భవిష్యత్తునూ భయపెడుతున్న ట్రంపు భూతం!

ABN , First Publish Date - 2022-07-21T06:18:09+05:30 IST

సాధారణ ఎన్నికలు జరిగి మూడేళ్లు దాటిపోయింది కాబట్టి, 2024 కోసమని మనదేశంలోని రాజకీయవర్గాల్లో ఒక ఆలోచన, కొంత హడావిడి మొదలయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు...

భవిష్యత్తునూ భయపెడుతున్న ట్రంపు భూతం!

సాధారణ ఎన్నికలు జరిగి మూడేళ్లు దాటిపోయింది కాబట్టి, 2024 కోసమని మనదేశంలోని రాజకీయవర్గాల్లో ఒక ఆలోచన, కొంత హడావిడి మొదలయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. రెండోసారి గెలిచిన ప్రభుత్వానికి వ్యతిరేకత గండం మరింత ఉంటుంది. కాస్త అప్రమత్తంగా ఉండాలని అధికారపక్షమూ, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతిపక్షాలూ ప్రయత్నించడం సహజం. 


శ్వేతభవనంలోకి అడుగుపెట్టి, పట్టుమని పద్దెనిమిది మాసాలు కాకమునుపే, అధ్యక్షుడు జో బైడెన్ వారసుడెవరు అన్న ప్రశ్న అమెరికన్ సమాజాన్ని వేధించడం మొదలుపెట్టింది. డొనాల్డ్ ట్రంప్ తన అధికారకాలంలోను, 2020 ఎన్నికల సందర్భంగాను సృష్టించిన కల్లోల వాతావరణం ఇంకా వెంటాడుతూనే ఉన్నది. అది కల్లోలం కాదు, ఉత్తమ పరిపాలన అని అనుకునేవారి సంఖ్య సామాన్యంగా ఏమీలేదు. తమ దగ్గర నుంచి అధికారాన్ని అపహరించారని, 2020 ఎన్నికలు బూటకమని రిపబ్లికన్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ట్రంప్ మరోసారి అధ్యక్ష అభ్యర్థి అవుతారని, అవ్వాలని కూడా కోరుకుంటున్నారు. ఈ చర్చ అంతా కూడా, కొంత భయంతోను, కొంత కుతూహలంతోనూ జరుగుతోంది.


బైడెన్ జనాదరణ బాగా తగ్గిపోతున్నట్టు ఈ మధ్య జరిగిన ఒక సర్వే చెబుతోంది. ‘న్యూయార్క్ టైమ్స్ – సీనా కాలేజీ’ జరిపిన ఆ సర్వే, కేవలం బైడెన్ ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రాటిక్ పార్టీ ఓటర్లలోనే జరిగింది. నూటికి 64 మంది వచ్చే ఎన్నికలలో డెమొక్రాటిక్ పార్టీ కొత్త అధ్యక్ష అభ్యర్థిని ఎంచుకోవాలని ఈ సర్వేలో సూచించారు. అయితే, 2024లో డొనాల్డ్ ట్రంప్ కనుక మళ్ళీ రిపబ్లికన్ అభ్యర్థి అయితే మాత్రం బైడెన్‌కు ఓటు వేస్తామని 90 శాతం మంది డెమొక్రాటిక్ ఓటర్లు చెప్పారు. ఈ సర్వే వెల్లడి తరువాత, మీడియా అంతటా బైడెన్ పనితీరు సమీక్షలు పెరిగిపోయాయి. ఎక్కడికి వెళ్లినా బైడెన్‌కు ఇవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా మీరు నిలబడతారా, ట్రంప్ నిలబడితే తలపడతారా అని ఇజ్రాయెల్ మీడియా కూడా అడిగింది. ట్రంప్ ప్రత్యర్థి కానీ, కాకపోనీ, బైడెన్‌కు మళ్ళీ పోటీపడాలని ఉన్నది. కానీ, మన దేశంలోవలె, అక్కడ, ప్రభుత్వాధినేతే, అధికార పార్టీ ఎంపికలను ఏకపక్షంగా చేయలేరు. అదొక దశలవారీగా జరిగే ప్రజాస్వామిక ప్రక్రియ. ప్రభుత్వ పనితీరు మీద పార్టీ అభిమానుల్లో, సాధారణ ఓటర్లలో ఉన్న అభిప్రాయం, విజయావకాశాలు, నాయకత్వ లక్షణాలు వంటి అనేక అంశాలు అభ్యర్థి తుది ఎంపికను ప్రభావితం చేస్తాయి. అధ్యక్ష అభ్యర్థి నిర్ధారణకు ఇంకా రెండేళ్ళ వ్యవధి ఉన్నది.


సంప్రదాయవాదం, తిరోగమనవాదం వెనుకబడిన దేశాలలో, ఇంకా పూర్తి ఆధునికం కాని దేశాల్లో అధికంగా ఉంటాయని అనుకుంటాము. అది నిజం కాదని అమెరికన్ సమాజాన్ని చూస్తే అర్థం అవుతుంది. ఇక్కడ రిపబ్లికనిజం, శ్వేతజాతి అహంకారానికి, మతతత్వానికి, కాలం చెల్లిన విలువలకు ప్రతినిధిగా మారుతూ వచ్చింది. ట్రంప్ ఆ క్రమానికి ప్రతినిధి, ప్రోత్సాహకుడు కూడా. ట్రంప్ స్థిరపరచిన విలువలు లోలోతులకు పాతుకుపోయాయి. ట్రంప్ చేసిన నియామకాలు, ముఖ్యంగా న్యాయవ్యవస్థలో చేసిన నియామకాలు వికృత ఫలితాలను ఇస్తున్నాయి. గర్భస్రావ నిషేధానికి అనువుగా గతనెలలో అమెరికన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, అనంతరం వివిధ రిపబ్లికన్ రాష్ట్రాలు చేసిన చట్టాలు పెద్ద సామాజిక కలవరానికి కారణమవుతున్నాయి. పదిసంవత్సరాల బాలిక లైంగిక దాడికి గురయి, గర్భవతి అయిన సంఘటనలో, గర్భస్రావం కోసం నిషేధం లేని డెమొక్రటిక్ రాష్ట్రానికి వెళ్లవలసి రావడం మీద న్యాయస్థానాల్లోనూ, బయటా కూడా పెద్ద చర్చ జరిగింది. అమెరికా పట్టింపును చూస్తే, ఎటువంటి విధినిషేధాలు లేకుండా, అవసరాన్ని బట్టి, కొన్ని నిబంధనలకు లోబడి, గర్భస్రావాన్ని భారతదేశం ఏనాడో అనుమతించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.


గర్భస్రావ పిండాల నుంచి సేకరించిన కణసముదాయాన్ని పరిశోధనలో ఉపయోగించారన్న కారణంతో కొందరు సైనికులు కొవిడ్ టీకాలను నిరాకరించడంపై అమెరికాలో పెద్ద చర్చ జరుగుతోంది. సైనికదళాలలో టీకా తప్పనిసరి అయినందున, కొన్ని వేలమంది టీకాను నిరాకరించి ఉద్యోగాలు కోల్పోనున్నారు. దూడల రక్తం కొన్ని టీకాల తయారీలో ఉపయోగిస్తారన్న వార్తలు భారతీయ సమాజంలో పెద్ద కలవరం కలిగించలేదన్నది ఈ సందర్భంగా గుర్తుకురావాలి. అమెరికాలో కొవిడ్ వ్యాప్తికి రిపబ్లికన్ రాష్ట్రాల ప్రజల సహాయనిరాకరణ కూడా కారణమన్న వాదన ఉన్నది. టీకాలు ఉపయోగకరమా, ప్రమాదకరమా అన్న ప్రశ్న నుంచి కాదు వారి వ్యతిరేకత, అసలు కొవిడ్ వైరసే మిథ్య అన్నది రిపబ్లికన్ల వాదన. డెమొక్రాట్లు మాత్రమే మాస్కులు నిష్ఠగా ధరిస్తారన్నది ఒక అభిప్రాయం. మన దేశంలో పెరుగుతున్న ‘రిపబ్లికనిజం’ రీత్యా, అమెరికా ఉదాహరణల నుంచి అప్రమత్తం కావాలి. భారతీయ ఉదాహరణల ప్రభావం అక్కడ కూడా ఉన్నదనుకోండి.


రాజకీయంగా డెమొక్రాట్ల పాలన వచ్చినా, సమాజంలో లోలోతులకు ట్రంపిజమ్ చొచ్చుకుపోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న రకరకాల మధ్యంతర ఎన్నికలలో ట్రంప్ మద్దతుదారులే రిపబ్లికన్ అభ్యర్థులుగా ఎంపిక అవుతున్నారు. ట్రంప్ జైత్రయాత్ర కొనసాగితే, అతనితో పోటీ పడదగిన అభ్యర్థి డెమొక్రాటిక్ పార్టీలో ఎవరూ లేరు, బైడెన్ తప్ప. పాపం, 1980ల నుంచి అనేకమార్లు అధ్యక్ష అభ్యర్థి కాబోయి, చివరకు 2020లో అవకాశం పొందిన బైడెన్ ప్రఖ్యాతి అంతా ట్రంప్‌ను పడగొట్టడంతోనే ముడిపడిపోయింది. ఆ ఎన్నిక అబద్ధం అనీ, అపహరణ అనీ రిపబ్లికన్లు అంటున్నారు కాబట్టి, మరోసారి గెలిచి చూపడం తనకు నైతికంగా అవసరమని బైడెన్ అనుకుంటున్నారు. తాను గెలిచి చూపడం ద్వారా 2020 ఎన్నిక బూటకం అని నిరూపించాలని ట్రంప్ అనుకుంటున్నారు. ట్రంప్ గెలిస్తే, అమెరికన్ సామాజిక, ప్రజాస్వామిక విలువలకు పెనుప్రమాదం అని అక్కడి ఉదారవాదులు భయపడుతున్నారు. రిపబ్లికన్ పార్టీలో కూడా మరొక బలమైన అభ్యర్థి పేరు ఇప్పటికయితే వినిపించడం లేదు.


విలువల ఘర్షణ ఒకపక్కన జరుగుతుండగా, ద్రవ్యోల్బణం అమెరికాను అతలాకుతలం చేస్తున్నది. ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచదేశాలన్నిటితో పాటు అమెరికాను నష్టపరుస్తున్నది. ఇన్నిన్ని పన్నులు, సుంకాల తరువాత భారత్‌లో పెట్రో ఉత్పత్తుల ధరలు ఎట్లా ఉన్నాయో అమెరికాలోనూ దాదాపుగా అంతే ఉన్నాయి. కొవిడ్ కారణంగా దెబ్బతిన్న ఆర్థికరంగం కోలుకోలేదు. వడ్డీరేట్లు పెరిగిపోతున్నాయి. నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. ఈ పరిణామాలకు బైడెన్ పద్దెనిమిది నెలల పాలన ఏ రకంగానూ కారణం కాకపోయినా, సాధారణ అమెరికన్ అటువంటి విచక్షణ చూపించలేడు. ట్రంప్ చేసిన చెడుగులను కొన్నిటిని అయినా చెరిపివేయాలని బైడెన్ ప్రయత్నించారు కానీ, ఆయనకు సెనెట్‌లో సహకారం లభించడం లేదు. రాజకీయ విభేదం లేకుండా అందరూ సమర్థించవలసిన అంశాల విషయంలో కూడా బైడెన్‌కు సహాయనిరాకరణే ఎదురవుతున్నది. 2021 జనవరిలో కేపిటల్ హిల్ మీద జరిగిన దాడి నేపథ్యం గురించిన విచారణలో అనేక సత్యాలు వెల్లడవుతున్నాయి, సత్యాన్ని మరుగుపరిచేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు కూడా బట్టబయలవుతున్నాయి. ఆ విచారణ క్రమం తప్ప ట్రంప్ ప్రభావాన్ని బలహీనపరిచే పరిణామాలేమీ జరగడం లేదు. బైడెన్ మంచి బాలుడు. సాత్వికంగా మెలగాలనుకుంటాడు. అసమర్థతో, సహకారలోపమో మంచిపనులూ చేయలేడు. మెతకదనం వల్ల ట్రంప్‌కు గురిపెట్టే రాజకీయమూ నడపలేడు. ట్రంప్ పేరు కూడా ప్రస్తావించడు బైడెన్. ‘మునుపటాయన’ అంటాడు.


ఇంటి సంగతి తరువాత చూద్దాం, రచ్చలో అయినా గెలుద్దాం అని బైడెన్ పశ్చిమాసియా పర్యటనకు వెళ్లాడు. ఉక్రెయిన్ ఆక్రమణ తరువాత జపాన్‌లో క్వాడ్ సమావేశం పెట్టి, ప్రతిష్ఠను కాపాడుకునేందుకు చేసినటువంటి ప్రయత్నమే ఇది కూడా. సౌదీ అరేబియా, యుఎఇ ఇజ్రాయిల్‌తో సంబంధాలకు సిద్ధపడుతున్నమాట నిజమే కానీ, అది మొత్తంగా అమెరికా ప్రయోజనాల కోసం ఉద్దేశించింది కాదు. సౌదీ, ఇతర అరబ్ దేశాలు ఇరాన్‌తో కూడా పూర్వ వైరాన్ని కొనసాగించడానికి సుముఖంగా లేవు. ఇజ్రాయిల్‌తో ఒక మాట, పాలస్తీనా అధ్యక్షుడితో మరో మాట వల్ల ఫలితం ఏమీ లేకపోయింది. జమాల్ ఖషొగ్గి అనే అసమ్మతివాదిని చంపింది నువ్వేనట కదా అని తాను సౌదీ రాజును అడిగానని బైడెన్ చెప్పుకున్నాడు. అవును, ఆయన అడిగారు, ఇరాక్‌లో అబూ గ్రాయిబ్ జెయిల్‌లో మీరు చేసింది మాత్రం మానవహక్కుల ఉల్లంఘన కాదా అని మేము ఆయనకు జవాబిచ్చాము అని సౌదీ ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు. పాలస్తీనా అధ్యక్షుడిని కలిసిన మరునాడే, ఆ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానిస్తూ, ట్రంప్‌కు చిరునవ్వు జోడిస్తే బైడెన్ అవుతారు అని అన్నారు. రష్యా నుంచి కానీ, ఇరాన్ నుంచి కానీ దూరంగా ఉండడానికి అరబ్ దేశాలేవీ హామీ ఇవ్వకుండానే బైడెన్ తిరిగి వచ్చారు. ఆయన వాషింగ్టన్ డిసి చేరారో లేదో రష్యా అధినేత పుతిన్ ఇరాన్‌కు వెళ్లాడు. ఇక్కడ, ఉక్రెయిన్ ప్రథమ మహిళకు బైడెన్ పుష్పగుచ్ఛం ఇస్తున్న సమయంలోనే, ఇరాన్ అధ్యక్షుడు ఉక్రెయిన్ ఆక్రమణ ఎంతటి ధర్మబద్ధమో చెబుతున్నాడు.


ఇంటా బయటా కూడా ఏమంత అనువైన వాతావరణం లేని స్థితిలో బైడెన్ ప్రయాణం సాగుతోంది. హుందా, మృదువైన నడవడికే ఆయనకు సానుకూలత అవుతుందా, లేదా, సమాజం మరొక విదూషక ప్రతినాయకుడినే కోరుకుంటుందా చూడాలి!


కె. శ్రీనివాస్

Read more