ఎలక్ట్రికల్ వాహన విప్లవానికి ఇది తరుణం

ABN , First Publish Date - 2022-03-16T05:44:52+05:30 IST

రష్యా–ఉక్రెయిన్‌ దేశాల యుద్ధం పర్యవసానంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇదే కొనసాగితే రవాణా వ్యయాలు, నిత్యావసర సరకుల ధరలు అనూహ్యంగా పెరిగి...

ఎలక్ట్రికల్ వాహన విప్లవానికి ఇది తరుణం

రష్యా–ఉక్రెయిన్‌ దేశాల యుద్ధం పర్యవసానంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇదే కొనసాగితే రవాణా వ్యయాలు, నిత్యావసర సరకుల ధరలు అనూహ్యంగా పెరిగి మానవ జీవితం దుర్భరంగా మారుతుంది. రష్యా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద క్రూడాయిల్‌ ఎగుమతిదారు. ఆ దేశం ప్రతి రోజు సుమారు డెబ్భై లక్షల పీపాల ముడి చమురును ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. రష్యాను వ్యతిరేకిస్తున్న అమెరికా, ఐరోపా సమాఖ్యలు రష్యా నుంచి క్రూడాయిల్‌ దిగుమతులపై భారీ కోతలు విధిస్తూ తమ దేశాల్లో తామే ఇంధన కొరతను తీవ్రతరం చేసుకుంటున్నాయి.


ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమక్రమంగా ప్రాచుర్యం పొందుతూ ఉంది. వేగంగా తరిగిపోతున్న ఇంధన నిల్వల మీద ఆధారపడకుండా మన కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి కృషి చేయాలి. అలాగే ఇప్పటికే సాంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా తక్కువ ఖర్చుతో మార్పు చేయడానికి, లేదా సాంప్రదాయ పాత వాహనాలను ఎలక్ట్రిక్‌ వాహనాలతో మార్పిడి చేసుకోవడానికి వీలుగా ఆటోమొబైల్‌ రంగాన్ని ప్రోత్సహించాలి. ఎలక్ట్రిక్ వాహనాలకు అమ్మకపు పన్ను, వాహన పన్నులలో రాయితీలను ఇవ్వాలి. సంక్షేమ పథకాల కింద పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఇకమీదట కొనుగోలు చేసే వాహనాలన్నీ తప్పనిసరిగా ఎలక్ట్రిక్‌ వాహనాలు మాత్రమే అయివుండాలని ఆదేశాలు జారీ చేయాలి. ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి ఖర్చును తగ్గించడానికి ప్రత్యేక కృషి జరగాలి.


పర్యావరణ కాలుష్యాలకు మూలకారణమైన ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి, శబ్ద కాలుష్యాన్ని అదుపుచేయడానికి, రవాణా ఖర్చుల్ని, తద్వారా నిత్యావసర సరకుల ధరల పెరుగుదలను నిలువరించడానికి కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు ఇకమీదట విద్యుత్‌‍తో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ఆటోమొబైల్‌ రంగ పెద్దలతో చర్చించాలి. పబ్లిక్‌ రవాణా వాహనాలు కూడా విద్యుత్‌ తోనే నడిచే విధంగా ప్రోత్సహించాలి.


ఏటేటా తరిగిపోతున్న ఇంధనాల మీద ఆధారపడే బదులు నిరంతరం అతితక్కువ ఖర్చుతో లభ్యమౌతున్న సూర్యశక్తి వినియోగానికి వీలైన ప్రతి చోటా మైక్రోస్థాయి నుండి మెగాస్థాయి వరకు సోలార్‌ ప్లాంట్లను నెలకొల్పాలి. ఈ దిశగా పారిశ్రామిక, వాణిజ్య, ప్రైవేటు సహకార రంగాలను ప్రోత్సహించాలి. అవసరమైతే ఈ విషయంలో ఆంక్షలు విధించినా తప్పులేదు. ఎలక్ట్రిక్ వాహనాల సాంకేతికతను నిరంతరం అభివృద్ధి చేయటానికి శాస్త్రపరిశోధనలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి.


ఎలక్ట్రిక్‌ వాహన వినియోగదారులకు నిర్వహణ సమస్యలు లేకుండా చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేయాలి. ఇందుకోసం పెట్రోలు పంపులు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక సంస్థలు, పార్కింగు స్థలాలను వాడుకోవాలి. వీటి ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధిని కూడా కల్పించవచ్చును. ఈ వాహనాలకు వచ్చే రిపేర్ల కోసం యువతకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి. ఈ శిక్షణ కోసం ఒక ప్రణాళికను రూపొందించి దేశవ్యాప్తంగా అమలు చేయాలి. విప్లవాత్మకమైన ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచడానికి, ఇప్పటి రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ఒక మంచి తరుణం ఈ అవకాశాన్ని వినియోగించుకునే విజ్ఞతను మన ప్రభుత్వాలు ప్రదర్శిస్తాయని ఆశిద్దాం.

డా. యం.వి.జి. అహోబిలరావు

Updated Date - 2022-03-16T05:44:52+05:30 IST