అవినీతి కూటమి ఆర్భాటం!

ABN , First Publish Date - 2022-09-27T06:36:32+05:30 IST

సార్వత్రక ఎన్నికలు జరిగేందుకు మరో ఏడాదిన్నరకు పైగా సమయం ఉండగా ప్రతిపక్ష నేతలు భారతీయ జనతా పార్టీని అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు చూస్తే జాలి...

అవినీతి కూటమి ఆర్భాటం!

సార్వత్రక ఎన్నికలు జరిగేందుకు మరో ఏడాదిన్నరకు పైగా సమయం ఉండగా ప్రతిపక్ష నేతలు భారతీయ జనతా పార్టీని అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు చూస్తే జాలి వేస్తోంది. ఆచరణ సాధ్యం కాని ప్రతిపక్ష ఐక్యతను ఊహించుకుని వారు చేస్తున్న ప్రయత్నాలు వెనుకటికి నలుగురు గుడ్డివాళ్లు ఏనుగును గురించి వర్ణించిన తీరులా కనపడుతున్నాయి. తమ మధ్యే ఐక్యత లేని, తమకే ఏకాభిప్రాయం, స్పష్టత లేని ఒక అంశంతో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి. ఇంతకూ ప్రతిపక్షాల ఐక్యతా యత్నాలు చేస్తున్నది ఎవరు? అవినీతిపరులు, అవకాశవాదులు అయిన నాయకులు అందరూ కలిసి తమను తాము కాపాడుకునేందుకు ఈ యత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. వీరంతా తాము ఏర్పర్చబోయే కూటమికి నాయకుడి గురించి యోచిస్తుండడం హాస్యాస్పదం.


జేడీయూ అధినేత నితీశ్ కుమార్ పచ్చి అవకాశవాది. బిహార్‌లో ఎన్నిసార్లు ఎందరి కొమ్ము కాశారో చెప్పలేం. తన గ్రాఫ్ పడిపోతున్నప్పుడల్లా కూటములు మార్చి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న నితీశ్ గత ఎన్నికల్లో తన పార్టీకి బిజెపి కంటే తక్కువ సీట్లు రావడంతో అస్తిత్వ పరీక్షలో పడ్డారు. దీనితో ఒకప్పుడు తాను వెన్నుపోటు పొడిచిన లాలూ ప్రసాద్ యాదవ్‌తోనే చేతులు కలిపారు. పశుగ్రాసం కుంభకోణంలో శిక్షపడి జైలుపాలై బెయిల్‌పై ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడాయనకు ఆశాకిరణంలా కనపడుతున్నారు. మహారాష్ట్రలో రోజురోజుకూ అస్తిత్వం కోల్పోతున్న ఎన్‌సిపి అధినేత, 81 ఏళ్ల వృద్ధుడు శరద్ పవార్; తెలంగాణలో గత ఎనిమిదేళ్లుగా అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలనకు పాల్పడి కాళ్ల క్రింద నేల జారిపోతున్న కె.చంద్రశేఖర్ రావు; టీచర్ల నియామకంలో భారీ అవినీతికి పాల్పడి పదేళ్లు జైలు శిక్షపడి గత ఏడాదే జైలు నుంచి బయటకు వచ్చిన ఐఎన్ఎల్‌డి నేత, 87 ఏళ్ల ఓంప్రకాశ్ చౌటాలా; దేశమంతా ఉనికిని కోల్పోయినా వెలిసిపోయిన ఎర్ర జెండా పట్టుకుని అరిగిపోయిన నినాదాలు చేస్తున్న కాగితపు పులులైన వామపక్ష నేతలు మోదీకి ప్రత్యామ్నాయాన్ని రూపొందిస్తామని ఉడత ఊపులు ప్రదర్శిస్తున్నారు. ఎందుకో గానీ 2019లో మోదీకి ప్రత్యామ్నాయం రూపొందిస్తానని బయలుదేరి, ప్రధానమంత్రి కుర్చీపై కన్ను వేసిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పుడు కుక్కిన పేనులా కోల్‌కటా దాటి బయటకు రాకుండా ఉండిపోతున్నారు. తాను, తన మంత్రివర్గ సభ్యులు పాల్పడ్డ భారీ అవినీతి గురించి జనానికి తెలిసే సరికి ఇల్లు చక్కదిద్దుకోవడమే శరణ్యమని ఆమె భావిస్తున్నట్లు కనపడుతోంది.


విచిత్రమేమంటే, ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో ఈ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం. 2018లో ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశ పర్యటన మొదలుపెట్టిన కేసీఆర్ ఆ తర్వాత మోదీ మళ్లీ గెలిచేసరికి నీరు కారిపోయారు. కొంతకాలం కేంద్రానికి దాసోహమని, ఆ తర్వాత మళ్లీ గత ఏడాదిగా బిజెపిని విమర్శించడం మొదలు పెట్టారు. తెలంగాణలో చనిపోయిన రైతులకు, వరద బాధితులకు పైసా నష్టపరిహారం చెల్లించని కేసీఆర్ పంజాబ్‌లో రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు బయలుదేరారు! ఈసారి ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనను పక్కన పెట్టి తమదే అసలైన ఫ్రంట్ అని థర్డు ఫ్రంటూ లేదు, ఫోర్త్ ఫ్రంటూ లేదు అని కొత్త రాగం అందుకున్నారు. మరోసారి దేశమంతా చుట్టు చుట్టి అస్తిత్వ పరీక్షలో ఉన్న నేతలందర్నీ కలుసుకున్న తర్వాత వారి ఆలోచనా విధానం వేరు, తన ఆలోచనా విధానం వేరు అని కేసీఆర్‌కు అర్థమైంది. అందుకే మోదీని ఎదుర్కోవడానికి మీలో నాయకుడెవరున్నారు అని పాట్నాలో విలేఖరులు అడిగినప్పుడు నితీశ్ కుమార్ లేచి నిలబడితే, కేసీఆర్ ‘ఇప్పుడే ఎలా నిర్ణయిస్తాం’ అని నీళ్లు నమిలారు. బహుశా నితీశ్ తన పేరు చెబుతారని కేసీఆర్, కేసీఆర్ తన పేరు చెబుతారని నితీశ్ భావించి ఉంటారు. అయితే తమ ఉభయులకూ ఢిల్లీలో అంతసీన్ లేదని తెలిసిపోవడంతో కేసీఆర్ మరో బాణి అందుకున్నారు. జాతీయస్థాయిలో పరిపాలనను నిర్వహిస్తానని, జాతీయ పార్టీ పెడతానని జనాలను ప్రలోభపెట్టడం మొదలు పెట్టారు. స్వరాష్ట్రంలోని 17 సీట్లలో కనీసం అయిదారు సీట్లయినా గెలుస్తాననే నమ్మకం లేని కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే ఎవరు ఓటు వేస్తారు?


మరో ఆసక్తికరమైన పరిణామం ఏమంటే ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ యోచనల్ని మానుకుని జాతీయ పార్టీ పెడతానని కేసీఆర్ అంటుంటే, నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలుసుకుని తామిద్దరమూ కాంగ్రెస్ వెంటే అని ప్రకటించారు. కాంగ్రెస్ లేకుండా ఏ ఫ్రంటూ విజయం సాధించదని నితీశ్ ఫతేపూర్‌లో ఓం ప్రకాశ్ చౌటాలా నిర్వహించిన ర్యాలీలో నితీశ్ ప్రకటించారు. విచిత్రమేమంటే ఈ ర్యాలీకి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలను చౌటాలా ఆహ్వనించకపోగా, టీఆర్ఎస్, డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ ఫ్రంట్, బిజెడి నేతలెవరూ హాజరు కాలేదు. అవినీతిపరుల కూటమిలోనే లుకలుకలున్నాయని ఈ పరిణామంతో అర్థమవుతోంది. ముఖ్యంగా తెలంగాణలో బిజెపి, కాంగ్రెస్‌లతో పోరాడుతున్న కేసీఆర్‌కు ఢిల్లీలో ఇప్పుడే బహిరంగంగా కాంగ్రెస్‌ను హత్తుకోవడం ఇష్టం లేదు. అదే జరిగితే కాంగ్రెస్‌తో పాటు టీఆర్ఎస్‌నూ తెలంగాణ ప్రజలు చెత్తబుట్టలో విసిరేస్తారని ఆయనకు తెలుసు.


పోనీ ఇంత చేస్తే కాంగ్రెస్ అయినా దేశంలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ గురించి ఆలోచించేందుకు సిద్ధంగా ఉన్నదా అంటే అదీ లేదు. తమ పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తే కాని కొత్త ఫ్రంట్ గురించి యోచించలేమని, మీరు ఆ తర్వాత రావాలని సోనియాగాంధీ నితీశ్, లాలూలకు చెప్పి పంపించారు. కొత్త అధ్యక్షుడి విషయంలో పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరుతో మనస్తాపం చెందిన సోనియాగాంధీ అంతకంటే ఏమి చెప్పగలరు? అధిష్టానం ఆశీస్సులతో పార్టీ అధ్యక్ష పదవినీ, ముఖ్యమంత్రి పదవినీ నిర్వహించాలనుకున్న కాంగ్రెస్ వృద్ధ నేత అశోక్ గెహ్లాట్ ఒకే పదవిని నిర్వహించాలని గాడ్‌ఫాదర్ రాహుల్ గాంధీ చెప్పడంతో ఖిన్నులయ్యారు. దీనితో రాజస్థాన్‌లో ఆయన వర్గమంతా తిరుగుబాటు చేసి సచిన్ పైలట్‌ను ముఖ్యమంత్రి కానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ముఖ్యమంత్రి పదవి వదులుకోవడానికి ఆయన పెట్టిన షరతులు విని కాంగ్రెస్ అధిష్టానమే దిక్కుతోచని పరిస్థితిలో పడింది. గతంలో సచిన్ పైలట్‌ను తిరుగుబాటు దారుగా అభివర్ణించిన గెహ్లాట్ ఇప్పుడు తనదాకా వచ్చేసరికి పార్టీ కంటే పదవి ముఖ్యమని అనుకుంటున్నట్లు కనపడుతోంది. కాంగ్రెస్ నేతల తీరు ఇలా ఉంటే, ఈ పార్టీతో చేతులు కలిపి ప్రత్యామ్నాయ ఫ్రంట్ రూపొందిస్తామని కాలం చెల్లిన నేతలు ప్రగల్భాలు పలికితే ఎవరు నమ్ముతారు? అయినా దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో బిజెపి నిర్మాణాత్మకమైన, జాతీయవాద దృక్పథంతో అభివృద్ధే లక్ష్యంగా అద్భుతంగా పనిచేస్తుంటే, ప్రజలకు నేరుగా సంక్షేమ ప్రయోజనాలు అందిస్తుంటే అవినీతిపరుల, అసమర్థుల కూటమిని ఎవరైనా ఎందుకు చేరదీస్తారు?


వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Read more