అమ్మఒడి లబ్ధిదారుల్ని తగ్గించే కుట్ర

ABN , First Publish Date - 2022-06-07T21:11:43+05:30 IST

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు ఫెయిల్‌ కాలేదు. విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించి ప్రభుత్వం ఫెయిల్‌ అయ్యింది. అమ్మఒడిని వాయిదాలు వేసిన ప్రభుత్వం... పథకం లబ్ధిదారులను తగ్గించడం కోసం ఎక్కువ మందిని కావాలని ఫెయిల్‌ చేసిందనే..

అమ్మఒడి లబ్ధిదారుల్ని తగ్గించే కుట్ర

కావాలనే ఫెయిల్‌ చేశారనే అనుమానాలు

కష్టపడి చదివుంటే సీఎంకు కష్టాలు తెలిసేవి

పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల అస్తవ్యస్తం

నాడు-నేడులో 3,500 కోట్ల దోపిడీ: లోకేశ్‌


అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): ‘‘పదో తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు ఫెయిల్‌ కాలేదు. విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించి ప్రభుత్వం ఫెయిల్‌ అయ్యింది. అమ్మఒడిని వాయిదాలు వేసిన ప్రభుత్వం... పథకం లబ్ధిదారులను తగ్గించడం కోసం ఎక్కువ మందిని కావాలని ఫెయిల్‌ చేసిందనే అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం చేతకానితనం, మూర్ఖత్వం, విద్యార్థుల సంక్షేమ పథకాలు తగ్గించాలనే కుట్రకి లక్షలాది మంది విద్యార్థులు బలయ్యారు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. 20 ఏళ్లలో అతి తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదు కావడం, 71 పాఠశాలల్లో ఒక్కరూ ఉత్తీర్ణత సాధించలేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘సీఎం జగన్‌ కష్టపడి చదివి 10పాసై ఉంటే విద్యార్థుల కష్టాలు తెలిసేవి. పరీక్షల నిర్వహణ నుంచి, ఫలితాలు ప్రకటించడం వరకూ అంతా అస్తవ్యస్తంగా జరిగింది. చదువు చెపాల్సిన ఉపాధ్యాయుల్ని నాడు నేడు పనులకు కాపలా పెట్టడంతో వారు చదువు చెప్పడం మానేశారు. నాడు నేడు పథకంలో జగన్‌రెడ్డి రూ.3,500 కోట్లు దోపిడీ చేశారు. బెండపూడిలో ప్రసాద్‌ అనే ఉపాధ్యాయుడు పదేళ్లు కష్టపడి విద్యార్థులకు ఇంగ్లీష్‌ నేర్పిస్తే, జగన్‌ దాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు దారుణ ఫలితాలకు కూడా ఆయనే బాధ్యత తీసుకోవాలి. పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల్ని మద్యం షాపులకు కాపలా పెట్టడం దిగజారిన ఫలితాలకు ప్రధాన కారణం. పరీక్షల వేళ విపరీతమైన కరెంటు కోతలు, పరీక్షా సమయం కుదింపు, పేపర్‌ లీకులు, మాల్‌ ప్రాక్టీసులతో విద్యార్థులు మానసికంగా దెబ్బతిన్నారు. మీడియం గందరగోళం, ఎయిడెడ్‌ పాఠశాలల రద్దు, పరీక్షా పత్రాల తయారీలో లోపాలు... అన్నీ కలగలసి 20 ఏళ్లలో ఎన్నడూ రాని దారుణ ఫలితాలు వచ్చాయి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం ఫెయిల్‌ కావడమే’’ అని లోకేశ్‌ మండిపడ్డారు. 


ఫలితాలు ప్రభుత్వానికి సిగ్గుచేటు: జవహర్‌

తగ్గిపోయిన పదో తరగతి ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి సిగ్గుచేటని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ పేర్కొన్నారు. ‘‘వైసీపీ పాలనలో మొట్ట మొదటిసారి వచ్చిన పదో తరగతి ఫలితాలు కేవలం 67శాతం రావడం దురదృష్టకరం. ఈ ప్రభుత్వం విద్యారంగాన్ని గాలికి వదిలేసింది. నాణ్యమైన విద్యలో రాష్ట్రం మూడో స్థానం నుంచి 19వ స్థానానికి దిగజారింది’’ అని జవహర్‌ విమర్శించారు. 

Read more