యుద్ధమూ ఒక వ్యాపారమే..!

ABN , First Publish Date - 2022-03-04T06:45:59+05:30 IST

యివాళ.. యుద్ధదేవత వికటాట్టహాసానికి గుక్కపట్టి ఏడుస్తున్న భూగోళాన్ని భుజానకెత్తుకొని ఎవరు దారుస్తారు? ప్రభువులు..

యుద్ధమూ ఒక వ్యాపారమే..!

యివాళ.. 

యుద్ధదేవత వికటాట్టహాసానికి

గుక్కపట్టి ఏడుస్తున్న భూగోళాన్ని 

భుజానకెత్తుకొని ఎవరు ఓదారుస్తారు?


ప్రభువులు.. బుర్రలో పురుగు కదిలినపుడు

యుద్ధాలు ప్రకటిస్తారు 

దానికి.. సార్వభౌమత్వమని పేరు పెడతారు!


అంతే.. నడివీధుల్లో ఉన్నట్టుండి

ఉవ్వెత్తున దేశభక్తి ప్రవహిస్తుంది

దేశాలమధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయి!


అంతటా.. కర్ఫ్యూ అమలయ్యేవేళ

ఆయుధ వ్యాపారులు మాత్రమే

దుఖాణాలు తెరుస్తారు 

వాళ్లకు యుద్ధమూ ఒక వ్యాపారమే..!


ఒక క్షిపణి.. ఒక వీరుడి 

తల్లిపేగును తెంచిపారేస్తుంది 

మరో శతఘ్ని.. ఒక కొత్త పెండ్లికూతురు 

నుదుటసూరీడ్ని తుడిచేసి పోతుంది 

ఒంజిపెట్టి కోసినట్టు 

యింకో యుద్ధవిమానం.. 

వేల తాళిబొట్టుల్ని 

ఒకేసారి తెంపుకుపోతుంది!


ఇళ్లు.. వల్లకాళ్లవుతాయి 

కనిపించిన నేలంతా గాయపడీ

ధూళితో.. నెత్తుటితో తడిసిపోతుంది 

వికృతక్రీడ ఆడీఆడీ.. విసుగొచ్చిన ఏలికలు

కాసేపటికి విరామం ప్రకటిస్తారు!


తెల్లజెండాలు ఎగరేస్తారు 

విరిచిన రెక్కలకు ఉమ్మితడి పూసీ

‌పావురాలు విడిచిపెడతారు

మళ్లీ పరస్పర కరచాలనాలు చేసుకుంటారు!


రహస్య ఒప్పందాలు అమల్లోకొస్తాయి 

స్టాక్ మార్కెట్లు మళ్లీ రంకెలేస్తాయి 

కార్పొరేట్ల వాకిట్లో

లాభాలపంట పండుతుంది 

వేలాది మృతుల మృత్తికలతో..!


సైనికుడిది ఒక మరణమే.. 

కానీ.. సామాన్యుడిది నిత్య మరణం 

యుద్ధం ముగిసాకే.. అతడికి

అసలు యుద్ధం మొదలవుతుంది!!

సిరికి స్వామినాయుడు

Read more