జగనన్నా.. ఇటు చూడన్నా!

ABN , First Publish Date - 2022-10-14T21:44:48+05:30 IST

వానొస్తే సెలవు ఇచ్చే పాఠశాలను ఎక్కడైనా చూశారా?.. ఇరగాయి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలకు ఆ విచిత్ర పరిస్థితి ఉంది. ఈ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో ఓ ఇంటి వరండాలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఎండొస్తే సరేసరి..

జగనన్నా.. ఇటు చూడన్నా!

ఇంటి వరండాలోనే తరగతులు

వానొస్తే విద్యార్థులకు సెలవు

ఇదీ ఇరగాయి ఎంపీపీ పాఠశాల దుస్థితి

నాడు- నేడు కింద రెండు సార్లు ప్రతిపాదనలు 

వెళ్లినా ఆమోదం కరువు

గిరిజన బాలల భవిష్యత్తు అంధకారమవుతోందని గ్రామస్థుల ఆవేదన


వానొస్తే సెలవు ఇచ్చే పాఠశాలను ఎక్కడైనా చూశారా?.. ఇరగాయి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలకు ఆ విచిత్ర పరిస్థితి ఉంది. ఈ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో ఓ ఇంటి వరండాలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఎండొస్తే సరేసరి.. వానొస్తే మాత్రం తరగతులు జరగవు. నాడు- నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తున్నామని గొప్పలు చెబుతున్న వైసీపీ ప్రభుత్వం ఈ పాఠశాలను పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


అరకురూరల్‌, అక్టోబరు 13: ఇరగాయి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరడంతో ఏడాది నుంచి సమీపంలోని ఓ ఇంటి వరండాలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో సుమారు 20 మంది విద్యార్థులు చదువుతున్నారు. అన్ని తరగతులకు ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నారు. అరకులోయ పట్టణం నుంచి సుమారు 22 కిలో మీటర్ల దూరంలో ఉరగాయి గ్రామం ఉండడంతో అధికారుల పర్యవేక్షణ ఉండదు. ఈ పాఠశాల భవనాన్ని పునర్నిర్మించాలని గ్రామస్థులు గతంలో ఆందోళనలు కూడా చేశారు. నాడు- నేడు కింద అభివృద్ధి చేయాలని రెండు సార్లు ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. తాజాగా బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఈ పాఠశాల పరిస్థితిని అధికారుల దృష్టికి సర్పంచ్‌ మాదల బుటికి తీసుకువెళ్లారు. నాడు- నేడు కింద ప్రతిపాదనలు పెట్టామని ఎంఈవో చెప్పారు గానీ నిధులు మంజూరు అవుతాయో లేదో ప్రశ్నార్థకమే. విద్యాశాఖాధికారులు పట్టించుకోకపోవడంతో గిరిజన బాలల భవిష్యత్తు అంధకారమవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల భవనాన్ని పునర్నిర్మించి సక్రమంగా తరగతులు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Read more