పీజీ సీట్లకు శాపం

ABN , First Publish Date - 2022-09-29T21:00:08+05:30 IST

21 విభాగాలలో 130 పీజీ సీట్లకు ప్రతిపాదనలు.. అందుకు అవసరమైన రూ.49.56 లక్షల చెల్లింపు.. కనీసం 100 సీట్లు అయినా మంజూరవుతాయనే సంబరం. కానీ

పీజీ సీట్లకు శాపం

వైద్య కళాశాలలో 130 సీట్లకు 23 మంజూరు

21 విభాగాలకు రూ.49.56 లక్షల చెల్లింపు

కనీసం 100 సీట్లు మంజూరవుతాయని అంచనా

17 సార్లు పర్యటించిన ఎన్‌ఎంసీ బృందం

తనిఖీల్లో అనేక లోపాలు వెలుగులో

కిసీట్ల కేటాయింపులో తీవ్ర ప్రభావం


21 విభాగాలలో 130 పీజీ సీట్లకు ప్రతిపాదనలు.. అందుకు అవసరమైన రూ.49.56 లక్షల చెల్లింపు.. కనీసం 100 సీట్లు అయినా మంజూరవుతాయనే సంబరం. కానీ ఊహించనిరీతిలో జాతీయ వైద్య మండలి (ఎనఎంసీ) షాక్‌ ఇచ్చింది. కేవలం 23 పీజీ సీట్లను మంజూరు చేయడంపై నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల అధికారుల్లో తీవ్ర నిరాశను నింపింది. అయితే, జీజీహెచ, వైద్య కళాశాలలో 19 విభాగాలను 17 సార్లు పరిశీలించిన ఎనఎంసీ బృందం అనేక లోపాలను పసిగట్టింది. అందుకు అనుగుణంగానే పీజీ సీట్ల కేటాయింపులో భారీ కోత విధించినట్లు సమాచారం.


నెల్లూరు (వైద్యం), సెప్టెంబరు 28 : జిల్లాకే  తలమానికమైన ప్రభుత్వం వైద్య కళాశాలలో పీజీ సీట్ల కేటాయింపు అగమ్య గోచరంగా మారుతోంది. 2022-23 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుకు కనీసం 100 సీట్లు వస్తాయని ఆశించిన కళాశాల అధికారులకు నిరాశే మిగిలింది. నేషనల్‌ మెడికల్‌ కౌన్సెల్‌ (ఎనఎంసీ) కేవలం 23 పీజీ సీట్లకే అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జూన మాసంలో వైద్య కళాశాల నిర్వాహకులు 21 విభాగాలలో 130 సీట్లు కావాలని పేర్కొంటూ ఎనఎంసీకి  ప్రతిపాదనలు పంపారు. ఇందుకోసం ఒక్కో విభాగానికి రూ.2.36 లక్షల వంతున 21 విభాగాలకు రూ.49.56 లక్షలు చెల్లించారు. అయితే  23 పీజీ సీట్లు మాత్రమే మంజూరు చేయడంపై అధికారుల నుంచి తీవ్ర నిరాశ ఎదురవుతోంది. మరోవైపు అత్యవసర విభాగాలలోనూ పీజీ సీట్లకు అనుమతులు ఇవ్వక పోవటంతో వైద్య వర్గాలలో అసంతృప్తి నెలకొంది. అనుకున్న స్థాయిలో పీజీ సీట్లు మంజూరై ఉంటే వైద్యసేవలు మెరుగుపడే అవకాశం ఉండేది. కాగా, 2013లో ప్రారంభమైన ఈ వైద్య కళాశాలలో ఇప్పటివరకు రెండు బ్యాచలు ఎంబీబీఎస్‌ కోర్సు పూర్తి చేశాయి. ప్రస్తుతం 175 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. త్వరలో మరో బ్యాచ కూడా వైద్య కళాశాలలో చేరనుంది. ఈ నేపథ్యంలో రెండేళ్లుగా పీజీ సీట్ల కోసం కళాశాలలో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. 


ఎన్‌ఎంసీ బృందం పరిశీలించినా

ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇప్పటివరకు 17 సార్లు జాతీయ వైద్య మండలి బృందం పర్యటించి, 19 విభాగాలను పరిశీలించింది. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలలో కొన్ని విభాగాలలో పరికరాలు అందుబాటులో లేవని ఎనఎంసీ బృందం నిర్ధారించింది. అలాగే జీజీహెచలో వైద్యుల కొరత కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. అనేక విభాగాలపై ఆ బృందం నిరాసక్తత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే పీజీ సీట్ల అనుమతులపై అనేక కొర్రీలు పెడుతోంది. అయితే గత ఏప్రిల్‌ నుంచి జీజీహెచ, వైద్య కళాశాలకు కర్నూలు, అనంతపురం, తిరుపతి, ప్రకాశం జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో వైద్యులు వచ్చారు. జాతీయ వైద్య మండలి నిబంధనలు ప్రకారం అవసరమైన వైద్యులు అందుబాటులోకి వచ్చారు. అన్నీ సమూరుతున్న సమయంలో  కేవలం 23 పీజీ సీట్లు కేటాయించడంపై వైద్య వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అయితే వచ్చే విద్యా సంవత్సరంలో అయినా 100 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


ఈ ఏడాదికి 23 సీట్లే వచ్చాయి

ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎక్కువ పీజీ సీట్లు వస్తాయని భావించాం. కానీ ఇంత తక్కువగా 23 సీట్లు రావడం నిరాశకు గురి చేస్తున్నాయి. 21 విభాగాలకు రూ.49.56 లక్షలు చెల్లించాము. అనేక కారణాలు చూపి తక్కువ సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల్లో పీజీ కోర్సులు ప్రారంభం అవుతాయి. 

- డాక్టర్‌ మురళీకృష్ణ, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌

Read more