమైనా నోటిఫికేషన్లు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రాధాన్య శాఖలను అగ్రభాగాన పేర్కొంటూ సీఎం కేసీఆర్‌ ఆమోదం కోసం ఫైలును పంపారు. ఆయన ఆమోదించిన పోస్టులకు తొలి నోటిఫికేషన్లు వెలువడతాయని భావిస్తున్నారు. పోలీసు, పంచాయతీరాజ్‌, విద్య, వైద్య శాఖల్లో ఏదో ఒక శాఖకు సంబంధించి తొలి నోటిఫికేషన్‌ రావొచ్చని అంచనా వేస్తున్నారు. అన్నీ సజావుగా జరిగితే సోమవారం తర్వాత ఎప్పుడైనా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడతాయని అధికార వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఖాళీ పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ గురువారం బీఆర్కే భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఆర్థిక శాఖ సీనియర్‌ సలహాదారు శివశంకర్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రాస్‌, టీఎ్‌సపీఎస్సీ చైర్మన్‌ బి.జనార్ధన్‌రెడ్డి, పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, హోం, విద్య, వైద్యం తదితర శాఖల కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.


ఖాళీల భర్తీ, రోస్టర్‌ పాయింట్ల నిర్ధారణ, రిజర్వేషన్లు, న్యాయపరమైన చిక్కులు, ఆర్థిక భారం వంటి అన్ని అంశాలను చర్చించారు. పోస్టుల భర్తీ కోసం సీఎం కేసీఆర్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, వెంటనే నోటిఫికేషన్లను జారీ చేయాల్సి ఉందని సీఎస్‌ వారికి వివరించారు. ముఖ్యమంత్రి ఆమోదించగానే ఆయా పోస్టులకు అనుమతి ఇస్తామని చెప్పారు. ఈ సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి ఆమోదం కోసం ఆర్థిక శాఖ గురువారం ఉద్యోగాల ఫైలును పంపించింది. అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలను అందజేసింది. ఆర్థిక, న్యాయపరమైన చిక్కులు లేని పోస్టుల గురించి వివరించింది. న్యాయ చిక్కులు ఎదురయ్యే పోస్టుల గురించీ ప్రస్తావించినట్లు తెలిసింది. పోలీసు, పంచాయతీరాజ్‌, విద్య, వైద్య శాఖలకు సంబంధించిన పోస్టులను ఫైల్‌లో అగ్ర భాగాన పెట్టినట్లు సమాచారం. వీటిలో వేటిని ముందుగా భర్తీ చేయాలో తెలియజేయాలని సీఎంను కోరినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కూడా 2-3 రోజుల్లో ఆమోదం తెలిపే అవకాశమున్నట్లు అధికార వర్గాలు వివరించాయి.


రిజర్వేషన్లు, రోస్టర్‌ బాధ్యత శాఖలదే

ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన పోస్టుల ఫైళ్లు సంబంధిత శాఖలకు వెళతాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్లకు అనుగుణంగా రావాల్సిన పోస్టులను ఆయా శాఖలు ఖరారు చేస్తాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన జోనల్‌ వ్యవస్థ ప్రకారం స్థానికులకు 95ు పోస్టులను కేటాయించాల్సి ఉంది. ఈ నిబంధన మేరకు ఆయా వర్గాలకు రోస్టర్‌ పాయింట్లను ఖరారు చేస్తాయి. అనంతరం తమ శాఖల పోస్టులకు ప్రత్యక్ష ఎంపిక చేపట్టాలంటూ సంబంధిత రిక్రూట్‌మెంట్‌ బోర్డులకు పంపిస్తాయి. ఆ తర్వాత నోటిఫికేషన్లు జారీ అవుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో టీఎ్‌సపీఎస్సీసహా పోలీసు, సంక్షేమ, వైద్య పోస్టులకు సంబంధించి రిక్రూట్‌మెంట్‌ బోర్డులున్నాయి. పోలీసు బోర్డు భర్తీ చేసే హోం శాఖ పోస్టులే 18,334 వరకు ఉన్నాయి. తర్వాత అత్యధికంగా పాఠశాల విద్యాశాఖలో 13,086 పోస్టులు, వైద్య ఆరోగ్య శాఖలో 12,755 పోస్టులు, ఉన్నత విద్యాశాఖలో 7,878 పోస్టులు, బీసీ సంక్షేమ శాఖలో 4,311 పోస్టులు ఉన్నాయి.


కేసీఆర్‌ ప్రకటించి వారం గడిచింది

ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేసి వారం రోజులు గడిచిపోయాయి. ఇప్పటివరకు నోటిఫికేషన్లపై ఎలాంటి సమాచారం వెలువడలేదు.  ప్రభుత్వ పెద్దలు, అధికారుల నుంచైనా ఎలాంటి స్పష్టత రాలేదు. ఫలానా నోటిఫికేషన్‌ను ఇవ్వబోతున్నామని గాని, ఎన్నో కొన్ని పోస్టులను ప్రకటిస్తున్నామన్న సమాచారం కానీ వెలువడలేదు. గురువారం బీఆర్కే భవన్‌లో సీఎస్‌ నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షతో నిరుద్యోగుల్లో కొంత ఆశలు చిగురిస్తున్నాయి. నోటిఫికేషన్లు వెలువడతాయని ఎదురు చూస్తున్నారు. ఒక్క నోటిఫికేషన్‌ వెలువడినా... దానికి తగ్గట్టుగా ప్రిపేర్‌ అవుదామన్న ఆలోచనలో ఉన్నారు. అటెండర్‌ నుంచి ఆర్డీఓ స్థాయి వరకు స్థానిక అభ్యర్థులకే 95 శాతం మేర రిజర్వేషన్లు దక్కుతాయని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో  నిరుద్యోగులు పోటీ పరీక్షల మూడ్‌లోకి వచ్చేశారు. దీనికితోడు గరిష్ఠ వయోపరిమితిని పెంచి, ఓసీలకు 44, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లుగా నిర్ణయించారు. 39,829 పోస్టులు జిల్లా కేడర్‌కు సంబంధించినవి కాగా, 18,866 జోనల్‌, 13,170 మల్టీ జోనల్‌, 8,147 సచివాలయం, హెచ్‌ఓడీలు, విశ్వవిద్యాలయాల పోస్టులున్నాయి. నోటిఫికేషన్లు వెలువడిన వెంటనే దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. 


కొత్తగా మరో 5 బీసీ స్టడీ సర్కిళ్లు

నిరుద్యోగ యువతను పోటీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ తరగతులు నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఒక్కో స్టడీ సర్కిల్‌లో సుమారు 300 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే సదుపాయం ఉంది. అయితే, ఆ సామర్థ్యాన్ని 500కు పెంచాలని బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 10 స్టడీ సర్కిళ్లు ఉండగా.. త్వరలోనే మరో 5 స్టడీ సర్కిళ్లు ప్రారంభించాలని యోచిస్తున్నారు. రోజుకు రెండు షిఫ్టుల్లో స్టడీ సర్కిల్‌ నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. తద్వారా ఒక్కో స్టడీ సర్కిల్‌లో వెయ్యి మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇలా మొత్తంగా 15 స్టడీ సర్కిళ్ల ద్వారా 15 వేల మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఉగాది పండుగ తర్వాత ప్రతి నియోజకవర్గంలో స్టడీ సెంటర్లు ప్రారంభించనున్నారు. మొత్తంగా లక్ష మంది అభ్యర్థులను సంసిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘‘స్టడీ సర్కిళ్లతోపాటు వచ్చే నెల నుంచి స్టడీ సెంటర్లు పనిచేస్తాయి. ఒక్కో అభ్యర్థికి గరిష్ఠంగా 300 గంటలు శిక్షణ ఇస్తాం’’ అని  బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. Read more