ఆ గదుల్లో పిల్లలను కూర్చోబెట్టొద్దు..

ABN , First Publish Date - 2022-07-18T19:51:02+05:30 IST

వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు ఇచ్చిన సెలవులు ముగిశాయి. నేడు పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వరుస వానల నేపథ్యంలో కొన్ని

ఆ గదుల్లో పిల్లలను కూర్చోబెట్టొద్దు..

ఉపాధ్యాయులకు విద్యాశాఖ హెచ్చరికలు

నేటి నుంచి పాఠ శాలలు పునఃప్రారంభం

తడిసిన, నిమ్ము పట్టిన భవనాలు


హైదరాబాద్‌ సిటీ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు ఇచ్చిన సెలవులు ముగిశాయి. నేడు పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వరుస వానల నేపథ్యంలో కొన్ని పాఠశాలల్లోని తరగతి గదుల పరిస్థితిపై తల్లిదండ్రులు, విద్యాశాఖాధికారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఈనెల 9 నుంచి మూతపడ్డాయి. రెండో శనివారం (9వ తేదీ), ఆదివారాల్లో విద్యార్థులకు సాధారణ సెలవులు వచ్చినప్పటికీ అంతకు ముందే వర్షాలు ప్రారంభం కావడంతో ఆదివారం వరకు స్కూళ్లు తెరుచుకోలేదు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సోమవారం నుంచి పాఠశాలలు యధావిధిగా తెరుచుకోనున్నాయి. 


నానిన తరగతి గదులు

నగర వ్యాప్తంగా వారం రోజులపాటు నిర్విరామంగా కురిసిన వర్షాలతో విద్యాసంస్థల్లోని తరగతి గదులు నానిపోయాయి. పలు చోట్ల నిమ్ముపట్టాయి. సాధారణంగా రెండు, మూడు రోజులపాటు వర్షాలు కురిస్తేనే ఇళ్లలోని గోడలు, స్లాబులు నిమ్ముపడుతుంటాయి. వారం రోజుల పాటు కురిసిన వర్షాలకు నాంపల్లి, ముషీరాబాద్‌, అంబర్‌పేట్‌, సికింద్రాబాద్‌, చార్మినార్‌ మండలాల్లోని దాదాపు 150కి పైగా ప్రభుత్వ పాఠశాలలు నిమ్ముపట్టినట్లు తెలిసింది. సికింద్రాబాద్‌, మారేడ్‌పల్లి, అమీర్‌పేట, బండ్లగూడ, ఖైరతాబాద్‌లోని పలు ప్రైవేట్‌ ప్రాథమిక పాఠశాలలు కూడా వర్షాలకు తడిసి ముద్దయ్యాయి. ఆదివారం వరకు కూడా తరగతి గదులు సాధారణ  స్థితికి రాకపోవడంతో అధికారులు హైరానా పడుతున్నారు. తడిసిన గదుల్లో విద్యార్థులను కూర్చో బెట్టవద్దని ప్రైవేట్‌ యాజమాన్యాలకు, సర్కారు బడుల ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిర్లక్ష్యం వహించవద్దని వెల్లడించారు. 

Updated Date - 2022-07-18T19:51:02+05:30 IST