కళాశాలలపై కన్నెర్ర! నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు

ABN , First Publish Date - 2022-09-19T22:02:31+05:30 IST

నిబంధనలు సక్రమంగా పాటించని, మౌలిక సదుపా యాలు సరిగా లేని ప్రైవేటు డిగ్రీ కళాశాలలపై ప్రభుత్వం కన్నెర్ర జేసింది. రాష్ట్రవ్యాప్తంగా 100 వరకు డిగ్రీ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలను నిలిపివేసింది. ఇందులో జిల్లాకు సంబంధించి డాక్టర్‌ బీఆర్‌

కళాశాలలపై కన్నెర్ర! నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు

నిబంధనలు పాటించని 19 ప్రైవేటు డిగ్రీ కాలేజీలపై చర్యలు

మొదటి సంవత్సర ప్రవేశాలు నిలిపివేత

ఇప్పటివరకూ పూర్తికాని అడ్మిషన్లు


(ఎచ్చెర్ల): నిబంధనలు సక్రమంగా పాటించని, మౌలిక సదుపా యాలు సరిగా లేని ప్రైవేటు డిగ్రీ కళాశాలలపై ప్రభుత్వం కన్నెర్ర జేసింది. రాష్ట్రవ్యాప్తంగా 100 వరకు డిగ్రీ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలను నిలిపివేసింది. ఇందులో జిల్లాకు సంబంధించి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ పరిధిలో 19 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. కాశీ బుగ్గలో మూడు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, శ్రీకాకుళంలో రెండు, టెక్కలిలో రెండు ప్రైవేటు డిగ్రీ కళాశాలలపై వేటు పడింది. వీటితో పాటు చిలకపాలెం, వెదుళ్లవలస, కంచిలి, సరుబుజ్జిలి, హరిపురం, వంగర, రణస్థలం, రాజాం, నరసన్న పేట, మెళియాపుట్టి, హిరమండలం, సోంపేటలోని ఒక్కో ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లను నిలిపివేశారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు.


ఇవీ నిబంధనలు

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సాధారణంగా ప్రతి ఏడాది కొత్త డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సర్వే నిర్వహిస్తుంది. ముందుగా ఓ కమిటీని నియమించి యూనివర్సిటీల వారీగా ఎక్కడెక్కడ కొత్తగా డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు అవకాశం ఉందో గుర్తించి నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. దీని ప్రకారం ఆసక్తి ఉన్న యాజమాన్యాలు డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు ముందుకొస్తాయి. డిగ్రీ కళాశాల ఏర్పాటుకు 2 ఎకరాల స్థలం ఉండాలి. సొసైటీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేసి, ఐదేళ్లులోగా సొంత భవనాలు సమకూర్చుకుంటామని అఫిడవిట్‌ దాఖలు చేయాలి. తర్వాత మరో ఐదేళ్లు వ్యక్తిగత పూచీకత్తుపై గడువును పొడిగిస్తారు. పదేళ్లు దాటిన తర్వాత సొంత భవనాలు తప్పనిసరిగా సమకూర్చుకోవాలి. లేదంటే ప్రతి ఏటా గడువు పెంపునకు అనుమతి కోసం రూ.30 వేల వంతున చెల్లించాలి. డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు ఉన్నత విద్యామండలి అనుమతి ఇస్తే, సంబంధిత యూనివర్సిటీ ఏటా అఫిలియేషన్‌(గుర్తింపు) ఇస్తుంది. అయితే, జిల్లాలో చాలా డిగ్రీ కళాశాలలకు ఇప్పటికీ సొంత భవనాలు లేవు. ఈ కళాశాలల్లో అడ్మిషన్లు ఇచ్చేందుకు వీల్లేదు. కానీ, ఇందుకు విరుద్ధంగా కొన్ని డిగ్రీ కళాశాలలు వ్యవహరిస్తున్నాయని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గుర్తించింది. దీంతో గతంలో కొన్ని కళాశాలలకు షోకాజు నోటీసులు జారీ చేసింది. వాటిని సరి చేసుకున్న కళాశాలలకు సంబంధించి ప్రవేశాలకు అనుమతి ఇచ్చింది. వాస్తవానికి సొసైటీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేసిన భవనాలకు క్రయవిక్రయాలు చేసేందుకు అవకాశంలేదు. ఈ కారణంగా ప్రైవేటు డిగ్రీ కళాశాలలు సొంత భవనాలను సమకూర్చుకునేందుకు ఆసక్తి చూపడంలేదు. అంబేడ్కర్‌ వర్సిటీ పరిధిలో 10 శాతం ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఆయా వర్సిటీల నివేదిక ఆధారంగా పాలకమండలి సమావేశాల్లో చర్చించి 19 కళాశాలల్లో ప్రవేశాల నిలిపివేతపై నిర్ణయం తీసుకున్నారు.


తగ్గిన అడ్మిషన్లు

అంబేడ్కర్‌ వర్సిటీ పరిధిలో మొత్తం 104 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 15 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కాగా, మిగిలినవ్నీ ప్రైవేటు కాలేజీలే. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో గత రెండేళ్లలో డిగ్రీ ప్రవేశాల్లో తీవ్ర జాప్యమవుతోంది. వాస్తవానికి ఏటా జూన్‌ రెండో వారం నాటికి డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలి. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో ఇంజనీరింగ్‌, ఇతర కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో సంబంధిత డిగ్రీ కళాశాలలే అడ్మిషన్లు నిర్వహించేవి. గత రెండేళ్లుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి రాష్ట్రవ్యాప్తంగా అడ్మిషన్లను ఒకేసారి చేపట్టడం జరుగుతోంది. ఫలితంగా అడ్మిషన్లలో తీవ్ర జాప్యమవుతోంది.


రేపటి నుంచి ఆప్షన్ల నమోదు

డిగ్రీలో చేరేందుకు ఇప్పటికే తమ పేర్లను ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థులు ఈ నెల 19వ తేదీ నుంచి వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. వెబ్‌ ఆపన్లను నమోదు చేసేటప్పుడు విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  అంబేడ్కర్‌ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న 19 కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు అవకాశంలేదు. ఈ కళాశాలల్లో చ దువుతున్న ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థుల తరగతుల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  

- ప్రొఫెసర్‌ పీలా సుజాత, సీడీసీ డీన్‌, అంబేడ్కర్‌ యూనివర్సిటీ

Read more