నీటిగింజల పంట

ABN , First Publish Date - 2022-09-26T06:15:29+05:30 IST

ఇది గిజిగాని పచ్చని వెన్నెలగూడు మాలాంటి చెమట పిట్టలకు మంటి ఆకాశం! విషాదమేమిటంటే ఎగిరే రెక్కలూ మావికావు ఎగరేసే చేతులూ మావికావు...

నీటిగింజల పంట

ఇది గిజిగాని పచ్చని వెన్నెలగూడు

మాలాంటి చెమట పిట్టలకు 

మంటి ఆకాశం!

విషాదమేమిటంటే

ఎగిరే రెక్కలూ మావికావు

ఎగరేసే చేతులూ మావికావు 


ఆశల్ని అనుసరిస్తూనో

ఆకలిని వెంబడిస్తూనో

నడిచే పాదాలే తప్ప

నడిపించే పాదాలే పుట్టని చోట

స్వప్నాలు రాలే బోడిచెట్టు కింద

ఊగుతున్న ఖాళీకుర్చీ న్యూనత

ఇప్పటి మా వలస కంపు శోకం 


పెదవులు పగిలిన పొలాల నోటివెంట 

భళ్ళున కారే నాగలి రక్తం

ఇక్కడొక తెరిపిలేని దుఃఖం దాఖలా 


నాగధార రెప్పల కిందున్న

నీటిగింజల పంటకు

బొడ్డుపేగు తెగ్గోస్తున్న 

యిసుక పూల జిగటలో

మా పేద రంగు బతుకు

సుంకం లేని ఒక ఎగుమతి సరుకు 


బబుల్‌ ర్యాపర్లో చుట్టినా

పగిలిపోదనే భరోసా లేని

గాజువస్తువు కొరియర్‌ పార్సిల్లాంటిదే

మా బతుకుల్ని కూల్చే 

తుపాను కర్మాగారపు అలల పోటు 


మేతకొచ్చే మేఘాలే తప్ప

కురిసి పోయేవేవీ ఇటు చూడని

చినుకు భ్రమల వరదగుడి

మబ్బులు మింగిన మా కొండపల్లం 


ఎర్రటి కన్నీటి పోగులు..

బూజురు జెండాలయి తలవాల్చినా

చేరిపేయలేని త్యాగాల చరిత్ర మాది

గుండెగిన్నెలో పెచ్చుగట్టిన

ఈ వెలుతురు మీగడ 

మాకొక మెలకువ గీతం 


సూర్యుడు నిదుర లేవాలన్నా 

పరగడుపున మా చెమట చుక్కలు కొన్ని

అతడి గొంతులో పడాల్సిందే!

మా రెక్కల్ని మేం నమ్ముకోవాలే గానీ

నింగినీదడం పెద్ద కష్టమేంగాదు మాకు!

కంచరాన భుజంగరావు

94415 89602

Read more