ఎట్టకేలకు బాసర విద్యార్థుల ఆందోళన విరమణ

ABN , First Publish Date - 2022-08-01T17:15:36+05:30 IST

ఆహార నాణ్యత బాగోలేదంటూ.. బాసర ట్రిపుల్‌ ఐటీలో శనివారం రాత్రి భోజనాన్ని బహిష్కరించి విద్యార్థులు ప్రారంభించిన ఆందోళన

ఎట్టకేలకు బాసర విద్యార్థుల ఆందోళన విరమణ

ఆహార నాణ్యతపై రోజంతా ఆందోళన.. నచ్చజెప్పిన అధికారులు

ఎట్టకేలకు రాత్రి 11 గంటల సమయంలో నిరసన విరమణ

విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తున్న ఎంపీ సోయం అడ్డగింత

హైదరాబాద్‌లో మంత్రి సబిత ఇంటిని ముట్టడించిన తల్లిదండ్రులు

అరెస్టు చేసి బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలింపు


బంజారాహిల్స్‌, బాసర/లోకేశ్వరం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఆహార నాణ్యత బాగోలేదంటూ.. బాసర ట్రిపుల్‌ ఐటీ(Basara Triple IT)లో శనివారం రాత్రి భోజనాన్ని బహిష్కరించి విద్యార్థులు(students) ప్రారంభించిన ఆందోళన ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ముగిసింది. ఆదివారం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాన్ని కూడా విద్యార్థులు బహిష్కరించారు. పలుమార్లు అధ్యాపకులు, ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. వెనక్కి తగ్గలేదు. మెస్‌ డైనింగ్‌ హాల్‌లోనే బైఠాయించారు. దీంతో.. తోటి విద్యార్థులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించినా, ఆందోళనలు చేసినా ఊరుకోబోమని వెంకటరమణ హెచ్చరించారు. ఇప్పటి వరకు విద్యార్థుల విషయంలో ఓపికతో ఉన్నామని.. ఇకపై ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు.


తొలుత షోకాజు నోటీసు జారీ చేస్తామని, ఆ తర్వాత సస్పెండ్‌ చేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల డిమాండ్‌ మేరకు ఇప్పటికే అకాడమిక్‌, పరిపాలన, స్పోర్ట్స్‌, టెండర్స్‌ ఇలా ప్రతివిభాగంలో కమిటీలను నియమించామని గుర్తుచేశారు. మూడు మెస్సుల స్థానాల్లో కొత్త కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పజెప్పేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. కొద్ది రోజుల్లోనే విద్యార్థుల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని చెప్పారు. సమావేశంలో డైరెక్టర్‌ సతీశ్‌కుమార్‌ పాల్గొన్నారు. అయితే.. ఇన్‌చార్జ్‌ వీసీ హెచ్చరికపై విద్యార్థులు మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో అంతా కలిసి వీసీ కార్యాలయం వద్దకు చేరుకొని.. ఆందోళనను కొనసాగించారు. తమ డిమాండ్లు నెరవేరేదాకా ఆందోళన కొనసాగుతుందని పేర్కొంటూ ఒక వీడియో విడుదల చేశారు. ప్రాథమిక అవసరమైన ఆహారాన్ని పట్టించుకోకుంటే ఎలా అని నిలదీశారు. మూడు మెస్‌ల కాంట్రాక్టర్లను తొలగించాల్సిందేనని భీష్మించుకు కూర్చున్నారు. అధికారులు చర్చలకు పిలిచినా ఎవరూ వెళ్లలేదు. అధికారులే వచ్చి తమ సమస్యలు వినాలని పట్టుబట్టారు. ఇరువర్గాలూ పట్టుదలగా వ్యవహరించడంతో ఆదివారం రాత్రి దాకా ఆందోళన కొనసాగింది. చివరకు.. కొంత మంది విద్యార్థులే పట్టు వీడి అధికారుల వద్దకు వెళ్లి చర్చించారు. అధికారులు వారితో పలు అంశాలపై చర్చించి, వారికి నచ్చజెప్పడంతో రాత్రి 11 గంటల సమయంలో విద్యార్థులు ఆందోళన విరమించి హాస్టల్‌ గదులకు వెళ్లిపోయారు.


మంత్రి ఇంటి ఎదుట..

బాసర ట్రిపుల్‌ఐటీ ఆందోళన హైదరాబాద్‌నూ తాకింది. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ వారి తల్లిదండ్రులు శ్రీనగర్‌కాలనీలోని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి(Education Minister Sabitha Reddy) ఇంటిని ముట్టడించారు. విద్యార్థుల సమస్యల శాశ్వత పరిష్కారం విషయంలో మంత్రి కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇటీవల మంత్రి విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థుల తల్లిదండ్రులను అరెస్టు చేసి, బంజారాహిల్స్‌ ఠాణాకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎన్‌ఎస్‌యూఐ నేత బల్మూరి వెంకట్‌, కార్యకర్తలు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని, విద్యార్థుల తల్లిదండ్రులకు తమ మద్దతు ప్రకటించారు.
ఎంపీ సోయం బాపురావు అడ్డగింత

బాసర ట్రిపుల్‌ ఐటీని సందర్శించేందుకు వెళ్తున్న ఎంపీ సోయం బాపురావు(MP Soyam Bapurao), బీజేపీ నేతలను లోకేశ్వరం ఎస్సై సాయికుమార్‌, సిబ్బంది మన్మద్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద అడ్డుకున్నారు. వారిని నిర్మల్‌కు తిప్పిపంపారు.


పోలీస్‌ క్యాంపుగా ట్రిపుల్‌ ఐటీ: నారాయణ

న్యూఢిల్లీ, జూలై 31(ఆంధ్రజ్యోతి): బాసర ట్రిపుల్‌ ఐటీని పోలీస్‌ క్యాంపుగా మార్చారని, అక్కడ నిర్బంధ కాండ జరుగుతోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ట్రిపుల్‌ ఐటీలో చదువుతున్న 6వేల మంది విద్యార్థులు సమ్మెలో ఉన్నారని తెలిపారు. విద్యార్థులను కలవడానికి తల్లిదండ్రులను కూడా అనుమతించడం లేదన్నారు. తాను 2సార్లు వెళ్లినా పర్మిషన్‌ ఇవ్వలేదన్నారు. ఇంత నిర్బంధం ఎందుకని ప్రశ్నించారు. ట్రిపుల్‌ ఐటీలో మెస్‌ను ప్రైవేట్‌ కాంట్రాక్టర్లకు అప్పగించారని, ఆ కాంట్రాక్టులో స్థానిక ఎమ్మెల్యే, మంత్రికి వాటాలు ఉన్నాయని ఆరోపించారు.Read more