హాస్టళ్లలో చావుకేకలు! గతేడాది నుంచి 100 మంది మృతి!

ABN , First Publish Date - 2022-09-27T17:12:17+05:30 IST

క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేదు. మౌలిక వసతుల కల్పనలో కింది స్థాయి అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. విద్యార్థుల బాగోగులు, భోజనం, ఆరోగ్యం గురించి పట్టించుకునేవారు లేరు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తాగునీరు, మరుగుదొడ్లు తదితర సమస్యలను తీర్చేవారు..

హాస్టళ్లలో చావుకేకలు! గతేడాది నుంచి 100 మంది మృతి!

అధ్వానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు

గతేడాది నుంచి దాదాపు 100 మంది మృతి

వసతులు, నిర్వహణపై అంతులేని నిర్లక్ష్యం 

అనారోగ్య కేంద్రాలుగా మారుతున్న దుస్థితి

జ్వరాలు, ఇతర సమస్యలతో విద్యార్థుల మృతి

పలుచోట్ల పాముకాట్లు, ప్రమాదాలకు బలి

బలవన్మరణాలకూ పాల్పడుతున్న వైనం

చాలీచాలని నిధులు.. కొరవడిన పర్యవేక్షణ

మూడేళ్లుగా ఇన్‌చార్జ్‌ అధికారులే దిక్కు 


(అమరావతి-ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేదు. మౌలిక వసతుల కల్పనలో కింది స్థాయి అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. విద్యార్థుల బాగోగులు, భోజనం, ఆరోగ్యం గురించి పట్టించుకునేవారు లేరు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తాగునీరు, మరుగుదొడ్లు తదితర సమస్యలను తీర్చేవారు లేరు. దీంతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు(SC, ST, BC Welfare Hostels), గురుకులాలు అధ్వానంగా తయారయ్యాయి. గతేడాది నుంచి దాదాపు 100 మంది పేద విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ప్రతివారం ఎక్కడో ఒక చోట ఏదో ఒక కారణంతో చనిపోతున్నారు. ఆరోగ్యం బాగా లేకనో, ప్రమాదం కారణంగానో మరణిస్తున్నారు. కొన్ని చోట్ల పాముకాట్లకు బలవుతున్నారు. మరికొన్ని చోట్ల నదులు, వాగులు, కుంటల్లో ఈతకు వెళ్లి మరణిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల సిబ్బంది వేధింపులు, మానసిక సమస్యలు, తదితర కారణాలతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద విద్యార్థుల ఉన్నతికి దోహదపడాల్సిన సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో చావుకేకలు వినిపిస్తున్నాయి. చాలీచాలని నిధులు, మరోవైపు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో సమస్యలతో సతమతమవుతున్నాయి. 


అనారోగ్య కేంద్రాలుగా... 

పలు గురుకులా(Gurukulas)ల్లో విద్యార్థులకు తాగునీరు సరిగా అందడం లేదు. హాస్టళ్లలో అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవు. ఉన్నవి కూడా నిర్వహణ సరిగా లేకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయి. కొన్ని చోట్ల బాలికల వసతి గృహాల్లో తలుపుల్లేని మరుగుదొడ్లు, తిరగని ఫ్యాన్లు దర్శనమిస్తున్నాయి. బాపట్ల జిల్లాలోని పరుచూరు గిరిజన గురుకుల విద్యార్థులు కాలువలో నీటిని తెచ్చుకుని తాగాల్సి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా హాస్టళ్లు అనారోగ్య కేంద్రాలుగా మారాయి. దీంతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. డెంగ్యూ, విషజ్వరాలతో హాస్టళ్లలోనే వారికి నిండు నూరేళ్లు నిండుతున్నాయి. విద్యార్థుల ఆరోగ్యం విషమించినా పట్టించుకునేవారు లేరు. 


పాముకాట్లు, ప్రమాదాలు... 

హాస్టళ్ల నిర్వహణ లోపం కారణంగా విద్యార్థులు పాముకాట్లు, ప్రమాదాలతో మరణిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 4న పార్వతీపురం మన్యం జిల్లా కొరపాం మండల కేంద్రంలో బీసీ గురుకుల పాఠశాల విద్యార్థి పాము కాటుతో చనిపోయాడు. ఇటీవల వైఎ్‌సఆర్‌ జిల్లాలో బ్రహ్మసాగర్‌ అంబేడ్కర్‌ గురుకులంలో చదివే ఇంటర్‌ విద్యార్థులు ఈత కోసం బ్రహ్మసాగర్‌కు వెళ్లి దుర్మరణం చెందారు. ఇక హాస్టళ్లలో భోజనం సరిగా ఉండటం లేదని ఫిర్యాదు చేసిన విద్యార్థులపై సిబ్బంది వేధింపులకు పాల్పడుతుండటంతో విద్యార్థులు ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చిత్తూరు నగరంలో ఓ గిరిజన గురుకులంలో వార్డెన్లు, టీచర్లు వేధించడంతో ఓ విద్యార్థిని నెయిల్‌ పాలిష్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం కోడెకండ్ల గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని ఏప్రిల్‌ 23న ఆత్మహత్యకు పాల్పడింది. ధర్మవరం ఎస్సీ బాలిక కళాశాల హాస్టల్‌లో ఉండే ఈ విద్యార్థిని ప్రేమ వ్యవహారం కారణంగా అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. మానసిక సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చే వ్యవస్థ సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో లేకపోవడంతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.


రెగ్యులర్‌ అధికారులేరీ..? 

మూడేళ్లుగా రాష్ట్ర స్థాయులో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల సొసైటీలకు రెగ్యులర్‌ కార్యదర్శులు లేరు. దీంతో సంక్షేమ గురుకులాల్లో పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉందనే విమర్శలున్నాయి. ఎస్సీ గురుకులాల్లో సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శులను, కొంతకాలం ఆ శాఖ డైరెక్టర్‌ను ఇన్‌చార్జ్‌ సెక్రటరీలుగా నియమించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో రోజు రోజుకూ గురుకులాల పరిస్థితి అధ్వానంగా తయారైంది. వచ్చిన అధికారి తాత్కాలికంగా తమ విధులు మమ అనిపించడం తప్ప పేద విద్యార్థుల బాగోగులు పట్టించుకోలేదు. ఐఏఎస్‌ అధికారులను నియమించాల్సిన ఈ పోస్టుల్లో జాయింట్‌ సెక్రటరీ స్థాయి అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తున్నారు. ఎస్టీ గురుకుల సొసైటీదీ అదే పరిస్థితి. ఎస్టీ గురుకుల సొసైటీ కార్యాలయంలో జాయింట్‌ సెక్రటరీ స్థాయి పోస్టుల్లో గిరిజన సంక్షేమ శాఖ నుంచి అధికారులను నియమిస్తున్నారు. అదే పరిస్థితి బీసీ గురుకులాల్లోనూ ఏర్పడింది. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలకు సంబంధించి ఏ అధికారి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదు. ఇన్‌చార్జ్‌లు కావడంతో మనకు ఎందుకులే అన్న ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. 


మెనూపై ఆర్భాటమే..

ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో హాస్టళ్లు, గురుకులాల్లో మెనూ సక్రమంగా అమలు కావడం లేదంటున్నారు. ప్రభుత్వం ఆర్భాటంగా మెనూ ప్రకటించినా బడ్జెట్‌ మాత్రం తగ్గించిందని చెబుతున్నారు. దీంతో విద్యార్థులకు చూసుకుని వడ్డించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఓ వైపు ధరలు పెరగడం, ఆ మేరకు బడ్జెట్‌ లేకపోవడంతో సంస్కరణలు అమలు చేయలేని స్థితిలో ప్రిన్సిపాళ్లు ఉన్నారు. 


పురోగతి లేని గిరిజన గురుకులాలు 

రాష్ట్రంలో గిరిజన విద్యార్థుల హాస్టళ్ల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. 2016లో గిరిజన హాస్టళ్లను గురుకులాలుగా మార్చిన తర్వాత వాటి అభివృద్ధిలో ఎలాంటి పురోగతి లేదని చెబుతున్నారు. మైదాన ప్రాంతంలోని 81 గురుకులాల పరిస్థితి అధ్వానంగా తయారైందని, అక్కడ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో నియమించిన ప్రిన్సిపాల్‌ పోస్టు తప్ప ఒక్క పోస్టును కూడా రెగ్యులర్‌ విధానంలో భర్తీ చేయకపోవడంతో నాణ్యమైన విద్య అందించలేకపోతున్నామని స్వయంగా ప్రిన్సిపాళ్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పట్లో ఒక్కో గురుకులానికి ఒక ప్రిన్సిపాల్‌, 8 మంది బోధనా సిబ్బంది పోస్టులు మంజూరు చేశారు. అయితే ప్రిన్సిపాల్‌ మినహా ఇతర పోస్టుల్లో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. ఈ గురుకులాలు ప్రారంభించి ఐదేళ్లు కావడంతో ఈ ఏడాది నుంచి పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారు. పోస్టుల సంఖ్య 16కు పెంచాల్సి ఉన్నప్పటికీ పట్టించుకునేవారే లేరని వాపోతున్నారు. 


ఒకే జిల్లాలో ముగ్గురు మృతి

  • ఇటీవల చిత్తూరులో ఎస్సీ గురుకులంలో 8వ తరగతి విద్యార్థినిని కడుపునొప్పి వచ్చిందని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించింది. 
  • ఈ ఏడాది మార్చిలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా మాణికవలస గిరిజన గురుకుల పాఠశాల 8వ తరగతి విద్యార్థి జ్వరంతో మరణించాడు. 
  • జూలైలో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం కొత్త భల్లూగూడ ఆశమ్ర స్కూల్లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని అనారోగ్యంతో మరణించింది. 
  • గత ఏడాది నవంబరు 10న పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పెద్దకేజీల గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థి డెంగ్యూతో మరణించాడు. 
  • గత ఏడాది జనవరిలో పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కేడీ కాలనీ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని అనారోగ్యంతో మృతిచెందింది. 
  • ఈ ఏడాది పార్వతీపురం మన్యం జిల్లాలోనే గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గిరిజన ఆశ్రమ పాఠశాల 5వ తరగతి విద్యార్థిని జ్వరంతో మరణించింది.

Updated Date - 2022-09-27T17:12:17+05:30 IST