‘భావోద్వేగాల’ పాచికతో ఉత్తరాంధ్రకూ ఎసరు!

ABN , First Publish Date - 2022-09-28T10:13:15+05:30 IST

చరిత్ర పునరావృతమవుతోంది. రాయలసీమలో గత మూడేళ్లుగా జరిగిందే ఇప్పుడు ఉత్తరాంధ్రలోనూ మొదలైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజకీయ జన్మ ఇచ్చిన రాయలసీమలో...

‘భావోద్వేగాల’ పాచికతో ఉత్తరాంధ్రకూ ఎసరు!

చరిత్ర పునరావృతమవుతోంది. రాయలసీమలో గత మూడేళ్లుగా జరిగిందే ఇప్పుడు ఉత్తరాంధ్రలోనూ మొదలైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజకీయ జన్మ ఇచ్చిన రాయలసీమలో గత మూడేళ్లుగా న్యాయ రాజధాని పేర భావోద్వేగాలను రగిల్చారు. సీమ వాసులు ‘కామోసు’ అని సంబరపడ్డారు. తుదకు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండిన కృష్ణ యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో నెలకొల్పాలని చేసిన డిమాండుకే గతిలేని పరిస్థితి దాపురించిన తర్వాతగాని సీమ వాసులకు అసలు విషయం బోధపడలేదు.


గత ప్రభుత్వాలు మొదలుపెట్టిన సాగునీటి పథకాలు అటుంచితే, జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత 2019లో పునాదిరాళ్లు వేసిన ప్రాజెక్టులకు కూడా నిధులు లేవు. కొన్ని అంతర్ రాష్ట్ర జల వివాదం పేర కొండెక్కించారు. తిరిగి మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన తర్వాత సీమలో హైకోర్టు డిమాండు పుంజుకుంటున్నా ఎక్కువమంది అమరావతిలోనే పరిపాలన రాజధాని ఉండాలని కోరుకోవడం సరికొత్త పరిణామం. రాయలసీమకు 800కి.మీ. దూరంలో ఉండే విశాఖపై సానుకూలత వ్యక్తం కావడం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద మైనస్.


ఇప్పుడు ఉత్తరాంధ్ర వంతు వచ్చింది. ఇంకెవరైనా మాట్లాడితే వేరు గాని సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసనసభలోనే ఉత్తరాంధ్ర వాసులకు భావోద్వేగాలు ఉండవా? అని ప్రశ్నించారు. పక్కనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ‘అలాయ్ బలాయ్’ ఆడుతున్నారు కాబట్టి ఆయన్నుంచి జగన్మోహన్ రెడ్డి ఆ మాత్రం భావోద్వేగాల సిద్ధాంతాన్ని వంటబట్టించుకోవడంలో ఆశ్చర్యం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనను వికేంద్రీకరణ చేస్తారో లేక అభివృద్ధిని వికేంద్రీకరణ చేయదలచారో అన్నది పక్కనపెడితే, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి విశాఖను పరిపాలన రాజధాని చేస్తే సరిపోతుందని వైకాపా మంత్రులు నేతలతో పాటు ముఖ్యమంత్రి పదేపదే చెబితే నమ్మేందుకు ఉత్తరాంధ్ర వాసులు చెవిలో పూలు పెట్టుకొని లేరు. రాయలసీమవాసుల కన్నా ఉత్తరాంధ్ర వాసులు పాలకులను నిలదీసే రోజు ముందుగానే వస్తుందేమో! ఇప్పటికే పలువురు మేధావులు గోదావరికి వచ్చే తమ ప్రాంతంలో పడే వర్షపు వరద నీరు తమకు దక్కడం లేదని ఆందోళన వెలిబుచ్చారు.


ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధాని పెట్టి దాన్ని బంగారుసీమ చేస్తామని చెబుతున్న మంత్రులు గుడివాడ అమరనాథ్ గాని, ధర్మాన ప్రసాదరావు గాని, సీదిరి అప్పలరాజు గాని ఉత్తరాంధ్రలోని పాత మూడు జిల్లాల్లో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందించే ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం’ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా కొండెక్కిస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ మూడేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంపై పైసా ఖర్చు పెట్టలేదు. ఉత్తరాంధ్ర పాత మూడు జిల్లాల ప్రజల ఆర్థిక సామాజిక జీవితాలను పూర్తిగా మార్చే శక్తి ఉన్న ఈ పథకం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిష్క్రియపరత్వాన్ని ప్రజలు కేవలం ‘పరిపాలన రాజధాని’ పేరిట భావోద్వేగాలకు ఎర వేసినంత మాత్రాన మర్చిపోతారా?


శ్రీకాకుళం జిల్లావాసుల చిరకాల వాంఛయైన వంశధార–నాగావళి నదుల అనుసంధానంతో పాటు, నేరెడి బ్యారేజీ నిర్మాణం గురించి పట్టించుకోకుండా, కేవలం విశాఖలో రాజధాని పెట్టి శ్రీకాకుళం జిల్లా రైతులను సంతృప్తిపర్చగలమని మంత్రి అప్పలరాజు భావిస్తున్నారా?


తనకు 25 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించి ఇస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పి అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి తుదకు చట్టబద్ధత గల పోలవరం ప్రాజెక్టు రెండవ డిపిఆర్ ఆమోదం ఇంత వరకు పొందలేకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ నుంచి రాష్ట్రానికి వచ్చిన లేఖ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి శాశ్వతంగా ముగింపు పలికే విధంగా ఉంది. పోలవరం ప్రాజెక్టు తొలిదశ 41.15 మీటర్ల వరకు నీళ్లు నిల్వచేసేందుకు ఎంత వ్యయం అవుతుందో తెలియజేయమని, అందులో నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని మినహాయించి ప్రతిపాదనలు పంపమని ఈ లేఖలో కోరారు. కేంద్ర ప్రభుత్వం రెండవ డిపిఆర్ ఆమోదించకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 41.15 మీటర్లకే పరిమితం చేసేందుకు సిద్ధమౌతుంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి వీర తాళ్లు వేసుకుంటున్న మంత్రులు నోరు ఎందుకు విప్పడం లేదు? కేవలం ముఖ్యమంత్రి చెబుతున్నట్లు భావోద్వేగాలతోనే ఉత్తరాంధ్ర జిల్లాల రైతుల కడుపు నింపగలరా?


పోలవరం ఎడమ కాలువ సిల్ లెవల్ 40.54మీటర్ల మాత్రమే. అంటే పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత నిర్మాణం 41.15మీటర్లకు పరిమితం చేస్తే ఎడమ కాలువకు గ్రావెటీతో నీళ్లు తరలించగలరా? ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కేటాయించిన 63.2టియంసిలు గాని తుదకు విశాఖ తాగునీటికి కేటాయించిన 23.99 టియంసిల నీరు పోలవరం నుండి దక్కే అవకాశాలు పూర్తిగా మూసుకుపోతాయి కదా? ఇంత జరుగుతున్నా ఉత్తరాంధ్ర మంత్రులు క్షేత్రస్థాయి రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తెచ్చే సాగునీటి ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు?


ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం అమలు జరగాలంటే పురుషోత్తమపట్నం వద్ద తొలి ఎత్తిపోతల నిర్మాణం జరగాలి. తిరిగి పాపయ్యపాలెం వద్ద రెండవ ఎత్తిపోతలు మూడవ దశలో 19.70 టియంసిలు నీటి నిల్వ సామర్థ్యంతో నాలుగు రిజర్వాయర్ల నిర్మాణం జరగాలి. ఇవి ఇప్పటి వరకు ఇంచి కదలలేదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం అమలు జరిగితే విశాఖ జిల్లాలో 3.21 లక్షల ఎకరాలకు, విజయనగరం జిల్లాలో 3.94 లక్షల ఎకరాలకు, శ్రీకాకుళం జిల్లాలో 0.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 30 లక్షల మందికి తాగునీరు సరఫరా జరుగుతుంది.


2009లో ఈ పథకం నిర్మాణ వ్యయం రూ.7,214.10 కోట్లు కాగా ప్రస్తుతం దీని వ్యయం దాదాపు రూ.17వేల కోట్లకు చేరింది. మొన్న శాసనసభలో లక్షా అరవై ఐదు వేల కోట్ల రూపాయల బటన్ నొక్కి లబ్ధిదారులకు చేర్చానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కనీసం పదివేల కోట్ల రూపాయల ఈ పథకంపై వ్యయం చేసేందుకు ఎందుకు మనసు రాలేదు? ఈ ప్రశ్న ఉత్తరాంధ్ర జిల్లాల రైతులు వేసే రోజు రాకపోదు? తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అమ్మ ఒడి, రైతు భరోసా లాంటి పథకాలు ఉత్తరాంధ్రలో అవసరమైన ఓటు బ్యాంకును తెచ్చిపెట్టలేవని భావించ బట్టే నేడు ముఖ్యమంత్రి భావోద్వేగాల అస్త్రాన్ని ఆశ్రయించవలసి వచ్చిందేమో.


ఇక శ్రీకాకుళం జిల్లా వాసుల కన్నీటికి విలువ కట్టే షరాబు లేడు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే శ్రీకాకుళం జిల్లా వాసుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. నీళ్లు నీళ్లు అని నిద్రలో కూడా కలవరించే రాయలసీమలో సగటు వర్షపాతం 500 మిల్లీమీటర్లయితే శ్రీకాకుళం జిల్లా సగటు వర్షపాతం 1400 మిల్లీమీటర్లు. దురదృష్టమేమంటే పడిన వర్షం నీరు అంతా సముద్రం పాలౌతోంది. తిరిగి ప్రజలు నిత్య దరిద్రంతో వలసలు వెళ్లవలసి ఉంటోంది. అరేబియా సముద్రంలో చేపల వేట సందర్భంగా ప్రమాదానికి లోనైనావారు శ్రీకాకుళం వాసులుగా వుంటారు. వంశధార–నాగావళి నదులు అనుసంధాన పథకంతో పాటు అంతర్ రాష్ట్ర వివాదమున్న నేరెడి బ్యారేజీ నిర్మాణం జరిగితే ఈ జిల్లా ప్రజల ఆర్థిక సామాజిక వ్యవస్థ ఎంతో కొంత మార్పు చెందుతుంది. అంతేకాని, విశాఖలో రాజధాని పెడితే కాదు.


ఇతర జిల్లాలతో పోల్చుకొంటే శ్రీకాకుళం జిల్లాలో చిన్న చితక నదులు ఎక్కువ. వంశధార, నాగావళి నదులతో పాటు మహేంద్ర తనయ (వంశధార ఉపనది), గోముఖి, చంపావతి, వేగవతి, బహుదా, కుంబికోట, గెడ్డ ఇలా చాలా నదులు ఉన్నా ఈ నదుల నీరు సముద్రం పాలు కావడం శ్రీకాకుళం జిల్లా వాసులకు శాపంగా మారింది. కాని ఈ జిల్లా మంత్రి సీదిరి అప్పలరాజుకు ఇవేవీ పట్టడం లేదు.


వంశధార ట్రిబ్యునల్ 2021లోనే తన తుది తీర్పు ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లా ప్రజల ఆశలు నెరవేరేలా నేరెడి బ్యారేజీ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. కేవలం ఒడిషాలో 106ఎకరాలు నీట మునుగుతుందని అందుకు ఒడిషా అంగీకరించాలని తీర్పు చెప్పింది. కాని ఒడిషా తీర్పు నోటిఫై కాకుండా సుప్రీంకోర్టు నుండి స్టే తెచ్చింది. రెండేళ్లు గడుస్తున్నా ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశం సీరియస్‌గా తీసుకొని ఒడిశాతో చర్చలు జరపలేదు. కొసమెరుపు ఏమంటే గత జల సేతుబంధం అన్నట్లు రెండేళ్ల కాలం గడిపేసి విశాఖ రాజధాని అంశం ఇప్పుడు ముగ్గులోనికి వచ్చిన తరుణంలో ఈ పాటికే 19.05 టియంసిల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించబడిన హీర మండలం రిజర్వాయరుకు నీళ్లు నింపేందుకు ఒక ఎత్తిపోతల పథకానికి మహేంద్ర తనయ ఫ్లడ్ ఫో కెనాల్‌కు తాజాగా రెండు జీవోలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ప్రస్తుతం టెండర్లు జరిగి అగ్రిమెంట్లు పూర్తయిన పథకాల నిర్మాణానికే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఇప్పుడు జారీ చేసిన జీవోల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 

వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు

Read more