జూలై 20న కామన్‌ పీజీ ఎంట్రన్స్‌ టెస్ట్‌

ABN , First Publish Date - 2022-06-07T21:31:55+05:30 IST

రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు అందిస్తున్న పీజీ, ఇంటెగ్రేటెజ్‌ పీజీ సీట్ల భర్తీ కోసం జూలై 20న కామన్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీపీజీఈటీ) జరగనుంది. దీనికి జూలై 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు...

జూలై 20న కామన్‌ పీజీ ఎంట్రన్స్‌ టెస్ట్‌

జూలై 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

అందుబాటులో 44వేలకు పైగా సీట్లు


హైదరాబాద్‌/తార్నాక, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు అందిస్తున్న పీజీ, ఇంటెగ్రేటెజ్‌ పీజీ సీట్ల భర్తీ కోసం జూలై 20న కామన్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీపీజీఈటీ) జరగనుంది. దీనికి జూలై 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.500 లేట్‌ ఫీజుతో జూలై 11 వరకు, రూ.2వేల లేట్‌ ఫీజుతో జూలై 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది నుంచి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పీజీ సీట్ల భర్తీ కోసం కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి సోమవారం సీపీజీఈటీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ పరీక్షను కంప్యూటర్‌ ఆధారిత టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తామని ప్రొఫెసర్‌ లింబాద్రి చెప్పారు. నేషనల్‌ ఇంటెగ్రేషన్‌ కోటా కింద ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 20% పీజీ సీట్లను కేటాయిస్తామని వెల్లడించారు. గతేడాది పీజీ కోర్సుల్లో అడ్మిషన్‌ పొందినవారిలో 71% మంది అమ్మాయిలు ఉన్నారని ప్రొఫెసర్‌ లింబాద్రి వివరించారు.


ఎంఏ ఇంగ్లీషు, తెలుగు, సోషల్‌ సైన్సెస్‌ కోర్సులకు డిగ్రీ విద్యార్థులంతా అర్హులేనని చెప్పారు. యూనివర్సిటీల వారీగా వేర్వేరు ఫీజులుంటాయన్నారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్‌టీయూ, మహిళా యూనివర్సిటీల్లోని పీజీ సీట్ల ను భర్తీ చేస్తారు. ఐదేళ్ల ఇంటెగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో సీట్లను కూడా ఈ పరీక్ష ద్వారానే భర్తీ చేస్తారు. గతేడాది అన్ని యూనివర్సిటీల్లో కలిపి 40 వేల సీట్లు ఉండగా, అందులో 22,812 సీట్లు మాత్రమే నిండాయి. ఈ ఏడాది 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. యూనివర్సిటీల పరిధిలోని 320 కాలేజీల్లో సుమారు 50 కోర్సులున్నాయి. ఆయా కాలేజీ ల్లో కొత్త కోర్సులను ప్రవేశపెడితే మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇన్‌చార్జ్‌ వైస్‌ చాన్సలర్‌ సీతారామారావు, సీపీజీఈటీ కన్వీనర్‌ పాండురంగారెడ్డి, మండలి వైస్‌ చైర్మన్‌ వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Read more