తెలంగాణకు అత్యధిక నష్టాన్ని కలిగించిందేది? గ్రూప్-1 గైడెన్స్!

ABN , First Publish Date - 2022-05-30T17:34:44+05:30 IST

‘తెలంగాణ ఉద్యమం’ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్‌ సిలబస్‌లో సహజంగానే తెలంగాణ ఉద్యమ అంశాలు అగ్ర భాగాన ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర మూలాలు, స్వభావం, పరిణామక్రమం, ఫలితాల విశ్లేషణ సహా సంపూర్ణంగా ఉద్యమ అంశాలను..

తెలంగాణకు అత్యధిక నష్టాన్ని కలిగించిందేది? గ్రూప్-1 గైడెన్స్!

‘తెలంగాణ ఉద్యమం’ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్‌ సిలబస్‌లో సహజంగానే తెలంగాణ ఉద్యమ అంశాలు అగ్ర భాగాన ఉంటాయి.  తెలంగాణ రాష్ట్ర మూలాలు,  స్వభావం, పరిణామక్రమం, ఫలితాల విశ్లేషణ సహా సంపూర్ణంగా ఉద్యమ అంశాలను అవగతం చేసుకోవాలి. గ్రూప్‌ 1, 2, 3, 4 సర్వీస్‌లకు; టీచర్‌, పోలిస్‌ ఉద్యోగాల పరీక్షలకు ఉద్యమ సిలబస్‌ను అకడమిక్‌ కోణంలో చదవాలి.


వాస్తవంగా తెలంగాణ ఉద్యమ పరిణామక్రమం అంతా ముల్కీ అంశాలపై ఆధారపడి ఉంటుంది. 1868లో విడుదలైన ముల్కీల రక్షణ జరిధా నుంచి 2021లో విడుదలైన 317 జీవో (40) వరకు తెలంగాణ రాజకీయ ముఖచిత్రం తద్వారా రూపుదిద్దుకొన్న ఆర్థిక, సామాజిక అంశాలపై ముల్కీ నిబంధనల ప్రభావం స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల కోసం సన్నద్దమౌతున్న అభ్యర్థులు ముల్కీ మూలాల చారిత్రక పరిణామక్రమాన్ని అర్థం చేసుకోకుండా తెలంగాణ ఉద్యమక్రమాన్ని విశ్లేషణ చేసుకోవడం సాధ్యం కాదు. 


ముల్కీ చరిత్ర మూలాలు

  • తెలంగాణ ప్రాంత చరిత్రలో సాలార్‌జంగ్‌ సంస్కరణల ఫలితంగా ఆధునిక యుగం ఆరంభమైంది. 19 వ శతాబ్దం చివరి నాటికి నిజాం రాజ్యం, హైదరాబాద్‌ సంస్థానంపై బ్రిటిష్‌ సామ్రాజ్య ప్రభావం, ఆధునిక ఐరోపా పోకడలు ఆరంభమయ్యాయి. 1869లో సూయజ్‌ కాలువ తవ్వడంతో యూరప్‌ నుంచి రాకపోకలు పెరిగాయి. మద్యధర - ఎర్ర సముద్రం కలయికతో రవాణా అంతర్జాతీయంగా విస్తరించింది. 
  • సాలార్‌జంగ్‌ ప్రవేశపెట్టిన  జిలాబంది పరిపాలన సంస్కరణలు, ప్రత్యేక రెవెన్యూ సంస్కరణలు, స్వీయ కరెన్సీ వ్యవస్థ, విద్య - న్యాయ సంస్కరణలు, పోలీసు సంస్కరణలు వంటివి హైదరాబాద్‌ పరిపాలన స్వరూపాన్ని పూర్తిగా మార్చాయి. బ్లన్‌ పోర్డ్‌ నివేదిక ఆధారంగా 1871లో విల్‌ఫ్రెడ్‌ కింగ్‌ ఆధ్వర్యంలో ఆరంభమైన సింగరేణి బొగ్గు వెలికితీత, 1874 అక్టోబరు 8లో పూర్తయిన నిజాం గ్యారెంటెడ్‌ స్టేట్‌ రైల్వేస్‌, 1864లో ఏర్పడిన ప్రత్యేక రెవెన్యూ బోర్డ్‌ వంటివి హైదరాబాద్‌ రాజ్యానికి గణనీయమైన ఆర్థిక వనరులను అందించాయని సమాచారం. 
  • పరిపాలన సంస్కరణల అమలు కోసం నూతన ఉద్యోగ బృందాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. వీటి అమలు కోసం బ్రిటిష్‌ ఇండియాలోని పరిపాలన అధికారులకు ఆహ్వానం అందింది. అత్యధిక వేతనాలు ఆశ చూపడంతో పెద్ద సంఖ్యలో బ్రిటిష్‌ ఇండియా నుంచి  హైదరాబాద్‌కు ఉద్యోగాల కోసం తరలివచ్చారు. వీరిలో ఎక్కువగా మద్రాసీ ఆంధ్రులు, బెంగాల్‌ చటోపాధ్యాయులు, ఉత్తర భారత బ్రాహ్మణులు ఉన్నారు. ఉన్నత ఉద్యోగాల్లో చేరిన వీరు స్థానిక హైదరాబాదీలను చిన్న చూపు చూడడం, అవమానించడం, వారి కోసం వచ్చిన దైవదూతలుగా భావించుకోవడం ప్రారంభమైంది. ఇది స్థానికులకు లేదా ముల్కీలకు ఆగ్రహం కలిగించింది. క్రమంగా ముల్కీల అస్తిత్వ ఉద్యమానికి దారితీసింది.  


ముఖ్యమైన ముల్కీ రక్షణ నిబంధనలు

  • 1868లో సాలార్‌జంగ్‌ ప్రధానమంత్రిగా స్థానిక ఉద్యోగాల్లో ముల్కీలకు ప్రాధాన్యం ఉంటుందనే ‘జరిధా’ లేదా జీవోను విడుదల చేశారు. ఇది ముల్కీల రక్షణ కోసం రూపొందిన మొదటి నిబంధన.
  • 1883లో ఉద్యోగ నియామకాల కోసం నూతన వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇదే హైదరాబాద్‌ సివిల్‌ సర్వీస్‌గా గుర్తింపు పొందింది. ఈ సివిల్‌ సర్వీస్‌ పాతకాలపు వారసత్వ ఉద్యోగాల విధానాన్ని సంస్కరించే ప్రయత్నం చేసింది. 
  • 1884, 1888 సంవత్సరాల్లో కూడా ముల్కీల రక్షణ కోసం ప్రత్యేక జరిధాలు విడుదలయ్యాయి.
  • వాస్తవంగా హైదరాబాదీలకు లేక ముల్కీలకు ‘కసన్‌ వాకర్‌’ అనే బ్రిటిష్‌ అధికారి వలన అత్యధిక అన్యాయం జరిగింది. ఇంగ్లీష్‌ భాష నిపుణులను మాత్రమే ఉన్నత ఉద్యోగాల్లో నియమించడం వల్ల పర్షియన్‌, ఉర్దూ భాషల్లో మాత్రమే పరిజ్ఞానం ఉన్న స్థానికులు / ముల్కీలు తీవ్రంగా నష్టపోయారు. 
  • 1894లో సేకరించిన ఉన్నత స్థాయి ఉద్యోగుల లిస్ట్‌లో ముల్కీల సంఖ్య ఒకటి కాగా గైర్‌ ముల్కీలు/ స్థానికేతరుల సంఖ్య 447. 
  • 1901లో సర్‌ కిషన్‌ పర్‌షార్‌ ఆధ్వర్యంలో స్థానికులకు ఉద్యోగ కల్పన కోసం కొన్ని ప్రయత్నాలు జరిగాయి. దీనికి అనుగుణంగా 1910లో నూతన ఉద్యోగ కల్పన కోసం ఒక ప్రకటన జారీ అయింది. 


ముల్కీ నిబంధనలు - 1919 ప్రకటన

  • నిజాం రాజ్యంలో ముల్కీల రక్షణ కోసం ఏడో నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ తన ప్రధానమంత్రి అలి ఇమామ్‌తో కలసి రూపొందించిన విధి విధానాలే నేటికీ ముల్కీల ఉనికిని, నిర్వచనాన్ని, రక్షణ అవసరాలను శాస్త్రీయంగా వివరిస్తున్నాయి. 
  • 1917 ఏప్రిల్‌ 26న ఉస్మానియా యూనివర్సిటీ స్థాపన కోసం విడుదల చేసిన ఫర్మానా లేదా జీవో, నూతన ముల్కీ చట్టం కోసం అవసరమైన వాతావరణాన్ని తయారు చేసింది. ఈ ఫర్మానాలోని ప్రధాన అంశాలు:
  • ముల్కీలు అంటే హైదరాబాద్‌ రాజ్యంలో జన్మించినవారు. అంటే హైదరాబాదీలందరూ ముల్కీలే. 
  • పదిహేను సంవత్సరాలు వరసగా హైదరాబాద్‌లో జీవిస్తున్నవారు కూడా ముల్కీలుగానే గుర్తింపు పొందుతారు
  • ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తరవాత తహసిల్దారు లేదా మెజిస్ట్రేట్‌ సాక్షిగా తమ భవిష్యత్‌లో కూడా హైదరాబాద్‌లో ఉంటామనే హామీ పత్రాన్ని ఇవ్వాలి. 
  • ముల్కీలకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. 
  • వాస్తవంగా ముల్కీ రూల్స్‌ పటిష్ఠంగా రూపొందించినప్పటికీ అమలులో అనేక అక్రమాలు, దాటవేతలు జరిగాయి. అప్పటికే గైర్‌ ముల్కీలు ఉన్నతమైన పదవుల్లో, ఉద్యోగాల్లో ఉండడం వల్ల ఈ తప్పిదాలు సంభవించాయి. ఈ నేపథ్యంలోనే డా.జోర్‌ ఆధ్వర్యంలో దక్కన్‌ జాతీయ వాదం, మరోవైపు హైదరాబాద్‌ ఫర్‌ హైదరాబాదీస్‌ అనే నినాదంతో ముల్కీ లీగ్‌, 1935లో స్థానికులకే ఉద్యోగాల కోసం  ఉద్యమాలు నిర్వహించారు. 
  • ఏడో నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌, ముల్కీ రూల్స్‌పై సమీక్ష కోసం 1937లో అరవముదు అయ్యంగార్‌ కమిటీని ఏర్పాటు చేశాడు. ఈ కమిటీ 1938లో తన రిపోర్ట్‌ను అందించింది. ఇందులో ముల్కీ నిబంధనల అమలుపై పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆచరణాత్మక సూచనలు చేసింది. అయితే అప్పటికే రెండో ప్రపంచయుద్ధం ఆరంభం కావడం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఉధృతం కావడం, జయిన్‌ ఇన్‌ ఇండియా ఉద్యమం ప్రధాన భూమిక పోషించడం వల్ల నిజాం రాజు ఈ కమిటీ రిపోర్ట్‌ను అమలు చేయలేకపోయాడు. 


స్వాతంత్రం అనంతరం ముల్కీ రూల్స్‌

ఆపరేషన్‌ పోలో అనంతరం హైదరాబాద్‌ భారత యూనియన్‌లో అంతర్భాగంగా మారింది. 1948 సెప్టెంబరు 18 నుంచి 1950 జనవరి 25 వరకు మిలట్రీ గవర్నర్‌ జనరల్‌ జయంత్‌నాథ్‌ చౌదరి పరిపాలనలో, 1950 జనవరి 26 నుంచి 1952 మార్చి 5 వరకు పౌర పరిపాలన అధికారి ఎం.కె.వెల్లోడి పరిపాలనలో కొనసాగింది.  


జయంత్‌నాథ్‌ పరిపాలన కాలంలో డీఎస్‌ బాంగ్లే ముఖ్య పరిపాలన అధికారిగా వ్యవహరించాడు. వీరికి ముల్కీ నిబంధనలపై అవగాహన లేకపోవడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి అధికారులను పిలిపించి నూతన హైదరాబాద్‌ రాష్ట్రంలో నియమించారు. ప్రధానంగా తెలంగాణ ప్రాంతానికి ఎక్కువగా అన్యాయం జరిగింది ఎం.కె.వెల్లోడి ప్రభుత్వ పరిపాలనలోనే! ఇంగ్లీష్‌ రాని ఉద్యోగులను తొలగించారు. మద్రాస్‌ రాష్ట్రం నుంచి ఉద్యోగులను హైదరాబాద్‌ రాష్ట్రానికి పిలిచి ప్రమోషన్స్‌ ఇచ్చారు. ముల్కీ నిబంధనలోని 1(ఎ), 1(సి) సెక్షన్లను అనుసరించకుండా ఉద్యోగ నియామకాలు జరిగాయి. 1950 దశకంలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో కె.వి. రంగారెడ్డి తదితరులు ఈ విషయాలను ప్రస్తావించారు. ముల్కీ నిబంధనల ఉల్లంఘన ఫలితంగానే 1952లో తెలంగాణలోని వరంగల్‌ కేంద్రంగా విద్యార్థి ఉద్యమం ప్రారంభమైంది. ఇదే సమయంలో జరిగిన హైదరాబాద్‌ సిటీ కాలేజీ సంఘటన అత్యంత విషాద ఘటనగా చరిత్రలో నిలిచింది.


1956 - 1969  ముల్కీ నిబంధనలు

వాస్తవంగా 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలో జరిగిన పెద్ద మనుషుల సమావేశంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల కలయికలో ముల్కీల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక చర్చ జరిగింది. ఆ నేపథ్యంలోనే 1956 జూలై 19న పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకాలు చేశారు. దీనికి అనుగుణంగా 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 16వ రాజ్యాంగ ఆర్టికల్‌కు మూడవ క్లాజ్‌ చేర్చారు. ఉద్యోగ నియామకాల్లో స్థానికత ఒక అంశంగా మారింది. దీని అమలు కోసం పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ యాక్ట్‌ 1957 రూపొందింది. ఈ చట్టాన్ని ఆర్టికల్‌ 371(1)లో చేర్చారు. 


సూత్రప్రాయంగా ఎన్ని రక్షణలు కల్పించినప్పటికీ ఆచరణలో మాత్రం అడుగు అడుగునా తూట్లు పడుతూనే ఉన్నాయి. ఒప్పంద ఉల్లంఘనతో తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో 1969లో ఉద్యమం ప్రారంభించారు. 


1969 ఉద్యమం లక్ష్యాన్ని చేధించలేకపోవడానికి కారణాలు అనేకం. అయినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, త్యాగాలను ప్రపంచానికి చాటి చెప్పి భవిష్యత్‌ ఉద్యమ నిర్మాణానికి బీజాలు వేసింది. 


ఆరుసూత్రాల పథకంతో ఆగమైన తెలంగాణ

ప్రొఫెసర్‌ జయశంకర్‌ అభిప్రాయం మేరకు తెలంగాణ ప్రాంతానికి అత్యధిక నష్టాన్ని కలిగించింది ఆరు సూత్రాల పథకమే. జై ఆంధ్ర ఉద్యమకారులను సంతృప్తి పరచి ఉద్యమ విరమణ కోసం 1973 సెప్టెంబరు 21న కేంద్ర ప్రభుత్వం ఈ సూత్రాలను ప్రకటించింది. ఫలితంగా ఎన్నో పోరాటాల, త్యాగాల ఫలితంగా సాధించిన అనేక ప్రత్యేక అవకాశాలను తెలంగాణ ప్రాంతం కోల్పోయింది. 1969 ఉద్యమంలో సాధించిన అష్ఠ సూత్రాల ఫలితాలు రద్దు చేశారు. 1959 ఆంధ్రప్రదేశ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ చట్టం రద్దయింది. చివరకు ముల్కీ రూల్స్‌ను కూడా 1973 డిసెంబరు 28న పార్లమెంట్‌ రద్దు చేసింది.


తెలంగాణ స్థానికత 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తరవాత ఏడు సంవత్సరాలకు చివరకు నాలుగు సంవత్సరాలకు కుదించారు. 


అనంతర పరిణామాలు

భారత పార్లమెంట్‌ ముల్కీ రూల్స్‌ను రద్దు చేసి 32వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్‌లో ఆమోదం పొంది 371 (1)కు డి, ఈ క్లాజ్‌లు చేర్చి ఏడో షెడ్యూల్‌లోని మొదటి జాబితాలో గల 63వ అంశానికి సవరణ చేశారు. దాన్ని రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా చట్టంగా చేర్చారు. 1974 మే 3న ఈ ప్రక్రియను రాష్ట్రపతి ఆమోదం పొందేలా చేశారు. 


ఈ అంశాలన్నీ 1975 అక్టోబరు 18న రాష్ట్రపతి ఉత్తర్వులు లేదా ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ పేరుతో అమల్లోకి వచ్చాయి. 


ముగింపు

అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌లో తెలంగాణ అంశాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మాత్రమే తమ లక్ష్యాన్ని ఛేదించగలుగుతారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే క్రమంలో భాగంగా రాష్ట్ర సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాలపై పట్టు సాధించాలి. 


ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఉద్యమ ఫలితం. తెలంగాణ ఉద్యమానికి పతాక మల్కీ పథకమే. ముల్కీ ఉద్యమమే వాస్తవ తెలంగాణ ఉద్యమం. అభ్యర్థులు ఈ విషయాన్ని గ్రహించి ఉద్యమ సబ్జెక్టుపై అవసరమైన అవగాహన ఏర్పరచుకొనే ప్రయత్నం చేయాలి.


అభ్యర్థులకు ముఖ్య సూచనలు

  • తెలంగాణ ఉద్యమం అనేది నేటి పోటీ పరీక్షల్లో ముఖ్యమైన అకడమిక్‌ అంశం. దీనికి సంబంధించిన పేపర్‌ను వర్తమానం ఆధారంగా చరిత్ర కోణంలో అవగతం చేసుకోవాలి. 
  • ముల్కీ చరిత్ర అనగానే ఉద్యమ సిలబ్‌సకు పతాకం అని గుర్తించాలి
  • 1868 నుంచి 2021 - 317 జీవో  వరకు జరిగిన పరిణామాలను ముల్కీ అవగాహనతో నోట్స్‌ రూపంలో రాసుకోవాలి. 
  • ముల్కీ  సూత్రాల అమలు కోసం అదేవిధంగా రద్దు కోసం జరిగిన రాజ్యాంగ సవరణలు, చట్టబద్ద పరిణామాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. 
  • ప్రధానంగా గ్రూప్‌ - 1 అభ్యర్థులు ముల్కీ  దశలను మూడు భాగాలుగా వర్గీకరించి అవగతం చేసుకోవాలి. 
  • 1969లో జై తెలంగాణ ఉద్యమం, 1972లో జై ఆంధ్రా ఉద్యమం  జరిగిన నేపథ్యంలో ముల్కీ  సూత్రాల పాత్రపై అవగాహన పెంచుకోవాలి. 

రిఫరెన్స్‌ పుస్తకాలు

తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్‌ - ప్రొ.జయశంకర్‌

తెలంగాణ ఉద్యమం - తెలుగు అకాడమీ

తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమం - డా.రియాజ్‌

తెలంగాణ ఉద్యమ చరిత్ర - వి. ప్రకాష్‌


-డాక్టర్‌ రియాజ్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ,  అకడమిక్‌ డైరెక్టర్‌, 5 మంత్ర కెరీర్‌ పాయింట్‌, హైదరాబాద్‌



Updated Date - 2022-05-30T17:34:44+05:30 IST