మన నాటకానికి మిగిలింది గతవైభవమేనా?

ABN , First Publish Date - 2022-12-05T00:21:57+05:30 IST

ఓ అయిదు దశాబ్దాల కాలం పైగా ఉమ్మడి మద్రాసులోని భాగంగా ఉన్న ఆంధ్ర ప్రాంతంలో బళ్ళారి మొదలుకొని, గంజాం జిల్లాల వరకు నాటకరంగ వైభవం ఓ మహోజ్జ్వల ఘట్టం...

మన నాటకానికి మిగిలింది గతవైభవమేనా?

ఓ అయిదు దశాబ్దాల కాలం పైగా ఉమ్మడి మద్రాసులోని భాగంగా ఉన్న ఆంధ్ర ప్రాంతంలో బళ్ళారి మొదలుకొని, గంజాం జిల్లాల వరకు నాటకరంగ వైభవం ఓ మహోజ్జ్వల ఘట్టం. అలాగే ఆంధ్ర రాష్ట్రం, సమగ్ర ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా చాలా కాలం పాటు ఈ నాటక ప్రస్థానం బాగా కొనసాగింది. ఆబాల గోపాలాన్నీ ఉర్రూతలూగించిన పద్యనాటకంతో పాటు, సాంఘిక నాటకం కూడా ఇంచుమించు అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రేక్షకులను దశాబ్దాల పాటు ఎంతో ప్రభావితం చేసింది. సంస్కరణవాది, అభ్యుదయ భావజాల రచనలకు ఆద్యుడైన మహాకవి గురజాడ అప్పారావు కన్యాశుల్కం వంటి నాటకాల ప్రదర్శనతో ఈ సాంఘిక నాటక వైభవం ప్రారంభమైంది. అక్కడి నుండి దాదాపు శతాబ్దంపాటు ఎందరో లబ్దప్రతిష్టులైన నాటక రచయితలు, తమ అమూల్య మైన రచనలతో, నాటకరంగాన్ని పోటీపడి కొత్త పుంతలు తొక్కించారు. వారి కష్టానికి తోడుగా, నాటకమే జీవితంగా భావించిన ఎందరెందరో నటీ నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, సంగీత కళాకారులు వారి జీవితాలను అంకితం చేసి, ఈ సాంఘిక నాటక రంగ ప్రస్థానానికి అండగా నిలిచారు.

ఇంచుమించు 70వ దశకం ద్వితీయార్ధం వరకు ఆ మహోజ్వల చరిత్ర అనేక వందల, వేల పేజీలలో, వివిధ శీర్షికలతో, మహనీయుల అపురూప కృషితో అక్షరబద్ధమై నిక్షిప్తమై వుంది. అయినా, ఇంకా ఎందరో మహనీయుల కృషి, ఎన్నో అపురూప ఘట్టాల గురించి గ్రంథస్థం కావాలసి ఉంది. సంప్ర దాయవాదుల ఆంధ్ర నాటక కళాపరిషత్‌ మొదలు.... అభ్యుదయవాదుల ఆంధ్ర ప్రజానాట్యమండలి వంటి సంస్థల కృషి ఎనలేనిది. ఇక ఇటీవల దశాబ్దాలలో ఔత్సాహిక నాటక రంగం ప్రధానంగా నాటక పరిషత్తుల నిర్వహణపైనే ఆధారపడి కొనసాగుతుం దన్నది కాదనలేని నిజం. ఈ క్రమంలో, ఎందరో నటీ నటులు, దర్శకులు, పరిషత్తుల నిర్వాహకులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ పరిషత్తుల ద్వారా ప్రధానంగా నాటికలనే ప్రదర్శిస్తున్నారు. అయినా, అత్యధిక శాతం మంది నాటకాభిమానులు, ప్రేక్షకులు పూర్తిగా సంతృప్తి చెందలేక, కొన్ని పరిషత్తులు, అందు లోని ప్రదర్శనలు ప్రేక్షకాదరణ పొందలేకపోవడం నాటక శ్రేయోభిలాషులందరూ పరిశీలించాల్సిన అంశం.

దానికి ప్రధాన కారణం ‘రచనల కొరతే’ అన్నది నగ్నసత్యం. 1975ల నుండీ 2000 సంవత్సరం వరకు ఔత్సాహిక నాటక రంగంలో నాటికలు, నాటకాల రచనలలో మెలోడ్రామా తొంభైశాతం తగ్గిపోయింది. రచనల్లో నూతన పోకడలు, వర్తమాన సమస్యలపై స్పందన, దాని వలన ప్రదర్శనలలో వేగంపెరిగి, నాటక ప్రేక్షకుల హృదయాలలో ఈ మూడు దశాబ్దాలలో కొన్ని నాటిక, నాటక ప్రదర్శనలు శాశ్వతంగా మిగిలిపోయాయి. ఎంతో ప్రభావితం చేశాయి. ఈ కాలంలో కొన్ని రచనల్లోనూ కొంత మెలోడ్రామా వున్నా, కథాంశాన్ని బట్టి, నటీనటుల దర్శకుల ప్రతిభను బట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్నవి లేకపోలేదు. కొన్ని పరిషత్తులలో బహుమతులు కూడా గెలుచుకున్నా పోటీలో ఎక్కువ కాలం కొనసాగలేకపోవడం గమనార్హం.

అదీగాక, రచయితలలో తరాల అంతరం, మనకు మనమే మన నాటక సంస్కృతిని దీనస్థితికి తీసుకు రావడం, సంక్షేమ పథకాల పట్ల, ఓట్ల పట్ల వున్న శ్రద్ధ పాలకులకు (ఎవరైనా సరే) గత నాలుగు దశాబ్దాలుగా కళల పట్ల లోపించడం వంటివి ఎన్నో కోణాలు ఈ స్థితి వెనుక దాగున్నాయి. ఒక రచయితకు సృజనాత్మక వున్నా, నాటకంతో అనుబంధం తగ్గిపోవడం, తాను రాసిన నాటక ప్రదర్శన జరిగితేనే కానీ, ఆ రచన, ఆ రచయిత వెలుగులోకి రాకపోవడం నిజం.

అదే రచయిత ఓ కథ, నవల, కవిత రాస్తే, దాని బాగోగుల గురించి ఎక్కువ వ్యవస్థలపై ఆధార పడనక్కరలేదు. కొండొకచో రచయితే అచ్చు వేయించుకొని, పాఠకులకు అందుబాటులోకి తీసుకురాగలిగే అవకాశాలు ఎక్కువ. కానీ, నాటక రచయిత ఓ నాటక సమాజంపైనా, దర్శకుడి పైనా, నటీనటుల పైనా కూడా ఆధారపడవలసి ఉంటుంది. అందుకే, ఇటీవల తరంలో రచయితలు అసలు నాటక రచనవైపు కన్నెత్తి చూడటం లేదు. అందుకే కొన్ని పరిషత్‌ల నిర్వాహకులు కథల ఆధారంగా నాటికలు రచించిన వాటికి పోటీలు నిర్వహిస్తున్నారు. దీని వలన కూడా సమగ్ర ప్రదర్శనా విలువలతో కూడిన నాటికలు ప్రదర్శించలేకపోతున్నామని, ప్రముఖ రంగస్థల నట, దర్శకుడు పిళ్లా సన్యాసిరావు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, కొత్త రచనలు రాకపోవటం, పాతవి ప్రదర్శించరాదన్న నిబంధనల వలన కూడా, అన్ని పరిషత్‌ పోటీలలోనూ నాటకాభిమానులను సంతృప్తిపరచలేకపోతున్నామని ఆయన వివరించారు.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే నాటిక రచనలు చేసేలా, రచయితలను సన్నద్ధం చేయడం అంత సులభం కాదు. ఈ పరిణామం నాటకాభిమానులకు తీరని ఆవేదన కలిగిస్తోంది. నటీ నటుల, దర్శకుల, పరిషత్‌ నిర్వాహకుల కష్టానికి తగిన ఫలితం రావడం లేదన్న నిరాశా నిస్ప్పహలు వారిలో పెరుగుతున్నాయి.

ఇన్ని సాధక బాధకాలు, అవరోధాల మధ్య కూడా, నాటకం పట్ల ప్రేమ కనబరుస్తున్న నాటక కళాకారులకు ఏమిచ్చి రుణం తీస్చుకోగలం? ఈ రచనల అభివృద్ధికి ప్రధానంగా, విశ్వవిద్యాలయాల లోని థియేటర్‌ ఆర్ట్స్‌ విభాగాలు పూనిక వహించా ల్సిన బాధ్యత వుంది. లక్షలాది రూపాయలు వెచ్చించి, తెలుగునాట భారీ పరిషత్తులు నిర్వహిస్తోన్న అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్‌ సారథి ఆచార్య అప్పాజోస్యుల సత్యన్నా రాయణ, తాను ప్రముఖ సినీ రచయితగా ఎదిగినా, తన నాటక మూలాలు మరచిపోని సినీరచయిత బుర్రా సాయిమాధవ్‌, (కళల కాణాచి) కిన్నెర ఆర్టు థియేటరు చాలా కాలం పాటు పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్‌ నిర్వహించిన, ప్రముఖ రంగస్థల, సినీరచయితలు పరుచూరి బ్రదర్స్‌, పంతం పద్మనాభం నాటక పరిషత్‌, అక్కినేని నాటక కళాపరిషత్‌ వంటి కొన్ని సంస్థలు దృష్టి సారించి, ఈ నాటక, నాటిక రచనల అంశంలో, ప్రత్యేక కృషి చేయగలిగితే కొంత ఫలితం వుండవచ్చు నేమో? తెలుగు రాష్ట్రాల నాటక, సాహిత్య అకాడమీలు ఈ వైపు దృష్టిసారిస్తే మంచిదే! లేకపోతే, ఒకనాడు తెలుగునాట ఓ వెలుగు వెలిగిన, ఔత్సాహిక నాటకరంగ వైభవం గతంగా మిగిలిపోయే పరిస్థితులు ఎంతో దూరంలో లేవు.

బి.వి. అప్పారావు

93470 39294

Updated Date - 2022-12-05T00:22:06+05:30 IST