ఉద్యోగ భద్రత కరవు! సీఆర్పీలకు రెగ్యులర్‌ అందని ద్రాక్షేనా?

ABN , First Publish Date - 2022-09-19T22:06:40+05:30 IST

సీఆర్పీ(క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌)లకు ఉద్యోగ భద్రత కరువైంది. ఏళ్ల తరబడి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఉపాధ్యాయులకు సమానంగా బీఈడీ అర్హతతో నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టినా, తగిన గుర్తింపు లభించడం లేదు.

ఉద్యోగ భద్రత కరవు! సీఆర్పీలకు రెగ్యులర్‌ అందని ద్రాక్షేనా?

ఖాళీ పోస్టులతో అదనపు భారం

సమస్యలతో సతమతం


(ఇచ్ఛాపురం రూరల్‌): సీఆర్పీ(క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌)లకు ఉద్యోగ భద్రత కరువైంది. ఏళ్ల తరబడి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఉపాధ్యాయులకు సమానంగా బీఈడీ అర్హతతో నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టినా, తగిన గుర్తింపు లభించడం లేదు. ప్రభుత్వం జిల్లాలో ఖాళీ పోస్టులను భర్తీ చేయడంలేదు. దీంతో చాలీచాలని జీతం, అదనపు భారంతో సీఆర్పీలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తమను రెగ్యులర్‌ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 2,658 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 286 మంది సీఆర్పీలు విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో నాడు-నేడు పనులు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదు, ఆటలు, తాగునీరు, మరుగుదొడ్లు, యూనిఫాం, డ్రాపౌట్స్‌ను తిరిగి పాఠశాలకు తీసుకురావడం వీరి విధి. దీంతో పాటు ఎస్‌ఎంసీల నిర్వహణ, సమావేశాలు, సర్వశిక్షా అభియాన్‌ అధికారుల సమావేశాల సారాంశాన్ని స్కూల్‌ కాంప్లెక్స్‌ల్లో వివరిస్తారు. పాఠశాలలకు సంబంధించిన నెలవారీ నివేదికలు, ఎంఈవో, డీఈవో కార్యాలయాలకు అందిస్తారు. ఒక్కో సీఆర్పీకి నెలకు రూ.23,300 వేలు చొప్పున సర్వశిక్షా అభియాన్‌ గౌరవ వేతనం చెల్లిస్తోంది. సీఆర్పీలు మండలాల్లో ఎంఈవో, జిల్లాలో ఏఎంవో, పీవోల ఆధీనంలో విధులు నిర్వహిస్తారు. బీఈడీ చేసినా.. తమకు సక్రమంగా గౌరవ వేతనం అందడం లేదని, ఉద్యోగ భద్రత కూడా లేదని సీఆర్పీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  రెగ్యులర్‌ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని పదేళ్లుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కమిషనర్‌లకు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అంకితభావంతో పనిచేస్తున్నా.. తమ సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇచ్ఛాపురం ఎంఈవో కురమాన అప్పారావును వివరణ కోరగా సీఆర్పీల సేవలను ప్రభుత్వం గుర్తించి.. వారికి న్యాయం చేస్తుందని తెలిపారు.

 

ఉద్యోగ భద్రత కల్పించాలి

సీఆర్పీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలు కల్పించాలి. ఉద్యోగులకు, కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించాలి.

-ఆర్‌.దేవరాజు, సీఆర్పీ, ఇచ్ఛాపురం.  


అవకాశం కల్పించాలి

ఉపాధ్యాయ వృత్తికి కావలసిన అన్ని అర్హతలు  మాకు ఉన్నాయి. బీఈడీ, డీఈడీలతో పాటు బోధన అనుభవం కూడా మాకు ఉంది. చాలా మంది సీఆర్పీలకు పీజీ విద్యార్హత ఉంది. ప్రభుత్వం మా కష్టాన్ని గుర్తించి ఉపాధ్యాయులుగా అవకాశం కల్పించాలి

- బి.తులసిదాసు, సీఆర్పీ, కవిటి.  


సేవలు గుర్తించాలి

ఉపాధ్యాయులతో సమానంగా బీఈడీ అర్హతతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాం. మా వేతనాలు పెంచి రెగ్యులర్‌ చేయాలి. ప్రతి నెలా జీతాలు సక్రమంగా అందించాలి. జిల్లాలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. అదనపు భారంతో ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం.

- బి.గణేష్‌, సీఆర్పీ, ఇచ్ఛాపురం.  

Read more