షట్‌డౌన్‌.. మూతపడ్డ స్మార్ట్‌ క్లాస్‌ రూంలు

ABN , First Publish Date - 2022-09-17T17:02:39+05:30 IST

5జీ ప్రపంచంలో విద్యార్థులందరికీ స్మార్ట్‌ చదువు చెప్పిస్తామని ప్రభుత్వం అంటోంది. 15 ఏళ్లుగా కంప్యూటర్‌ విద్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇవేవీ సక్రమంగా ఆచరణలోకి రావడం లేదు. పాఠశాలల్లో కంప్యూటర్ల తెరపై బోధన ఆగిపోయి

షట్‌డౌన్‌.. మూతపడ్డ స్మార్ట్‌ క్లాస్‌ రూంలు

పాఠశాలల్లో అటకెక్కిన కంప్యూటర్‌ పరికరాలు

మూతపడ్డ స్మార్ట్‌ క్లాస్‌ రూంలు  

కరోనా తర్వాత కూడా అదే పరిస్థితి  

తిరిగి కొనసాగించాలని తల్లిదండ్రుల డిమాండ్‌


5జీ ప్రపంచంలో విద్యార్థులందరికీ  స్మార్ట్‌ చదువు చెప్పిస్తామని  ప్రభుత్వం అంటోంది. 15 ఏళ్లుగా  కంప్యూటర్‌ విద్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇవేవీ సక్రమంగా ఆచరణలోకి   రావడం లేదు. పాఠశాలల్లో కంప్యూటర్ల  తెరపై బోధన ఆగిపోయి చాలా కాలం అయింది.  కొన్ని పాఠశాలల్లో కంప్యూటర్‌ పరికరాలు అటకెక్కాయి. కరోనా సమయంలో మూతపడ్డ కంప్యూటర్లు ఇంకా తెరుచుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆధునిక విద్యా విధానంలో స్మార్ట్‌ క్లాస్‌ రూమ్‌ల ప్రాధాన్యత అందరికీ తెలిసిందే.   ప్రైవేట్‌ పాఠశాలల్లో  డిజిటల్‌ పాఠాలు నడుస్తున్నాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్‌నెట్‌ ఉండటం లేదు. కంప్యూటర్‌ పాఠాలు చెప్పడం లేదు. స్మార్ట్‌ క్లాస్‌లను ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.


నంద్యాల (నూనెపల్లె), సెప్టెంబరు: ప్రస్తుత పరిస్థితుల్లో కంప్యూటర్‌ విద్యకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. కానీ ప్రభుత్వ పాఠశాలు మాత్రం వీటికి దూరంగానే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ శిక్షణ విద్య ఎప్పుడో అటకెక్కింది. గత ప్రభుత్వ హయాంలో దాతల భాగస్వామ్యంతో స్మార్ట్‌ క్లాస్‌రూమ్స్‌ ద్వారా డిజిటల్‌, వర్చువల్‌ తరగతి గదులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారడంతో కంప్యూటర్‌ విద్య కాస్త మరుగున పడింది. నాడు - నేడు పేరుతో పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం, కీలకమైన ఈ అంశాన్ని విస్మరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


15 ఏళ్ల కిందటే కార్యాచరణ..

కంప్యూటర్‌ విద్యపై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు విద్యాశాఖ 15 ఏళ్ల కిందటే కార్యాచరణ చేపట్టింది. రెండు విడతలుగా దాదాపు అన్ని జిల్లా పరిషత్‌, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నిట్‌ సంస్థ సహకారంతో ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కో పాఠశాలకు పది కంప్యూటర్లు చొప్పున మంజూరు చేశారు. వారంలో మూడు నాలుగు రోజులు తరగతులు క్రమం తప్పకుండా నిర్వహించేవారు. ఇందుకోసం ప్రతి పాఠశాలలో కాంట్రాక్ట్‌ బేసిక్స్‌పై శిక్షణ ఇచ్చే వారిని కూడా నియమించారు. కంప్యూటర్‌ వినియోగం, వాటి వల్ల ఉపయోగాలు తదితర అంశాలపై విద్యార్థులకు కనీస అవగాహన కల్పించేవారు. 2013-2014 తరువాత వీటి ఊసే లేకుండా పోయింది. మూలకు చేరిన కంప్యూటర్లను ఉమ్మడి జిల్లాలోని 624 ఉన్నత పాఠశాలల నుంచి విద్యాశాఖ తరలించింది. అప్పటి నుంచి సర్కారు బడుల్లో కంప్యూటర్‌ తరగతుల నిర్వహణనే లేకుండా పోయింది.


‘స్మార్ట్‌’గా మూతపడ్డాయి

కేవలం పుస్తకాలు చదవడం, ఉపాధ్యాయుల బోధన వల్ల పాఠ్యంశాలు అర్థం కావడం లేదనే భావనతో గత ప్రభుత్వ హయాంలో ఉన్నత పాఠశాలల్లో స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌ ఏర్పాటు ప్రక్రియకు బీజం పడింది. ఇందులో భాగంగానే 2014లో డీసీఆర్‌ (డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌), 2018లో వీసీఆర్‌ (వర్చువల్‌ క్లాస్‌రూమ్‌)తెరపైకి వచ్చాయి. 60శాతం ప్రభుత్వం, 35 శాతం దాతల భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కూడా వాటి ఏర్పాటులో కీలకపాత్ర వహించింది. ప్రతి పాఠశాలలో ప్రత్యేక గదిని, అధునాతన తెర (స్కీన్‌), ప్రొజెక్టర్‌తో తీర్చిదిద్ది రోజూ మూడు గంటలకు పైగా పాఠాలు బోధించేలా ప్రణాళిక రూపొందించారు. దీనికి అవసరమైన బోధన అంశాలను విద్యాశాఖ అందజేసింది. జిల్లా స్థాయి సిలబస్‌ రూపొందించి ఆ ప్రకారం దృశ్య, శ్రవణ విద్యతో పాఠాలు బోధించేవారు. 2019 తరువాత ఇవన్నీ మూలకు చేరాయి. దీంతో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్‌ తరగతి గదులు మాయమయ్యాయి. చాలా చోట్ల వీటిని సాధారణ సిబ్బంది గదులుగా మార్చేశారు.


అన్ని సర్దేశారు..

డీసీఆర్‌, వీసీఆర్‌ల ఏర్పాటు తరువాత దశల వారిగా అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే ఏపీ పైబర్‌ నెట్‌ ద్వారా కనెక్షన్లు ఇచ్చేలా సన్నాహాలు చేపట్టారు. జిల్లాలో పైబర్‌ నెట్‌ అందుబాటులో ఉన్న చోట అప్పట్లో కొన్ని పాఠశాలలకు కనెక్షన్లు ఇవ్వడానికి వీలుగా వైర్లను కూడా లాగారు. 2019లో ప్రభుత్వం మారిన తరువాత ఈ అంశంపై అంతగా దృష్టి సారించకపోవడంతో ఇవన్నీ మూల నపడ్డాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఆన్‌ లైన్‌ తరగతులు దూరమయ్యాయి. నాలుగేళ్లుగా వాడుకలో లేకపోవడంతో చాలా చోట్ల డీసీఆర్‌, వీసీఆర్‌లకు సంబంధించిన పరికరాలు, సామగ్రి అటకెక్కాయి. తిరిగి వీటిని ఉప యోగంలోకి తీసుకురావడం కూడా కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


అవగాహన ఏదీ...?

ప్రపంచమంతా 5జీ దిశగా పరుగులు పెడుతుంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కంప్యూటర్‌పై కనీస అవగాహన ఉండటం లేదనే   విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కాలంలో ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు ఎంచక్కా ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవగా, ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులకు మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యపై ప్రాథమిక అవగాహన కల్పించకపోతే ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నాడు - నేడు ద్వారా పాఠశాలల బాగు చేస్తున్న ప్రభుత్వం డిజిటల్‌, వర్చువల్‌ తరగతులను కూడా పునఃప్రారంభించాలన్న డిమాండ్‌ వినబడుతోంది.

Read more