సీమ ద్రోహి ఎవరు?

ABN , First Publish Date - 2022-11-25T02:33:22+05:30 IST

జగన్‌ రెడ్డి, ఆయన తండ్రి కలిసి దాదాపు పదేళ్లు పాలించారు. శ్రీబాగ్‌ ఒప్పందాన్ని ఎందుకు అమలు చేయలేదు? అధికారానికి రావడానికి రాయలసీమ వెనకబాటుతనంపై కపట ప్రేమ వలకబోస్తారు...

సీమ ద్రోహి ఎవరు?

జగన్‌ రెడ్డి, ఆయన తండ్రి కలిసి దాదాపు పదేళ్లు పాలించారు. శ్రీబాగ్‌ ఒప్పందాన్ని ఎందుకు అమలు చేయలేదు? అధికారానికి రావడానికి రాయలసీమ వెనకబాటుతనంపై కపట ప్రేమ వలకబోస్తారు. అధికారంలోకి వచ్చాక రాయలసీమ గనులు, భూములు, ఎర్రచందనం కొల్లగొడతారు. సామాజిక న్యాయం మంటకలుపుతారు. కడప జిల్లాలో బీసీకి గాని, బలిజకు గాని ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వరు. ప్రశ్నించిన వారిని శవాలుగా మారుస్తారు. ఆస్తులు విధ్వంసం చేస్తారు. అధికారం పోయే స్థితి వచ్చినప్పుడు తమ ఏజెంట్లకు మేధావుల ముసుగు తొడిగి ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేస్తారు. ప్రాంతీయ, కుల చిచ్చు కుట్రలు చేస్తున్నారు. ఈ జగన్నాటకంలో జగన్‌ రెడ్డి కుటుంబం, ఆయన ముఠా కుబేరులయ్యారు.

జగన్‌ రెడ్డి ముఠా ఉచ్చులో పడి మరోసారి మోసపోవడానికి రాయలసీమ పౌరులు సిద్ధంగా లేరు. శ్రీబాగ్‌ ఒప్పందంపై జగన్‌ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అమరావతి రాజధానికి ఆనాడు అసెంబ్లీలో ఎందుకు ఆమోదం తెలిపారు? ఇప్పుడు విశాఖకు తరలించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? విశాఖలో తన ముఠా భూ కబ్జాల కోసం కాదా? రాయలసీమ మీద ప్రేమ ఉంటే కృష్ణ ట్రిబ్యునల్‌ కార్యాలయాన్ని కర్నూలులో ఎందుకు పెట్టలేదు? హైకోర్టు బెంచ్‌ కర్నూలులో పెట్టేందుకు లైన్‌ క్లియర్ గా ఉంది. గడచిన మూడున్నర ఏళ్లలో కనీస ప్రయత్నం చేసి ఉంటే ఇప్పటికే హైకోర్టు బెంచ్‌ కర్నూలుకు వచ్చి ఉండేది. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎలాఎక్కుతుంది? అన్ని క్లియర్‌గా ఉన్నా బెంచ్‌ తేలేని జగన్‌ రెడ్డి తన చేతిలో లేని హైకోర్టును ఎలా తేగలడు? హైకోర్టు కావాలని ఇప్పటిదాక కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయలేదు. హైకోర్టు పేరుతో ప్రాంతీయ, కుల చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని కుట్రే గాని, రాయలసీమపై ప్రేమ లేదు. ఆయనను అధికార యావ, ధనపిశాచం ఆవహించాయి తప్ప దేని మీద ప్రేమ లేదు. రాయలసీమకు లైఫ్‌ లైన్‌ కృష్ణ జలాలు. తన కేసుల మాఫీ కోసం కృష్ణ, గోదావరి జలాలను కేంద్రానికి ధారాదత్తం చేసి రాయలసీమకు తీరని ద్రోహం చేశారు జగన్‌ రెడ్డి.

కృష్ణా జలాల్లోని మిగులు జలాలపై హక్కు కోరబోమని బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ కు ఆయన తండ్రి లేఖ రాసి ఇచ్చారు. కృష్ణ జలాల్లో ఏపీకి బచావత్‌ కమిషన్‌ కల్పించిన ప్రత్యేక హక్కుల్ని కేంద్రానికి, పొరుగు రాష్ట్రాలకు ధారాదత్తం చేసిన జగన్‌ రెడ్డి నిజమైన రాయలసీమ ద్రోహి కాదా? చంద్రన్న ఐదేళ్ల పాలనలో రాయలసీమ ప్రాజెక్టులపై రూ.10,747 కోట్లు ఖర్చు చేయగా.. జగన్‌ రెడ్డి ఖర్చు చేసింది 2,737 కోట్లు మాత్రమే. గండికోట నిర్వాసితులకు పునరావాసం, పరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టును నింపి గ్రామాలను ముంచేసి బలవంతంగా ఖాళీ చేయించారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ కు 90శాతం సబ్సిడీ ఇచ్చి రాయలసీమలో చంద్రన్న ప్రభుత్వం రైతుల్ని ఆదుకోగా.. దాన్ని జగన్‌ రెడ్డి రద్దు చేసి రైతులకు ద్రోహం చేశారు. వ్యవసాయ బోర్లు అధికంగా ఉన్న రాయలసీమలో మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు బిగించబోతున్నాడు.

చంద్రబాబు రాయలసీమను హార్టీకల్చర్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తే.. దాన్ని జగన్‌ రెడ్డి దెబ్బతీశాడు. ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాంను గల్లంతు చేసి 41 మంది ప్రాణాలు తీశారు. విభజన చట్టం ప్రకారం రాయలసీమకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ, కడప స్టీల్‌ ప్లాంటు సాధించలేదు. చంద్రబాబు ప్రభుత్వం సీమ విశ్వవిద్యాలయాల్లో వీసీలుగా ఎస్సీ, బలిజ, ముస్లిం, బీసీలను నియమించగా, జగన్‌ రెడ్డి అన్నింటికీ తన సామాజిక వర్గాన్ని నియమించుకున్నారు. చంద్రన్న ప్రభుత్వం కియా పరిశ్రమను స్థాపించి వేలాదిమందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించింది. రైతుల భూముల విలువ పెంచింది. జగన్‌ రెడ్డి పార్టీకి చెందిన ఎంపీ కియా పరిశ్రమపై దాడి చేసి 13 కియా అనుబంధ పరిశ్రమల్ని పొరుగు రాష్ట్రాలకు తరిమేశారు. టిడిపి ప్రభుత్వం కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలలో సోలార్‌ విండ్‌ పవర్‌ ప్రాజెక్టులు స్థాపించి 13వేల మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తే, జగన్‌ రెడ్డి ముఠా మైలవరం సోలార్‌ ప్లాంట్‌పై దాడి చేసి ధ్వంసం చేశారు. ఆర్‌టిపిపిని చాలా కాలం పాటు మూసివేసి కమిషన్ల కోసం బయట కరెంటు అధిక ధరలకు కొన్నారు.

వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న అమర్‌ రాజా, జువారి సిమెంట్‌ పరిశ్రమల మూసివేతకు కుట్రలు పన్నారు. రేణిగుంట నుండి రిలయన్స్‌ ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌ వెనక్కి వెళ్ళిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర విద్యా సంస్థల్ని తిరుపతిలో ఐఐటి, ఐషర్‌, శ్రీ సిటీలో ట్రిపుల్‌ ఐటి, అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్సిటీ, కర్నూలులో ఐఐఐటి, ఉర్దూ యూనివర్సిటీ స్థాపించారు. కర్నూలు జిల్లాలో రూ.6 వేల కోట్ల పెట్టుబడితో అతిపెద్ద సోలార్‌ పార్క్‌ స్థాపిం చడం జరిగింది. ఓర్వకల్లులో విమానాశ్రయం ఏర్పాటు. 10 వేల ఎకరాల్లో పారిశ్రామికవాడ, జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్‌, ఆహార శుద్ధి పరిశ్రమ, నందికొట్కూరులో రూ.650కోట్లతో మెగా సీడ్‌ పార్క్‌... ఇలా ఎన్నో పెట్టుబడులు పెట్టించడం జరిగింది. తిరుపతిలో టాటా క్యాన్సర్‌ ఇన్‌ స్టిట్యూట్‌, అరవింద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ స్థాపించడమైంది. జగన్‌ రెడ్డి సాధించిన కేంద్ర సంస్థలు ఏమీ లేవు. తిరుమల తిరుపతి చుట్టూ ఉన్న అడవులలోని ఎర్రచందనాన్ని నరికి వేల కోట్లు వైకాపా రెడ్‌ శాండిల్‌ మాఫియా సొమ్ము చేసుకుంటున్నది. రాయలసీమలోని గనులన్నింటిని కొల్లగొడుతున్నారు. ఓబులాపురం ఐరన్‌ ఓర్‌ను గాలి జనార్దన్‌ రెడ్డికి కట్టబెడుతున్నారు.

లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌లో 15వేల కోట్ల విలువైన రైతుల భూముల్ని మేనమామకు దోచిపెట్టే కుట్రకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. విలువైన ప్రైవేట్‌, ప్రభుత్వ భూములన్నింటిని కబ్జా చేస్తున్నారు. హత్యా రాజకీయాలను తిరిగి రాయలసీమలో పెంచి పోషిస్తున్నారు.

వెనకబడ్డ ప్రాంతాలకు వరప్రసాదమైన హంద్రీనీవాకు 2019 నుంచి 2021 ఆగస్టు వరకు జగన్‌ రెడ్డి ఖర్చు చేసింది రూ.504 కోట్లు మాత్రమే. చంద్రబాబు ఐదేళ్లలోనే హంద్రీనీవాకు 4,182 కోట్లు ఖర్చు చేశారు (ఆర్‌టిఐ నెంబర్‌ 2005/ 2021/190). గాలేరునగరికి జగన్‌ రెడ్డి రూ.795 కోట్లు ఖర్చు చేయగా, చంద్రబాబు రూ 2,323 కోట్లు ఖర్చు చేశారు. ఇతర రాయలసీమ ప్రాజెక్టులకు కూడా జగన్‌ రెడ్డి అరకొరగా ఇచ్చాడు. ముచ్చుమర్రి, ఆర్డీఎస్‌, గుండ్రేవుల, వేదవతి, హంద్రీనీవా కాలువ సామర్థ్యం 10 వేల క్యూసెక్కులకు పెంచి పనులు చేయడానికి తగు నిధులు కేటాయించలేదు. రాయలసీమకు చట్టబద్ధమైన నీటి కేటాయింపులు 144 టీఎంసీలలో 60 శాతం మాత్రమే రిజర్వాయర్లలో నింపగలిగే స్థితి ఉంది. రిజర్వాయర్ల ముంపు రైతులకు పరిహారం ఇవ్వనందున సామర్థ్యం మేరకు రిజర్వాయర్లలో నీరు నిల్వ చేయలేకపోతున్నాము.

ముచ్చుమర్రి నుండి హంద్రీనీవాకు 12 పంపుల ద్వారా 3850 క్యూసెక్కుల డ్రా చేసుకునే విధంగా చంద్రబాబు ప్రభుత్వం పంప్‌ హౌస్‌ నిర్మించింది. అలాగే మరో నాలుగు పంపుల ద్వారా 1000 క్యూసెక్కులు కేసీ కెనాల్‌, ఎస్‌ఆర్బీసి అవసరాల కోసం డ్రా చేసుకునే సదుపాయం ఏర్పాటు చేశారు. సెప్టెంబర్‌ 8, 2017న చంద్రబాబు ముచ్చుమర్రికి ప్రారంభోత్సవం చేశారు. హంద్రీనీవా కోసం ముచ్చుమర్రిలో 12 పంపుల పనులను జగన్‌ రెడ్డి ప్రభుత్వం మూడున్నర ఏళ్లయినా పూర్తి చేయలేదు. ముచ్చుమర్రి పనులపై చంద్రబాబు ప్రభుత్వకాలంలో లేని కోర్టు వివాదాలు జగన్‌ రెడ్డి కాలంలో ఎందుకు వచ్చాయి? రాయలసీమ లిఫ్ట్‌ పేరుతో ఆనాడు ప్రాంతీయ చిచ్చుకు లాలూచి కుస్తీ ఆడకుండా ముందుగా ముచ్చుమర్రి పనులు చేపట్టి ఉంటే ఈ సరికే పూర్తి అయ్యి ఉండేది. కోర్టు వివాదాల్లో చిక్కుకుని ఉండేది కాదు. అలాగే మల్యాల వద్ద హంద్రీనీవా మెయిన్‌ కెనాల్‌ కు పంపు చేయడానికి పన్నెండు పంపులను టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ఆరు లేదా ఏడు పంపులనే వాడుకున్నారు. మిగిలినవి నిరుపయోగంగా ఉన్నాయి. మెయిన్‌ కెనాల్‌ బెడ్‌ వెడల్పు 19 మీటర్లకు విస్తరించి తద్వారా 12 పంపులు పని చేయించి పది వేల క్యూసెక్కుల నీరు కృష్ణ నది నుండి తీసుకునే ప్రయత్నం చంద్రబాబు ప్రభుత్వం చేసింది. ఈ పనులకు జగన్‌ రెడ్డి తగు స్థాయిలో నిధులు ఇవ్వలేదు.

రాయలసీమ రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ చేయడంలేదు. కడప–బెంగుళూరు కొత్త లైన్‌ కోసం 50 శాతం నిధులు, 1084 హెక్టార్ల రెవెన్యూ భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో పనులు నిలిపివేశారు. కడప–పెండ్లిమర్రి ప్రాజెక్టుకు బదులు ముద్దనూరు– ముదిగుబ్బ వరకు కొత్త లైన్‌ ప్రతిపాదన చేశారు. అది ముందుకు సాగడంలేదు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, మీదుగా కర్నాటకలోని తుముకూరు లైన్‌లో మన రాష్ట్ర పరిధిలో ఇంకా 34 హెక్టార్లు భూసమీకరణ చేయలేదు. రూ.39 కోట్లు రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో పనులు జరగడంలేదు. కర్నూలు వ్యాగన్ల మరమ్మతు పరిశ్రమకు నిధులు ఇవ్వలేదు. ఇది రాయలసీమకు ద్రోహం చేయడం కాదా? తెలుగు గంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, సోమశిల స్వర్ణముఖితోపాటు డ్రిప్‌ లాంటి సాగునీటి ప్రాజెక్టులలో సింహభాగం పూర్తి చేసింది, శ్రీకారం చుట్టింది ఎన్‌టిఆర్‌, చంద్రబాబు. సాగునీటి ప్రాజెక్టులతోపాటు, పరిశ్రమలు, విద్య వైద్య సంస్థలు, రహదారుల నిర్మాణాలలో అత్యధిక భాగం నిర్మించింది టీడీపీ ప్రభుత్వాలే. ఎన్‌టిఆర్‌ రాయలసీమ దత్త పుత్రుడు, చంద్రన్న రాయలసీమ ఉత్తమ పుత్రుడు, జగన్‌రెడ్డి రాయలసీమ ద్రోహి. చించేస్తే చినిగిపోయేది కాదు చరిత్ర.

కాల్వ శ్రీనివాసులు

టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు

Updated Date - 2022-11-25T02:33:27+05:30 IST