‘‘కథా నిర్వహణ, దృక్పథం దగ్గరే ఈ తరం తడబడుతోంది’’
ABN , First Publish Date - 2022-12-12T00:25:14+05:30 IST
వయసు పరిమితి పెట్టి పుస్తకం తేవడం తెలుగులో తక్కువ కావొచ్చేమో కానీ హిందీ, ఇంగ్లీషులో ఎక్కువ. ఈ మధ్య ‘ఒంటి చెయ్యి’ అనే నా కథ ఒకటి హిందీలో అలాంటి సంకలనంలో ప్రచురితమైంది...

వేంపల్లె షరీఫ్ : పలకరింపు
‘యువ’ (40ఏళ్ల లోపు రచయితల 40 ఉత్తమ కథలు) పుస్తకానికి ప్రేరణ ఏంటి? వయసు పరిమితి పెట్టి పుస్తకం తేవడం ఎందుకు?
వయసు పరిమితి పెట్టి పుస్తకం తేవడం తెలుగులో తక్కువ కావొచ్చేమో కానీ హిందీ, ఇంగ్లీషులో ఎక్కువ. ఈ మధ్య ‘ఒంటి చెయ్యి’ అనే నా కథ ఒకటి హిందీలో అలాంటి సంకలనంలో ప్రచురితమైంది. సరిగ్గా అలాంటి ప్రయత్నమే తెలుగులో ఎందుకు చేయకూడదనిపించి చేశాను. చేస్తున్నప్పుడే నాకు అనిపించింది ఇది ఇప్పటి యువ కథకుల మీద వస్తున్న అనేక ప్రశ్నలకు సమాధానం అవుతుందని.
ఈ పుస్తక సంపాదకుడిగా మీ పరిశీలనలు ఏంటి?
తెలుగులో వందమందికి పైగా 40ఏళ్ల లోపు కథారచయితలు ఉన్నారు. ఎక్కువమంది సంప్రదాయ శిల్ప కథా పద్ధతులకు భిన్నంగా రాస్తున్నారు. కావాల్సినంత వస్తు విస్తృతి ఉంది. కథా నిర్వహణ, దృక్పథం దగ్గరే కొంత తడబాటు ఉందని నాకు వ్యక్తిగతంగా అనిపిస్తుంది. ఈ అభిప్రాయంతో అందరూ ఏకీభవించాలని కూడా లేదు. మాండలికాలను ఈ తరం విస్తృతంగా, సమర్థంగా వాడుతోంది. ఇంగ్లీషు తెలుగు కలగలసిన నగర మాండలికం కూడా ఎక్కువ కథల్లో కనిపిస్తుంది. కేవలం నేను అనుకుంటున్న ఆ చిన్న చిన్న సవరణలు కూడా ఈతరం తప్పకుండా అధిగమించి గొప్ప కథకవర్గంగా మారుతుందని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది.
ఈ పుస్తకం ఎంత మేరకు సమగ్రం అని మీరు అనుకుంటున్నారు?
సమగ్రం కాదు. కొంతమంది తమ కథలు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇంకొంతమంది ఆసక్తి చూపలేదు. నాకున్న పరిమిత పరిచయాల వల్ల కొంతమంది నా దృష్టికి రాకపోయి ఉండొచ్చు. అంతేకాదు ఒకరిద్దరు రచయితలు సరిగ్గా ఈ యేడాదితోనే 40ఏళ్లు నిండినవాళ్లు ఉన్నారు. ఇలా కొన్ని పరిమితులు ఈ సంకలనానికి ఉన్నాయి. అయితే ఇంచుమించు బాగా రాస్తున్నవారంతా ఇందులో ఉన్నారు.
‘కథా మినార్’, ‘చోంగారోటి’, ఇప్పుడు ‘యువ’... ఈ వరుసలో మీ తర్వాతి ప్రాజెక్టు ఏంటి?
నేను ఈ ‘యువ’ పుస్తకం కోసం పని చేస్తున్నప్పుడు రాయలసీమ ప్రాంతం నుంచి తక్కువమంది కథకులు ఉండటం గమనించాను. తెలంగాణ నుంచి 16మంది ఉంటే ఇతర ప్రాంతాల వాళ్లు 18మంది ఉన్నారు. రాయలసీమ నుంచి కేవలం ఆరుగురు కథకులు మాత్రమే ఉన్నారు. అక్కడ రాయాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ వారికి తగిన ప్రేరణ కల్పించే వాతావరణం లేదేమో అని నాకు అనిపించింది. అందుకే ఆ దిశగా కథ మీద వర్క్‌షాపులు పెట్టే పని మీద ఉన్నాను.
Read more