ఏ చరిత్రను తిరగరాయాలి?

ABN , First Publish Date - 2022-12-09T00:46:08+05:30 IST

ఇటీవల దేశవ్యాప్తంగా అసోం వీరుడు లచిత్‌ బర్ఫుకన్‌ పేరు మారుమోగిపోయింది. ప్రసార మాధ్యమాల్లో భారీగా ప్రకటనలు వెలువడ్డాయి....

ఏ చరిత్రను తిరగరాయాలి?

ఇటీవల దేశవ్యాప్తంగా అసోం వీరుడు లచిత్‌ బర్ఫుకన్‌ పేరు మారుమోగిపోయింది. ప్రసార మాధ్యమాల్లో భారీగా ప్రకటనలు వెలువడ్డాయి. కోట్లు ఖర్చుపెట్టారు. నవంబర్‌ 25న బర్ఫుకన్‌ 400వ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిపారు. ప్రధాని మోదీ, అమిత్‌షాలు ఆ సందర్భంగా చరిత్ర గురించి చాలా చెప్పారు. చరిత్రను తిరగరాయాలనీ, మన చరిత్రలో వక్రీకరణలు కోకొల్లలుగా ఉన్నాయనీ వీటిని సరిదిద్దే ప్రయత్నాలను మొదలుపెట్టాలనీ సూచించారు. దేశంలో ఏకబిగిన 150ఏళ్ల పాటు పాలించిన రాజవంశాలెన్నో ఉన్నాయనీ అట్లాంటి 30 రాజవంశాల గురించి పరిశోధన చేయాలని అమిత్‌షా సలహా ఇచ్చారు. చరిత్ర గురించి మోదీ, అమిత్‌షాలు ఇంతగా మాట్లాడటానికి కారణమైన బర్ఫుకన్‌ గురించి కొంతైనా తెలుసుకోవాలి. అసోంను అహోం రాజులు దాదాపు 600 ఏళ్లు పాలించారు. 1228 నుంచి 1826 దాకా అసోంలో వారి పాలన సాగింది. మొగలాయి పాలకులు, అంతకు ముందు బెంగాలులో అధికారం చలాయించిన సుల్తానులు అహోంలను జయించటానికి చాలా ప్రయత్నాలు చేశారు. అవేమీ పెద్దగా ఫలించలేదు. అహోం పాలకులు ఎదురు దెబ్బలు తిన్నా వాటి నుంచి కోలుకుని యుద్ధాలు చేశారు. లోయలు, కొండలు, నదులతో భౌగోళికంగా ఎంతో క్లిష్టమైన అహోం రాజ్యాన్ని జయించటం ఔరంగజేబు సైన్యానికీ సాధ్యం కాలేదు. అహోంల సైనికాధికారైన బర్ఫుకన్‌ చేతిలో ఔరంగజేబు సైన్యం పరాజయం పొందింది. ఆ ఘటన వల్లే బర్ఫుకన్‌ మహావీరుడిగా పూజలందుకుంటున్నాడు. వీరపూజలు, వీరగాథలు అన్నిచోట్లా ఉంటాయి. అసోం దీనికి మినహాయింపుకాదు.

ఇంతవరకైతే ఎవరికీ అభ్యంతరం ఉండదు. మొగలాయిలు విదేశీ పాలకులనీ వారిపై అహోంల గెలుపు దేశభక్త శక్తుల విజయంగా వర్ణించటంతోనే సమస్య మొదలవుతుంది. రాజ్యం వీరభోజ్యంగా భావించే ప్రాచీన, మధ్య యుగాల్లో భూభాగాల భక్షణ కోసం జరిగే యుద్ధాల్లో ఇప్పుడున్న అర్థంలో దేశభక్తి ఎంత వెతికినా దొరకదు. అహోం పాలకులు ఈనాటి భారత సరిహద్దుల్లో పుట్టిన భూమిపుత్రులు కాదు. ఒకనాటి చైనా సామ్రాజ్య భూభాగం నుంచి వచ్చి ఇక్కడ రాజ్యాన్ని సంపాదించారు. ఆ క్రమంలో స్థానిక తెగలను, రాజ్యాలను ఓడించారు. ఏ గడ్డ నుంచి వచ్చినా అసోంకు ఒక గుర్తింపు రావటంలో అహోంల పాత్రను విస్మరించలేం. అంతెందుకు అసాం, అసోం, అస్సాం లాంటి పేర్లలన్నీ అహోం నుంచి వచ్చాయని చరిత్రకారులు చెబుతారు.

ఎక్కడి నుంచి వచ్చారని కాకుండా ఎలాంటి పరిపాలన ఇచ్చారు? ఎలాంటి కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టారు? సమాజంలో సంపదను పెంచటానికి దోహదం చేశారా? పన్నుల పీడనను తగ్గించారా? పెంచారా? వ్యాపార కార్యకలాపాలకు ఊతం ఇచ్చారా? బానిస వ్యవస్థను నిర్మూలించారా? కుల వ్యత్యాసాలను తగ్గించారా? భిన్న మత విశ్వాసాలను అనుమతించారా? మిగులు సంపదను విలాసాలకే వెచ్చించారా? సదుపాయాల కల్పనకు దోహదం చేశారా? అన్న కోణాల్లో రాజ్యాలను, రాజవంశాలను మదింపు వేయటం చరిత్ర రచనలో ఆధునిక దృక్పథంగా భావిస్తారు. మనం జీవిస్తున్న ప్రజాస్వామ్య యుగం రాజకీయాలకే పరిమితం కాలేదు. చరిత్ర రచనను కూడా విపరీతంగా ప్రభావితం చేసింది. ప్రజాస్వామ్య యుగంలో పాలనా మంచి చెడుల మదింపు అంతా ప్రజల కోణంలోనే జరుగుతుంది. దీనికి భిన్నంగా చరిత్ర రచన ఉండలేదు. ప్రజల కేంద్రంగా సమాజ పరివర్తనను కళ్లకుకట్టే చరిత్ర రచనా పద్ధతులు ఆ నేపథ్యంలో వచ్చినవే. అందుకే రాజులు, రాజ్య వంశాల చరిత్రలను మాత్రమే చరిత్రగా భావించే దృక్పథాన్ని చరిత్రకారులు ఇప్పటికే పలు దేశాల్లో వదలిపెట్టారు. ప్రజల కోణం నుంచి గత చరిత్రను పరిశీలించటం, మదింపువేయటం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సహజంగా సాగుతోంది. మన దగ్గర మాత్రం ప్రయాణం సాఫీగా సాగటం లేదు. ఉన్నత ప్రమాణాలతో అట్లా చరిత్రను రాసిన చరిత్రకారులపైన రాళ్లు పడుతూనే ఉన్నాయి. మత దృష్టితో గతాన్ని మొత్తం కీర్తించని వారిని చరిత్రను వక్రీకరించిన మేధావుల జాబితాలోకి నెట్టివేయటం ఇటీవల బాగా పెరిగింది.

ప్రస్తుత దేశాల భౌగోళిక సరిహద్దులను గీటురాయిగా తీసుకుని ఆ సరిహద్దుల్లో ఉన్న రాజులను స్వదేశీ పాలకులుగా, సరిహద్దుల ఆవల నుంచి వచ్చిన వారిని విదేశీ పాలకులుగా భావించే ముతక విభజనకు ఆధునిక చరిత్ర రచనలో కాలం చెల్లింది. బయట నుంచి వచ్చి పాలకులైన వారందరూ చీకటి యుగాలను సృష్టించలేదు. ఇక్కడ పుట్టి రాజ్యాధికారాన్ని సంపాదించిన వారందరూ స్వర్ణయుగాలను స్థాపించలేదు. ఒకే మతానికి చెంది, ఒకే భాష మాట్లాడే రాజులు భూభాగాల కోసం నరమేధాలు సాగించటం ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్లా జరిగింది. ఒకే మతం వేర్వేరు రాజ్యాల మధ్య చరిత్రలో యుద్ధాలను నివారించలేక పోయింది. ఒకే భాష చరిత్రలో మారణహోమాలను ఆర్పలేకపోయింది. సముద్రగుప్తుడి యుద్ధాల్లో ఎవరు విజేతలు? ఎవరు పరాజితులు? అశోకుడి కళింగ యుద్ధంలో ఓడిన వారెవరు? గెలిచిన వారెవరు? విజేతల వీరగానం పరాజితులకు వినసొంపుగా ఉంటుందా? అందుకే రాజుల యుద్ధగానాల్లో ఒకరి వైపు నిలబడి మనం శ్రుతి కలపలేం. ఒక భౌగోళిక ప్రాంతంపై అలవిమాలిన మమకారంతో ఉండే మధ్యయుగాల్లోని వ్యక్తులకు అది సాధ్యమైతే కావొచ్చు. ఇప్పటి జాతీయవాద దృష్టితో అది అసాధ్యం.

రాజులు, రాజవంశాల చరిత్రే కావాలిస్తే మనకు కొదవలేదు. ప్రతి భాషా ప్రాంతంలోనూ ఆ తరహా చరిత్రలను ఇక రాయటానికి అవకాశమే లేనంతగా రాసేశారు. తెలుగు చరిత్ర పుస్తకాల్లో ఏ రాజవంశాన్నీ వదల్లేదు. శాతవాహనులు, ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనందగోత్రజులు, కళింగులు, విష్ణుకుండినులు, పల్లవులు, రేనాటిచోడులు, చాళుక్యులు, చోళులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు గురించి చాలానే రాశారు. ఆర్‌.సి.మజుందార్‌, హేమచంద్ర చౌధురి, ఎ.ఎస్‌.అల్టేకర్‌, జదునాథ్‌ సర్కార్‌, కె.పి.జయస్వాల్‌, కె.ఎ.నీలకంఠశాస్త్రి, ఎస్‌.కృష్ణస్వామి అయ్యంగార్‌, దినేష్‌చంద్ర సర్కార్‌ లాంటి చరిత్రకారుల రచనల్లో రాజ్యాలు, రాజ వంశాల గురించి బోలెడు సమాచారం దొరుకుతుంది. అమిత్‌షా దృష్టిలో విస్మృత రాజవంశాలు ఉన్నాయేమో గానీ చరిత్రకారుల దృష్టిలో పెద్దగా లేవు. విస్మృత ప్రజల గాథలు జీవన పోరాటాలు ఎన్నో ఉన్నాయి.

మతవాద దృష్టితోనో, కులవాద దృష్టితోనో, సంకుచిత ప్రాంతీయవాద దృష్టితోనో చరిత్రను తిరగరాసే రాజకీయ అవసరం చరిత్ర రచనకు పెద్ద శాపంగా మారింది. ప్రజల పాత్రను మరుగున పెట్టి రాజవంశాల చిట్టాలతో సంకుచిత దృష్టితో వెలిగిపోతున్న చరిత్రలే విభజన రాజకీయాలకు ఉపయోగపడుతున్నాయి. బ్రిటీష్‌ అధికారులు మన చరిత్రకు చేసిన కృత్రిమ విభజనను పేర్లు మార్చి ఇంకా కొనసాగిస్తున్నాం. బ్రిటీష్‌ అధికారి జేమ్స్‌మిల్‌.. హిందూ, ముస్లిం, బ్రిటీష్‌ యుగాలుగా మన చరిత్రను విభజించాడు. పాలకుల మతాల ఆధారంగా చరిత్రను విభజించటం ఆనాడే మొదలైంది. ఆ తర్వాత ఆ యుగాల పేర్లకు స్వస్తి చెప్పినా సారంలో మార్పులేకుండా ఆ తరహా చరిత్రలనే మనకు నూరిపోశారు. మత కోణంతో రాసిన చరిత్రలే విభజన ఆలోచనలకు ఇప్పటికీ ఊపిరులు ఊదుతున్నాయి.

రాజకీయాలకు చరిత్ర రచన ఎప్పుడూ దూరంగాలేదు. అందుకే ఏ రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను తిరగ రాయాలనుకుంటున్నామో చాలా ముఖ్యమైంది. తమ పాలనను సమర్థించుకోటానికి తమకు ముందున్న మొగలాయిలు, సుల్తానుల పాలనను క్రూరయుగంగా మతోన్మాద పాలనగా బ్రిటీష్‌ పాలకులు ముద్రవేశారు. తమ హయాంలోనే భారత్‌లో బాధ్యతాయుత పాలన మొదలైందనీ, సొంతంగా పాలించుకునే శక్తి సామర్థ్యాలను భారతీయులకు అలవర్చే మహత్తర నాగరిక బాధ్యతను తలకెత్తుకున్నామని చెప్పారు. ఆ వాదనను అంగీకరిస్తే బ్రిటీష్‌ పాలనను వ్యతిరేకించే రాజకీయ ఆయుధమే మనకు లేకుండా పోయేది. స్వపాలన కోసం ప్రయత్నించటానికి తర్కమే ఉండేది కాదు. జాతీయ ఉద్యమ కాలంలో రాజకీయ అవసరాల కోసం మన ప్రాచీన చరిత్ర అంతా స్వర్ణయుగమేనని చెప్పటానికి చరిత్రకారులు చాలా ప్రయత్నించారు. జాతిని తట్టిలేపటానికి అవసరమైన ఉత్తేజపూరిత సంఘటనల సమాహారంగా చరిత్ర రచన ఆనాడు కొంతవరకూ సాగింది. అప్పటి అవసరాలను అది తీర్చినా హేతుబద్ధమైన చరిత్రగా స్థాయిని దక్కించుకోలేదు.

ప్రతి దేశ చరిత్రలోనూ ఖండించాల్సినవి, ఆమోదించాల్సినవి, పరిస్థితులకు అనుగుణంగా సంస్కరించి వాడుకోదగిన అంశాలూ విలువలూ ఉంటాయి. ప్రజల కోణం నుంచి చరిత్రను ఆ తీరులో పరామర్శించినపుడు ఉత్తేజం పొందగలిగే చరిత్ర మన ముందు నిలబడుతుంది. మెరుగైన సమాజం కోసం ప్రయత్నించటానికి మన చేతిలో అస్త్రం అవుతుంది. ఈనాటి దేశ సరిహద్దులో పుట్టిన రాజుల చరిత్రే మన చరిత్ర అనుకుంటే మనకు మిగిలేది అసంపూర్ణ చిత్రం. భౌగోళిక సరిహద్దులను పరమపవిత్రంగా ఎంచుకునే సంకుచిత ధోరణితోనే ఆర్యులు బయటి నుంచి వచ్చారనే వాస్తవాన్ని కూడా విస్మరించే చరిత్రకారులు మనకున్నారు. ఇక ఆఫ్రికా నుంచే మనుషుల అడుగులు మొదలై ఖండాఖండాల్లోనూ ప్రయాణించి పలు ప్రాంతాల్లో కుదురుకున్నారని ఇటీవలే వెలుగులోకి వచ్చిన నిజాన్ని మన్నించని మహానుభావుల సంఖ్యా మనకు తక్కువ కాదు. చరిత్ర ఏకదిశ ప్రవాహం కాదు. ఏకశిలా సదృశం అసలే కాదు. గొప్పగొప్పవన్నీ భారతదేశం నుంచి వెలుపలకు వెళ్లినవే తప్ప లోపలకి వచ్చినవేవి లేవనుకుంటే మన సాంస్కృతిక చిత్రంలో చాలా ఆకారాలు కన్పించవు. చాలా ముఖాలు కాంతి విహీనం అవుతాయి. సంస్కృతుల మధ్య సంపర్కం, సంఘర్షణ, సమన్వయం అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంటాయి. ఆ అవిచ్ఛిన్నతను ప్రతిబింబించటానికే చరిత్రను తిరగరాయాల్సిన అవసరం ఉంది.

రాహుల్‌ కుమార్‌

(ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌)

Updated Date - 2022-12-09T00:48:41+05:30 IST