గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగుల కేటాయింపు

ABN , First Publish Date - 2022-02-19T17:42:05+05:30 IST

గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ మొదలైంది. జీవో 317 ప్రకారం ఇప్పటికే అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తి అయిన విషయం తెలిసిందే. అయితే, గురుకులాలకు సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు..

గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగుల కేటాయింపు

 జీవో 317 ప్రకారమే కొనసాగిస్తున్న అధికారులు

 వచ్చేనెల రెండో వారంలోగా సీనియారిటీ జాబితా 


హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ మొదలైంది. జీవో 317 ప్రకారం ఇప్పటికే అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తి అయిన విషయం తెలిసిందే. అయితే, గురుకులాలకు సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు లేకపోవడంతో ఇక్కడ ఇప్పటి వరకు ఉద్యోగుల కేటాయింపు చేపట్టలేదు. మిగతా ప్రభుత్వ విభాగాల మాదిరిగా జీవో 317 ప్రకారమే గురుకుల విద్యాసంస్థలకు సిబ్బందిని కేటాయించాలని ప్రభుత్వం నుంచి సొసైటీ కార్యదర్శులకు ఇటీవలే ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ప్రాథమిక సీనియారిటీ జాబితాను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకున్న తర్వాత తుది జాబితా అనుగుణంగా కేటాయింపులు చేస్తారు.


గురుకుల సొసైటీల్లో అధికంగా జోనల్‌, మల్టీ జోనల్‌ పోస్టులే ఉన్నాయి. జిల్లా పోస్టులు పెద్దగా లేవు. మార్చి రెండో వారంలోగా ప్రాథమిక సీనియారిటీ ఖరారు చేసి, ఆ తర్వాత కేటాయింపులు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సొసైటీల పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకులాలు, మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడ్డ తరగతుల సంక్షేమ గురుకులాలు, మైనారిటీ గురుకులాల విద్యా సంస్థల్లో అన్ని కేటగిరీల్లో కలుపుకుని సుమారు 25 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు.


గెస్ట్‌ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలిజీవో 317 వల్ల ఇబ్బందులకు గురైన గెస్ట్‌ లెక్చరర్ల సమస్యలను సర్కారు పరిష్కరించాలని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల గెస్ట్‌ లెక్చరర్ల అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి దామెర ప్రభాకర్‌, దార్ల భాస్కర్‌ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గెస్టు లెక్చరర్లను ఈ విద్యా సంవత్సరంలో జూన్‌ నుంచి రెన్యువల్‌ చేయకపోవడంతో నాలుగు నెలలు ఉపాధి కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌ వేతనాలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-02-19T17:42:05+05:30 IST