‘మన ఊరు-మన బడి’లో నీటిపారుదల శాఖ! 10 జిల్లాల్లో కార్యక్రమం అమలు బాధ్యతలు!
ABN , First Publish Date - 2022-02-23T18:14:18+05:30 IST
మన ఊరు-మన బడి’ కార్యక్రమం అమలులో నీటిపారుదల శాఖ కూడా చేరింది. భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లోని..

హైదరాబాద్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం అమలులో నీటిపారుదల శాఖ కూడా చేరింది. భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లోని 28 మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకాన్ని నీటిపారుదల శాఖ అమలు చేయనుంది. అదనపు తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర సౌకర్యాలతో పాటు డిజిటల్ క్లాస్‌రూమ్‌ల ఏర్పాటు వంటి పనులను ఈ పథకంలో భాగంగా చేపట్టనున్నారు. రూ.7,289 కోట్లతో రెండు దశల్లో చేపట్టే కార్యక్రమంలో తొలి దశలో 9,123 పాఠశాలల్లో రూ.3,497 కోట్లు వెచ్చించనున్నారు. నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఆయా మండలాల్లో ఈ పథకం అమలు బాధ్యతలు చూడనున్నారు. వీరికి ఈనెల 24న మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్‌లోని తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగే కార్యక్రమంలో మంత్రి సబిత తర్ఫీదు ఇవ్వనున్నారు. పథకం ఉద్దేశాన్ని వివరిస్తారు. ఆ తర్వాత ఆ శాఖ సిబ్బంది ప్రభుత్వ పాఠశాలల్లో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం అమలులో పాల్గొంటారు. అంతకుముందు 26,065 ప్రభుత్వ బడులను బాగుచేయడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిపాదించగా.. ఈ పథకం అమలు బాధ్యతలను నీటిపారుదల శాఖ స్వీకరించింది.