‘రీయింబర్స్‌’ నిధులను విడుదల చేయండి.. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ లేఖ

ABN , First Publish Date - 2022-06-07T21:51:01+05:30 IST

పేద విద్యార్థులకు సంబంధించిన రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని, ఇంజనీరింగ్‌లో చేరే బీసీ విద్యార్థులకు ర్యాంకు నిబంధన ఎత్తివేయాలని సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విజ్ఞప్తి..

‘రీయింబర్స్‌’ నిధులను విడుదల చేయండి.. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ లేఖ

హైదరాబాద్‌, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): పేద విద్యార్థులకు సంబంధించిన రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని, ఇంజనీరింగ్‌లో చేరే బీసీ విద్యార్థులకు ర్యాంకు నిబంధన ఎత్తివేయాలని సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు. మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను ఈ నెలాఖరులోపు విడుదల చేయకుంటే బీజేపీ తెలంగాణ శాఖ గాంధేయ పద్ధతిలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ సోమవారం లేఖ రాశారు. ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులకు రెండేళ్లుగా రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను విడుదల చేయకపోవడంతో 14 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఆర్భాటపు ప్రచారం కోసం దేశవ్యాప్తంగా వివిధ పత్రికలు, మీడియాలో ప్రకటనలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందనడానికి ఇదే నిదర్శనమన్నారు.

Read more