ప్రైవేటు వర్సిటీల దోపిడీ! భయంతో అడ్మిషన్లకు దూరం!

ABN , First Publish Date - 2022-10-04T20:46:00+05:30 IST

హాస్టల్‌కు రూ.2 లక్షలు.. బస్‌కు రూ.50 వేలు.. రాష్ట్రంలో నెలకొల్పిన ప్రైవేటు యూనివర్సిటీల్లో వసూలు చేస్తున్న హాస్టల్‌ ఫీజులు, రవాణా చార్జీలు పేద విద్యార్థులకు కళ్లు బైర్లు కమ్మిస్తున్నాయి. ఇక్కడైతే కాస్త మెరుగైన విద్య అందుతుందన్న ఆశతో..

ప్రైవేటు వర్సిటీల దోపిడీ! భయంతో అడ్మిషన్లకు దూరం!

హాస్టల్‌కు ఏడాదికి 2 లక్షలు వసూలు.. 

బస్సు రవాణాకు రూ.50 వేల పైనే

కన్వీనర్‌ కోటా విద్యార్థుల ఆందోళన

వసూళ్ల భయంతో అడ్మిషన్లకు దూరం


(అమరావతి-ఆంధ్రజ్యోతి): హాస్టల్‌కు రూ.2 లక్షలు.. బస్‌కు రూ.50 వేలు.. రాష్ట్రంలో నెలకొల్పిన ప్రైవేటు యూనివర్సిటీల్లో వసూలు చేస్తున్న హాస్టల్‌ ఫీజులు, రవాణా చార్జీలు పేద విద్యార్థులకు కళ్లు బైర్లు కమ్మిస్తున్నాయి. ఇక్కడైతే కాస్త మెరుగైన విద్య అందుతుందన్న ఆశతో.. పేద విద్యార్థులు ఈఏపీసెట్‌లో మంచి ర్యాంకులు సాధించి ప్రైవేటు యూనివర్సిటీల్లో కన్వీనర్‌ కోటాలో సీట్లు సాధిస్తుంటే.. వాళ్లేమో హాస్టల్‌ ఫీజులు, రవాణా చార్జీల రూపంలో దోపిడీకి తెరతీస్తున్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు వర్సిటీలు హాస్టల్‌ ఫీజు కింద ఏడాదికి ఏకంగా రూ.2లక్షలు వసూలు చేస్తున్నాయి. వామ్మో అంత చెల్లించలేమని.. సమీప ప్రాంతాల్లో ఉంటూ యూనివర్సిటీ బస్సుల్లో వెళ్దామనుకుంటే దూరంతో సంబంధం లేకుండా బస్సు ప్రయాణానికి ఏడాదికి రూ.50వేలకు పైగా డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో పేద విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. అంతంత ఫీజులు కట్టే స్థోమతే ఉంటే.. ఇంత మంచి ర్యాంకులు ఎందుకని వాపోతున్నారు. ఆ స్థాయి హాస్టల్‌ ఫీజులు, రవాణా చార్జీలు భరించలేమని అడ్మిషన్లకు దూరమవుతున్నారు.


ముఖ్యంగా రాజధాని ప్రాంతంలోని యూనివర్సిటీల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. రాయితీపై భూములు పొందిన యూనివర్సిటీలు కన్వీనర్‌ కోటా సీట్లపై అనాసక్తత ప్రదర్శిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో ప్రజా రవాణా కూడా అందుబాటులో లేని ప్రాంతాల్లో నెలకొల్పిన యూనివర్సిటీలకు వెళ్లాలంటే ఆ సంస్థ బస్సులు తప్ప మరో మార్గం లేదు. స్థానిక విద్యార్థులకైతే సొంత వాహనాలపై వచ్చే వీలుంటుంది. అయితే బయటి జిల్లాల నుంచి వచ్చి సమీపంలో ఉంటూ తరగతులకు హాజరయ్యేవారికి యూనివర్సిటీ బస్సులే దిక్కవుతున్నాయి. పోనీ హాస్టల్‌లో ఉందామంటే ఆ ఫీజులు చూసి విద్యార్థులు బెంబేలెత్తుతున్నారు. ఈ క్రమంలో సీట్లు వచ్చినా హాస్టల్‌, బస్‌ ఫీజులు చూసి అనేక మంది విద్యార్థులు కాలేజీల్లో చేరకుండా ఆగిపోయారు. ఉదాహరణకు రాజధానిలోని ఓ యూనివర్సిటీలో కన్వీనర్‌ కోటా ద్వారా 949 మంది సీట్లు పొందగా వారిలో 800 మంది మాత్రమే జాయినింగ్‌ రిపోర్టు ఇచ్చారు. 149 మంది సీట్లు వచ్చినా ఆగిపోయారు. మరో యూనివర్సిటీలో 474 మందికి గాను 423 మందే రిపోర్టు చేశారు. రిపోర్టింగ్‌ గడువు కూడా ముగియడంతో హాస్టల్‌ ఫీజులు చూసి వారు సీట్లు వదిలేసుకున్నారు.


కన్వీనర్‌ కోటా సీట్లపై వివక్ష!

వైసీపీ ప్రభుత్వంలో తెచ్చిన నిబంధనలతో గతేడాది నుంచి ప్రైవేటు యూనివర్సిటీల్లోనూ 35శాతం సీట్లను సర్కారు నిర్వహించే ఈఏపీసెట్‌ ద్వారా భర్తీ చేస్తున్నారు. మంచి ర్యాంకులు సాధించిన వారు వాటిలో సీట్లు పొందుతున్నారు. అయితే ప్రభుత్వ ఒత్తిడితో కన్వీనర్‌ కోటాకు సీట్లు ఇచ్చినా.. యూనివర్సిటీలు ఈ కోటా విద్యార్థులపై కొంత వివక్ష ప్రదర్శిస్తున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ఒక్కో సీటుకు రూ.3 లక్షల వరకూ వసూలు చేసుకుంటున్న తరుణంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద కేవలం రూ.70వేల ఫీజుతో సీట్లు ఇవ్వడం యూనివర్సిటీలకు మింగుడు పడటం లేదు. గతేడాది కన్వీనర్‌ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులకు, యూనివర్సిటీ నేరుగా భర్తీ చేసుకున్న విద్యార్థులకు వేర్వేరు తరగతుల్లో బోధన చేశారనే ఆరోపణలున్నాయి. కన్వీనర్‌ కోటా విద్యార్థులపై యూనివర్సిటీలు వివక్ష చూపుతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా గతేడాది ప్రభుత్వం నిర్వహించిన ఈఏపీసెట్‌ ఆలస్యం కావడం వల్లే వారికి ప్రత్యేకంగా తరగతులు నిర్వహించాల్సి వచ్చిందని యూనివర్సిటీలు వాదిస్తున్నాయి.


మధ్యలోనే మిగిలిపోయారు

ఇటు ప్రైవేటు యూనివర్సిటీల్లో ఫీజులు కట్టలేక... అటు మంచి కాలేజీల్లో సీట్లు పొందే అవకాశం కోల్పోయిన విద్యార్థులు అటూ ఇటూ కాకుండా మిగిలిపోయారు. వాస్తవానికి ప్రైవేటు యూనివర్సిటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఇతర ఇంజినీరింగ్‌ కాలేజీల్లోనూ కోరుకున్న చోట సీట్లు వచ్చేవి. కానీ ప్రైవేటు యూనివర్సిటీల్లో విద్య మరింత మెరుగ్గా ఉంటుందనే ఆశతో ఇక్కడ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ సీటు సంపాదించిన తర్వాత హాస్టల్‌ ఫీజులు చూసి భయంతో వెనకడుగు వేస్తున్నారు. ఈలోగా ఈఏపీసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ ముగిసిపోవడంతో ఇతర కాలేజీల్లో కావాల్సిన చోట, కావాల్సిన బ్రాంచ్‌ను పొందే అవకాశం కోల్పోయారు. అలాంటి విద్యార్థులు ఇప్పుడు ఏంచేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.

Read more