మూడు రాష్ట్రాలు.. భిన్న ఫలితాలు.. కారణమేంటి?

ABN , First Publish Date - 2022-12-09T00:54:17+05:30 IST

మూడురాష్ట్రాలు. అధికార పక్షం ఒకటే. పోల్చదగిన స్థాయిల్లో నిరర్థక పాలన. ఏక కాలంలో ఎన్నికలు. అయినా భిన్న ఫలితాలు. కారణమేమిటి? తులనాత్మక రాజకీయాల...

మూడు రాష్ట్రాలు.. భిన్న ఫలితాలు.. కారణమేంటి?

మూడురాష్ట్రాలు. అధికార పక్షం ఒకటే. పోల్చదగిన స్థాయిల్లో నిరర్థక పాలన. ఏక కాలంలో ఎన్నికలు. అయినా భిన్న ఫలితాలు. కారణమేమిటి? తులనాత్మక రాజకీయాల విద్యార్థి ఇటువంటి ప్రహేళికను బాగా ఇష్టపడతాడు. రాజనీతి శాస్త్ర పథనిర్దేశకుడు అరిస్టాటిల్ నుంచి 19వ శతాబ్దిలో అమెరికా ప్రజాస్వామ్యాన్ని నిశితంగా శోధించిన ఫ్రెంచ్ మేధావి అలెక్సిస్ డి టోక్విల్లె దాకా రాజనీతి శాస్త్ర విశారదులు అందరూ ఒక విషయాన్ని నొక్కి చెప్పారు: భిన్న రాజకీయ దృష్టాంతాలను జాగ్రత్తగా పోల్చి చూస్తే సమాజ గమనంలో రాజకీయాలు నిర్వర్తించే పాత్ర, ప్రజల జీవితాలపై అవి నెరపే ప్రభావం, లోకులు ప్రతిస్పందించే తీరుతెన్నులపై లోతైన, ప్రయోజనకరమైన అవగాహన ఏర్పడుతుంది.

ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎమ్సిడి), గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభా ఎన్నికల ఫలితాలను అర్థం చేసుకోవడానికి ఈ తులనాత్మక అధ్యయన పద్ధతిని ఆలంబన చేసుకుందాం. అసెంబ్లీ, మునిసిపల్ ఎన్నికలు ఏకకాలంలో జరిగేలా భారత ఎన్నికల సంఘం, ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ చూపాయి. జాతీయ, రాష్ట్ర ఎన్నికల సంఘాల నిర్ణయం అనేక సందేహాలకు తావిచ్చింది. అయినప్పటికీ ఈ ‘సహజ ప్రయోగం’ను ఏర్పాటు చేసినందుకు ఎన్నికల సంఘాలకు రాజనీతి శాస్త్ర విద్యార్థులు ఎంతైనా కృతజ్ఞతాబద్ధులై ఉంటారు. అసెంబ్లీ ఎన్నికలను మునిసిపల్ ఎన్నికలతో ఎలా పోల్చి చూస్తారని మీరు అడగవచ్చు. హిమాచల్ ప్రదేశ్లో కంటే ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. ఆచరణాత్మక ప్రయోజనాలరీత్యా ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలుగానే పరిగణించడం హేతుయుక్తంగా ఉంటుంది.

ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ పతాక అవనతమయింది. ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్రాత్మక విజయం సాధించింది. గుజరాత్లో బీజేపీ వరుసగా ఏడవసారి తిరుగులేని ఘన విజయం సాధించింది. జాతీయ కాంగ్రెస్ తన ప్రధాన ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకుంది. ఇక, హిమాచల్లో ‘సంప్రదాయం’ గెలిచింది. ఆ హిమవత్ పార్వతేయులు 1985 నుంచి ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రత్యామ్నాయ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టడం ఆనవాయితీ. ఆ ప్రకారం 2022లో అధికార పక్షం బీజేపీని తిరస్కరించి కాంగ్రెస్కు హిమాచల్ ఓటర్లు ఘనంగా పట్టం కట్టారు.

ఈ ఎన్నికలలో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ జయాపజయాలను ప్రభావితం చేసిన అంశాలు ఏమిటి? 2017లో ఈ మూడు ఎన్నికలలోనూ బీజేపీ గణనీయమైన మెజారిటీలతో విజయం సాధించింది. ఐదేళ్లు గడిచేటప్పటికి ఒక్క రాష్ట్రంలో మాత్రమే మళ్లీ అధికారానికి రాగలిగింది. ప్రజలలో సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతే బీజేపీ అపజయాలకు కారణమా? అలా అయితే గుజరాత్లో ఘన విజయం ఎలా సాధించగలిగింది? ఉన్న మాట చెప్పాలంటే గుజరాత్, హిమాచల్ రాష్ట్రాల్లోనూ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లోనూ బీజేపీ పాలకుల పనితీరు ప్రశస్తంగా లేదు గత 15 సంవత్సరాలుగా ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లో బీజేపీ అందించిన పాలన ఒక మెట్రో పాలిటన్ పాలనకు ఆదర్శప్రాయంగా లేదు. పారిశుద్ధ్యం, మురుగునీటి పారుదల, విద్య మొదలైన రంగాలలో బీజేపీ దిగ్భ్రాంతికరంగా విఫలమయింది. మరి దేశ రాజధాని వాసులు జాతీయ పాలక పక్షం పట్ల విముఖులు కావడంలో ఆశ్చర్యమేముంది?

గుజరాత్లో గత 27 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కాకముందు ఆ రాష్ట్ర పాలనా రథానికి వరుసగా 14 సంవత్సరాల పాటు సారథ్యం వహించారు. మరిప్పుడు గుజరాత్ ప్రోగ్రెస్ రికార్డ్ ఏమిటి? పేదరికం, విద్య, ఆరోగ్య భద్రత మొదలైన మానవాభివృద్ధి సూచీలలో గుజరాత్ స్థానం ఘనంగా లేదు. పలు ఇతర రాష్ట్రాలలో వలే అక్కడ అవినీతి రాజ్యమేలుతున్నది. గుజరాత్తో పోలిస్తే హిమాచల్ ప్రదేశ్లో పాలనా ప్రమాణాలు ఉత్కృష్టంగా ఉండడం కద్దు. అయినప్పటికీ ఆ హిమాలయ రాష్ట్రంలో గత ఐదేళ్ల బీజేపీ పాలన అధ్వాన్న స్థాయిలోనే ఉంది. ప్రస్తుత ఎన్నికలలో ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం, పెన్షన్లు, రోడ్ల అనుసంధాయకత మొదలైన అంశాలకు హిమాచల్ ఓటర్లు అధిక ప్రాధాన్యమిచ్చారు.

ఈ మూడు ఎన్నికలలోనూ ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల మనోభావాలలో ప్రతిబింబించింది. స్పష్టంగా వ్యక్తం కానప్పటికీ ప్రచ్ఛన్నంగా ప్రభావితం చేసింది. ఎన్నికలకు ముందు గుజరాత్లో లోక్నీతి– సిఎస్డిస్ నిర్వహించిన ఒక సర్వేలో బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారని వెల్లడయింది. అయితే ప్రతి పదిమంది ఓటర్లలోనూ ఏడుగురు బీజేపీ సర్కార్ అవినీతి ప్రభుత్వమని అభివర్ణించారు. ప్రభుత్వ పనితీరులో మార్పు రావడం చాలా ముఖ్యమని సగం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. ఓటు వేయడంలో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటామని కూడా పేర్కొన్నారు.

గుజరాత్, హిమాచల్, ఢిల్లీలో ప్రజా తీర్పులు భిన్నంగా ఎందుకు ఉన్నాయి? కొన్ని సాధారణ వివరణలతో ఆ సంక్లిష్ట విషయాన్ని వివరించలేము. గుజరాత్లో బీజేపీ ఘన విజయానికి మోదీ ఇంద్రజాలం కారణమయితే ఢిల్లీలో ఎందుకు విఫలమయింది? హిమాచల్లో ‘సంప్రదాయాన్ని’ ఎందుకు ఛేదించలేకపోయింది? ఇక ఆర్థిక వనరులు, మీడియా మద్దతు, సంస్థాగత బలం బీజేపీకి ఎంతగా ఉన్నాయో మరి చెప్పనవసరం లేదు. దాదాపుగా అన్ని ఎన్నికలలోనూ ఈ అంశాలు బీజేపీ విజయాలకు విశేషంగా దోహదం చేస్తున్నాయి. అయినా ప్రస్తుత మూడు ఎన్నికల ఫలితాలలో తేడాలు వచ్చాయి. రాష్ట్ర పార్టీ నాయకత్వమే కారణమని కూడా చెప్పలేము. పార్టీలో ముఠా కుమ్ములాటలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంది. ముఖ్యంగా హిమాచల్లో అపజయానికి అవి ఎంతైనా కారణమయ్యాయి. బీజేపీలో ఈ ముఠా కుమ్ములాటలనేవి ఒక శాశ్వత వాస్తవంగా ఘనీభవించడం ప్రారంభమయింది. కాంగ్రెస్ మధ్యాహ్న మార్తాండుడిలా వెలిగిపోయిన కాలంలో ఆ పార్టీలో ముఠా కుమ్ములాటలున్నట్లే, ఇప్పుడవి బీజేపీ సంస్థాగత లక్షణంగా రూపొందుతున్నాయి.

ఈ మూడు ఎన్నికల ఫలితాలలో తేడాకు ప్రత్యేకించి మూడు అంశాలు కారణమయ్యాయి. ఒకటి– బీజేపీని గట్టిగా ఢీకొనేందుకు ఒక ప్రధాన సవాలుదారు అవసరం. ఢిల్లీలో బీజేపీకి అటువంటి గట్టి ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో ఉన్నాడు. హిమాచల్లో కాంగ్రెస్ గట్టి సవాలుగా నిలిచింది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష ఓట్లలో చెప్పుకోదగ్గ చీలిక సంభవించలేదు. గుజరాత్ ఇందుకు ఒక మినహాయింపు. రెండు– ప్రధాన సవాలుదారు ప్రజలకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలి, ప్రజలు ఆ సందేశకుడితో తాదాత్మ్యం పొందాలి. హిమాచల్లో కాంగ్రెస్ కొన్ని అంశాలను లేవనెత్తింది. అవన్నీ ప్రజల సమస్యలకు సంబంధించినవే. అయితే ఢిల్లీ, గుజరాత్లలో ఆ పురాతన రాజకీయపక్షం అటువంటి స్పష్టమైన సందేశాన్ని ఇవ్వగలిగిందా? ఒక శక్తిమంతమైన సందేశకుడు ఎవరూ ప్రజలకు కన్పించలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్, ఢిల్లీలో స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ప్రజల సమస్యలు, పరిష్కారాలపై ఆలోచనలను రేకెత్తించింది. ఢిల్లీలో ఆ పార్టీకి అరవింద్ కేజ్రీవాల్ లాంటి దిగ్గజ నాయకుడు ఉన్నారు. అలాగే, గుజరాత్లోనూ ఒక కొత్త నాయకుడిని ప్రజల ముందుకు తెచ్చింది.

మూడు– ప్రతిపక్షం దృఢ సంకల్పంతో, సంఘటిత పోరాటం చేయవలసి ఉంది. అదే, కాంగ్రెస్లో ప్రధానలోపంగా ఉన్నది. గుజరాత్, ఢిల్లీలో కాంగ్రెస్ ఒక పటిష్ఠ వ్యూహంతో ప్రజల ముందుకు రాలేదు. ఢిల్లీలో కొత్త నాయకుడిని ప్రజల ముందుకు తీసుకువచ్చి ఉండవలసింది. గుజరాత్లో ఒక కచ్చితమైన లక్ష్యంతో కాంగ్రెస్ పోరాడనే లేదు. హిమాచల్లో సైతం ఇంతకుమించిన విజయం సాధించగల అవకాశాన్ని కోల్పోయింది. మొత్తంగా, ఆప్లో ఒక దృఢసంకల్పం, పటిష్ఠ వ్యూహం కనిపించాయి. ఎట్టి పరిస్థితులలోనూ కాంగ్రెస్ను వెనుకకు నెట్టివేయడమే ఆప్ లక్ష్యంగా ఉన్నది. ఇది, ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అనే బీజేపీ లక్ష్యంతో ఏకీభావం. హిమాచల్లో తనకు అవకాశాలు లేవని గ్రహించిన వెంటనే ఆ పార్టీ తన శక్తియుక్తులను గుజరాత్లో కేంద్రీకరించింది. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లో నిరంతర ప్రచారంతో తన మనోరథాన్ని నెరవేర్చుకున్నది.

ఈ మూడు ఎన్నికల ఫలితాలు నేర్పే పాఠం ప్రతిపక్షానికి కొత్తదేమీ కాదు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఓటమి నుంచి కూడా ఇదే పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఆ మాటకొస్తే కొత్త సాగు చట్టాలపై చరిత్రాత్మక రైతు పోరాటం నేర్పిన పాఠమూ భిన్నమైనదేమీ కాదు. ఏమిటా పాఠం? నరేంద్ర మోదీ సర్వశక్తిమంతుడు కాదు. బీజేపీ దుర్బలమైనది. ఆ పార్టీని ఓడించడం సాధ్యమే. అయితే అందుకు ప్రతిపక్షం దృఢసంకల్పంతో, గట్టి పట్టుదలతో, వ్యూహాత్మకంగా పోరాడి తీరాలి. 2024 సార్వత్రక సమరంలో విజయాన్ని సాధించదలుచుకున్నవారు ఆ పాఠాన్ని నేర్చుకోవడానికి ఇంకా కాలం మించిపోలేదు.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

Updated Date - 2022-12-09T09:49:55+05:30 IST