బీ కేటగిరీ సీట్లకు నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2022-09-29T19:31:19+05:30 IST

ఇంజనీరింగ్‌ కోర్సుల్లో మేనేజ్‌మెంట్‌ కోటా(Management quota in engineering courses) (బి-కేటగిరీ) సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. అయితే కన్వీనర్‌ కోటా సీట్లను పూర్తి స్థాయిలో భర్తీ చేయకముందే..

బీ కేటగిరీ సీట్లకు నోటిఫికేషన్‌

కన్వీనర్‌ సీట్లు ఉండగానే మేనేజ్‌మెంట్‌ కోటా భర్తీకి అనుమతి

ఇంకా పూర్తికాని ఇంజనీరింగ్‌ రెండో దశ కౌన్సెలింగ్‌

ఫీజులపై నిర్ణయం కూడా పెండింగ్‌లోనే.. 


హైదరాబాద్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ కోర్సుల్లో మేనేజ్‌మెంట్‌ కోటా(Management quota in engineering courses) (బి-కేటగిరీ) సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. అయితే కన్వీనర్‌ కోటా సీట్లను పూర్తి స్థాయిలో భర్తీ చేయకముందే.. బి-కేటగిరీ సీట్ల భర్తీకి అనుమతించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నోటిఫికేషన్‌ ద్వారా సీట్లను అమ్ముకోవడానికి కాలేజీలకు పరోక్షంగా అధికారులు ఆమోదం తెలిపారంటూ విమర్శలు వస్తున్నాయి. బి-కేటగిరీ సీట్లను అక్టోబరు 25వ తేదీలోపు భర్తీ చేసుకోవచ్చని పేర్కొంటూ ఉన్నత విద్యా మండలి మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆయా కాలేజీల వారీగానే ఈ సీట్లను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించి.. జేఈఈ మెయిన్‌, ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగా సీట్లను భర్తీ చేయాలని నోటిఫికేషన్‌లో సూచించారు. ఈ సీట్లకు కామన్‌ షెడ్యూల్‌ వర్తించదు. మండలి నిర్ణయించిన గడువులోపు ఎప్పుడైనా కాలేజీలు భర్తీ చేసుకోవచ్చు. దీని కోసం ఆయా కాలేజీలు వేర్వేరుగా ప్రత్యేక షెడ్యూల్‌ను ప్రకటించనున్నాయి. ఒక్కో కాలేజీ ఒక్కో సమయంలో ఈ సీట్లను భర్తీ చేసుకునే అవకాశం ఉంది. కాగా.. రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కన్వీనర్‌ కోటా సీట్లను ఇంకా పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదు.


మొదటి దశ కౌన్సెలింగ్‌ మాత్రమే పూర్తయింది. ఫీజుల అంశం తేలకపోవటంతో రెండో దశ కౌన్సెలింగ్‌ వాయిదాపడింది. దీన్ని వచ్చే నెల 11వ తేదీ నుంచి చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. రెండో దశ కన్వీనర్‌ కోటా సీట్ల కేటాయింపులను అక్టోబరు 16న ప్రకటించనున్నారు. అయితే.. మేనేజ్‌మెంట్‌ సీట్ల భర్తీకి గడువు సాంకేతికంగా అక్టోబరు 25వ తేదీ వరకు ఉన్నప్పటికీ, ఆలోపే చాలా కాలేజీలు సీట్లను భర్తీ చేసుకునే అవకాశం ఉంది. బి-క్యాటగిరీ సీట్ల భర్తీకి గడువును నిర్దేశించారు తప్ప.. ప్రారంభం ఎప్పటి నుంచి అనే  విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. దాంతో అనేక కాలేజీలు అక్టోబరు మొదటి వారంలోనే మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను భర్తీ చేసుకోవాలని భావిస్తున్నాయి. ఇలా చేస్తే మెరిట్‌ విద్యార్థులకు నష్టం జరగొచ్చన్న ఆందోళన  వ్యక్తమవుతోంది. సాధారణంగా అభ్యర్థులు సీటు కోసం రెండో దశ కౌన్సెలింగ్‌ వరకు వేచిచూస్తారు.


అప్పటికీ కన్వీనర్‌ కోటా సీటు లభించకపోతే... మేనేజ్‌మెంట్‌ సీటు కోసం ప్రయత్నిస్తారు. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో రెండో దశ కౌన్సెలింగ్‌ నాటికే రాష్ట్రంలోని అనేక కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ సీట్లు భర్తీ కానున్నాయి. తమ ర్యాంకుకు కన్వీనర్‌ కోటాలో సీటు రాదనే స్పష్టత ఉన్న అభ్యర్థులు మేనేజ్‌మెంట్‌ సీట్ల కోసం ముందుగానే పోటీపడతారు. అయితే... ఎంసెట్‌లో కొంత మెరుగైన స్కోర్‌ సాధించి, మొదటి దశలో సరైన సీటు రాని అభ్యర్థులు రెండు, మూడో దశల కౌన్సెలింగ్‌ కోసం ఎదురుచూస్తారు. అప్పటికీ సీటు రాకపోతే... మేనేజ్‌మెంట్‌ కోటా సీటు కోసం ప్రయత్నిస్తారు. అయితే.. విద్యార్థులకు అలాంటి అవకాశం లేకుండా ప్రస్తుతం మేనేజ్‌మెంట్‌ సీట్లను భర్తీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కన్వీనర్‌ కోటా రెండో దశ సీట్ల భర్తీ తర్వాత మేనేజ్‌మెంట్‌ కోటా భర్తీకి షెడ్యూల్‌ను జారీ చేస్తే... మెరిట్‌ అభ్యర్థులకు మేలు జరిగేదన్న అభిప్రాయం ఉంది. కానీ అధికారుల తాజా నిర్ణయంతో ఇంజనీరింగ్‌ కాలేజీలు బి-క్యాటగిరీ సీట్లను భారీ ఫీజులకు అమ్ముకునే అవకాశం ఉందని విమర్శలు వస్తున్నాయి.


ఫీజులపై ఇంకా రాని స్పష్టత

మరోవైపు ఇంజనీరింగ్‌ ఫీజులను ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. దాంతో మేనేజ్‌మెంట్‌ సీట్లకు ఎంత ఫీజును వసూలు చేస్తారనే అంశంపై కూడా స్పష్టత లేదు. కన్వీనర్‌ కోటాలో అయితే ఎంత ఫీజు చెల్లించాలనే విషయాన్ని ఎంసెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా అభ్యర్థికి తెలియజేస్తారు. పైగా అభ్యర్థి చెల్లించే ఫీజు కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రభుత్వం వద్దే ఉంటుంది. అదే మేనేజ్‌మెంట్‌ కోటా సీటు అయితే... ఆయా కాలేజీలకే ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం కన్వీనర్‌ కోటా ఫీజు మేనేజ్‌మెంట్‌ కోటా సీటుకు కూడా వర్తిస్తుంది. కానీ అనేక కాలేజీలు ఈ నిబంధనను పాటించడం లేదు. అభ్యర్థుల నుంచి ముందుగానే అధికమొత్తంలో ఫీజులు వసూలు చేసి సీటును కేటాయిస్తున్నారు. రికార్డుల్లో మాత్రం తక్కువ ఫీజును చూపిస్తున్నారు. ప్రభుత్వం ఇంకా ఫీజులను ఖరారు చేయకపోవటంతో... మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు ఏ మేరకు ఫీజులు వసూలు చేస్తారనే అంశంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Read more