18 డిగ్రీ కాలేజీలపై కొరడా.. ఈ ఏడాది అడ్మిషన్లు నిలిపివేత

ABN , First Publish Date - 2022-09-17T17:35:52+05:30 IST

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న డిగ్రీ కళాశాలల(Degree colleges)పై ఉన్నత విద్యాశాఖ కొరడా ఝుళిపించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని 18 కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది.

18 డిగ్రీ కాలేజీలపై కొరడా.. ఈ ఏడాది అడ్మిషన్లు నిలిపివేత

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుండడంతో ఉన్నత విద్యాశాఖ చర్యలు

ఏయూ పరిధిలోని 78 కాలేజీల్లో లోపాలు గుర్తింపు

రెండు నెలల కిందట షోకాజ్‌ నోటీసులు

దిద్దుబాటు చర్యలు చేపట్టిన 60 కళాశాలలు

స్పందించని కాలేజీలపై చర్యలు

వచ్చే ఏడాదికి కూడా అలాగే ఉంటే గుర్తింపు రద్దు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న డిగ్రీ కళాశాలల(Degree colleges)పై ఉన్నత విద్యాశాఖ కొరడా ఝుళిపించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని 18 కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. వివరాల్లోకి వెళితే... రాష్ట్రవ్యాప్తంగా అనేక డిగ్రీ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టాలని ఆయా వర్సిటీ లను ఉన్నత విద్యా శాఖ ఆదేశించింది. కొద్దిరోజుల కిందట ఆంధ్ర విశ్వవిద్యాలయం(Andhra University) అధికారులు తమ పరిధిలోని కళాశాలలను వర్చువల్‌ విధానంలో పరిశీలించి అన్నీ  బాగానే వున్నాయంటూ ఉన్నత విద్యాశాఖకు నివేదిక సమర్పించారు. అయితే, లోపాలున్న కళాశాలలను గుర్తించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేస్తూ...మరోసారి తనిఖీలు నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ ఆదేశించింది. దీంతో ప్రత్యేక బృందాలను నియమించి ఆయా కాలేజీలను అధికారులు తనిఖీ చేయగా, పలు లోపాలు బయటపడ్డాయి. ఏయూ పరిధిలో 168 కళాశాలలకుగాను 78 కాలేజీల్లో లోపాలు వున్నట్టు గుర్తించారు. 


ఇవీ లోపాలు.. 

ఉన్నత విద్యా శాఖ నిబంధనల ప్రకారం డిగ్రీ కళాశాల నిర్వహణకు కనీసం ఎకరా స్థలం ఉండాలి. అలాగే తరగతుల నిర్వహణకు అనుగుణంగా గదులు, బోధన, బోధనేతర సిబ్బంది ఆశించిన స్థాయిలో ఉండాలి. ఇంకా ప్రిన్సిపాల్స్‌, గ్రంథాలయం, ఇతర మౌలిక వసతులు కలిగివుండాలి. అనేక కాలేజీల్లో ఆశించిన స్థాయిలో సిబ్బంది లేకపోవడం, కొన్ని కాలేజీలకు ఎకరా స్థలం లేకపోవడం వంటి అంశాలను  తనిఖీల్లో గుర్తించి ఉన్నత విద్యాశాఖకు నివేదించారు. ఉన్నత విద్యా శాఖ ఆదేశాల మేరకు షోకాజ్‌ నోటీసులను జారీచేశారు. లోపాలను సరిదిద్దుకునేందుకు కొంత గడువు ఇచ్చారు. అలా సరిచేసుకున్న కళాశాలల వివరాలను ఉన్నత విద్యా శాఖకు పంపించారు. ముందుగా గుర్తించిన 78 కాలేజీల్లో 60 కాలేజీలు లోపాలను సవరించుకోగా, మిగిలిన 18 కాలేజీలు ఎటువంటి చర్యలను చేపట్టలేదు. దీంతో ఆయా కాలేజీల్లో ఈ ఏడాది అడ్మిషన్లు నిలిపివేయాలని ఉన్నత విద్యా శాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ జాబితా నుంచి సదరు కాలేజీలను అధికారులు తొలగించారు. ఈ విధంగా ఏయూ పరిధిలోని 18 కాలేజీల్లో ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోనుంది. ఇందులో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 15-16, విజయనగరం జిల్లాలో రెండు, మూడు కళాశాలలు వున్నట్టు తెలిసింది. వచ్చే ఏడాది నాటికి ఆయా లోపాలను సరిచేసుకుంటే మళ్లీ అడ్మిషన్లకు అవకాశం ఇస్తారు. లేనిపక్షంలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు కోర్సు పూర్తయిన తరువాత ఆయా కాలేజీల గుర్తింపును పూర్తిగా రద్దు చేయనున్నారు. కళాశాలలపై చర్యలు అంశాన్ని ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో పెట్టి ఆమోదం తీసుకోనున్నట్టు ఏయూ కాలేజీ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (సీడీసీ) డీన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌ సత్యనారాయణ తెలిపారు.

Read more