‘జాతీయ’ లోగుట్టు పెరుమాళ్ల కెరుక!

ABN , First Publish Date - 2022-12-15T01:01:03+05:30 IST

రాజకీయాలలో ఆరితేరిన వారికి చాలా విద్యలుంటాయి. అన్నిసార్లూ అందరికీ అర్థమయ్యే విధంగా నడచుకోరు. ప్రయోజనం ఏమిటో, ఉద్దేశం ఏమిటో ఊహించుకోవలసిందే తప్ప కొన్ని వ్యూహాలకు ప్రతిపదార్థ తాత్పర్యాలు...

‘జాతీయ’ లోగుట్టు పెరుమాళ్ల కెరుక!

రాజకీయాలలో ఆరితేరిన వారికి చాలా విద్యలుంటాయి. అన్నిసార్లూ అందరికీ అర్థమయ్యే విధంగా నడచుకోరు. ప్రయోజనం ఏమిటో, ఉద్దేశం ఏమిటో ఊహించుకోవలసిందే తప్ప కొన్ని వ్యూహాలకు ప్రతిపదార్థ తాత్పర్యాలు దొరకవు. మరీ, ముదిరిపోయిన చాణక్యుల విషయంలో ఊహాగానాలకు కూడా ఆస్కారం ఉండదు. అంతుచిక్కని అంతరార్థాలను వెదికి బుర్రలు పగలిపోవలసిందే తప్ప, అజ్ఞానాంధకారం విడిపోదు.

ఈ భారత రాష్ట్రసమితి (బిఆర్ఎస్) ఎందుకు అన్న ప్రశ్న చాలా కఠినమైనది. ఎన్ని మల్టిపుల్ చాయిస్ సమాధానాలు ఇచ్చినా ఏదీ సరిపోదు. తమకు అర్థం కాని విషయాలకు తమకు అర్థం అయ్యే వివరణలు ఇచ్చుకుంటారు సామాన్యులు. సంఖ్యాశాస్త్రమో, అక్షరశాస్త్రమో సరిపోలేదని, మోదీ మొహం చూడకూడదని ఎవరో స్వామి చెప్పాడని, తల మీద కౌబాయ్ టోపీ వెనుక బల్లిశాస్త్రమో, అక్షింతల శాస్త్రమో ఉన్నదని చెప్పుకుంటున్నారు. అటువంటివి కెసిఆర్ నమ్ముతారని, పాటిస్తారని చెప్పడానికి ఆధారాలేమీ లేవు కానీ, ఆయన నమ్ముతారని జనం కొందరయినా నమ్మడమే విచారకరం. ఇటువంటి అభిప్రాయాలు వాడుకలో ఉన్నాయి కాబట్టే, ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి మీద విమర్శించడానికి మరేమీ లేనట్టు, ఈ అంధ విశ్వాసాల గురించే మాట్లాడతారు.

ప్రాంతీయపార్టీ జాతీయపార్టీ అయినందువల్ల కాక, పేరు మార్పిడి వల్ల మాత్రమే టిఆర్ఎస్, బిఆర్ఎస్ అయింది. జాతీయపార్టీ అని మనం చెప్పుకున్నంత మాత్రాన కుదరదు. దానికేవో లెక్కలు ఉంటాయి. అటువంటి కొలతలకు సరిపోనప్పుడు, భావనాత్మకమైన లక్షణాలేవో చెప్పాలి. జాతీయ ఎజెండాతో ముందుకు వస్తున్న ప్రాంతీయ పార్టీ అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఫ్రంట్లు అంటూ చేసిన ప్రయత్నాలలో పెద్దగా స్పందనలు లేకపోతే, ప్రత్యామ్నాయ ఫ్రంట్లు కాదు, ప్రత్యామ్నాయ ఎజెండా కావాలని కెసిఆర్ అనడం మరచిపోలేము. పార్టీలు కాదు, ప్రజలు గెలవాలి అని కూడా ఆయన అన్నారు. కాబట్టి, ఈ బిఆర్ఎస్ సొంతంగానో, మిత్రుల సాయంతోనో దేశవ్యాప్తంగా పోటీచేసి, నెగ్గి, జాతీయస్థాయిలో అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుందా, లేక ఎజెండా గెలుపు కోసం, ప్రజల గెలుపు కోసం భావనాత్మకంగా పనిచేస్తుందా అని సందేహం వస్తుంది. పుట్టి పదేళ్లు అయినా, ఇప్పుడిప్పుడే జాతీయ అడుగులు వేయగలుగుతున్న ఆప్తో పోలిస్తే, బిఆర్ఎస్ ప్రయాణం ఎంత సుదీర్ఘమో అన్న బెంగ కూడా కలుగుతుంది. ఇప్పుడు కేజ్రీవాల్ మీద ఎన్ని విమర్శలు వచ్చినా, ఆప్ మీద ఎన్ని అనుమానాలు ఉన్నా, ఆ పార్టీ పుట్టి పెరిగిన తీరు, పరిపాలనలో అనుసరించిన కొన్ని పద్ధతులు చూసినప్పుడు టిఆర్ఎస్, కెసిఆర్లతో పోల్చడం సరిఅయినదేనా అన్న విచికిత్సా కలుగుతుంది. ఈ యక్ష ప్రశ్నలకు జవాబు వెదకడం కంటె, మంత్రతంత్రాల వదంతులే మెరుగని అనిపిస్తుంది.

దేవతావస్త్రాల గురించి మాట్లాడడానికి తలవదులుకోగలిగే ధైర్యం ఉండాలి కాబట్టి, కెసిఆర్ పరివారంలో ఎవరూ ఆయనను వివరణలు కోరరు. ఇన్ని చేసిన నాయకుడు, ఊరికినే ఈ ప్రయత్నం చేస్తాడా, అన్న నమ్మకం కొంత, నమ్మక చేయగలిగేది లేదన్న తెలివిడి కొంత కారణంగా, బిఆర్ఎస్ గురించిన లోగుట్టు ఎవరికీ తెలియకుండా పోయింది. గంటల కొద్దీ టీవీ తెరల మీద చర్చలు చేస్తున్నారు కానీ, ఒక్కరూ కెసిఆర్కు ఏ పొరుగు రాష్ట్రంలోనూ తగినన్ని ఓట్లు రావని, ఈ జాతీయ అభినయానికి, తీవ్రజాతీయవాదంలో ఎవరెస్టును అధిరోహించిన జాతీయపార్టీ భయపడబోదని నిష్కర్షగా చెప్పలేకపోతున్నారు. ఆత్మరక్షణ కోసం ప్రదర్శిస్తున్న ఈ దూకుడు అసలుకే మోసం తేగలిగే అవకాశం గురించి హెచ్చరించలేకపోతున్నారు. ఈ శుష్క ప్రయాస కంటె, చేయగలిగేదేదో సొంతరాష్ట్రంలో పట్టు పెంచుకోవడానికి చేస్తే ఫలితం ఉంటుందని ఎవరూ సలహా ఇవ్వలేకపోతున్నారు. అన్నవస్త్రాలు, ఉన్నవస్త్రం కథ గుర్తు చేయలేకపోతున్నారు. ఢిల్లీకి వెళ్లి ఎల్లిపాయ తెచ్చాడనే అపహాస్యపు సామెతకు జీవం పోయవద్దని వారించలేకపోతున్నారు.

రాజకీయ ఉనికే తెలంగాణ కదా, దాన్ని పార్టీ పేరులోనుంచి తీసేయడం ఏమిటి? తన ప్రయాణాన్ని తానే తుడిచివేసుకుంటున్న దృశ్యం, కెసిఆర్ విమర్శకులకు కూడా రుచించడం లేదు. రెండో అధికార హయాం ముగిసే సరికి తెలంగాణలో దృశ్యం ఎట్లా మారిందో చూడండి, జగన్ సోదరి కలకలం సృష్టిస్తున్నారు, పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి సై అంటున్నారు. తెలుగుదేశం కథ తెలంగాణలో ముగిసిందనుకుంటే, ఖమ్మం సభతో కాకపుట్టిద్దామని అనుకుంటున్నారు. చిన్నవిగా చితకవిగా కనిపించినా ఇంకా అనేక పార్టీలు, బృందాలు.. రాజకీయ వేదిక కిటకిటలాడిపోతోంది. ప్రతిపక్షమే లేకుండా చేయాలని అనుకుంటే, చివరికి అనేకానేక పక్షాలుగా పరిస్థితి మారింది. ఇవన్నీ చీలికలు పీలికలుగా ఉండకపోవచ్చునని, అన్నీ బాహాటంగానో లోపాయికారిగానో జట్టుకట్టవచ్చునని కెసిఆర్ గ్రహించకపోరు. ఒకరిని తగ్గించి మరొకరిని పెంచి, పిట్టపోరు పిల్లితీర్పు లాగా లాభపడదామనుకుంటే, పరిస్థితులు ఎల్లవేళలా మన చెప్పుచేతల్లో ఉండవు. కొనుగోళ్లు చేసీ చేసీ, ఏకస్వామ్యం నెలకొల్పినవారు, చివరకు తమ బలగాలను ఎవరు కొనుక్కుపోతారో అని అనుక్షణం భయపడవలసి వస్తుంది. తెలంగాణ రాజకీయ సంవాదానికి దురుసుతనాన్ని, హద్దుమీరిన భాషను అందించినందుకు, ఇప్పుడు తనను మించి నోరుపారేసుకునే ప్రత్యర్థులను ఎదుర్కొనవలసి వస్తున్నది.

ప్రాంతీయనేతలు ప్రాంతానికే పరిమితం కావలసిన పనిలేదు. వ్యక్తిత్వంతో జాతీయస్థాయి ఏమి, అంతర్జాతీయస్థాయి కూడా సాధించుకోవచ్చు. తెలుగునేతలు అనేకమంది జాతీయోద్యమంలోను, ఆ తరువాతా జాతీయ నాయకులయ్యారు. ప్రాంతీయ పార్టీలు పెట్టి కూడా ఎన్టిఆర్, కరుణానిధి, బిజూపట్నాయక్ జాతీయ గౌరవాన్నే పొందారు. 2024 ఎన్నికలకు ముందు ఎన్నికల్లోను జాతీయ ముఖచిత్రాన్ని ప్రభావితం చేయగలిగిన ఏదైనా ప్రయత్నం చేసి, సఫలమైతే, అప్పుడు కేసిఆర్ దేశనాయకుడు కావడం కష్టమేమీ కాదు. గుజరాత్ అభివృద్ధి నమూనా కారణంగా మాత్రమే నరేంద్రమోదీ దేశప్రధాని కాలేదు. ఆ నమూనా దేశ పారిశ్రామికులను, కార్పొరేట్ రంగాన్ని, స్టాక్ మార్కెట్ మదుపరులను ఆకట్టుకుని ఉండవచ్చు. కానీ, దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఆయన అనుసరించిన నమూనా మరొకటి ఉన్నది. ఆ నమూనాను ప్రచారం చేయడానికి ఆయన వెనుక పెద్దపార్టీ, ఆ పార్టీ వెనుక పెద్ద యంత్రాంగం అన్నీ ఉన్నాయి. గుజరాత్ నమూనా ప్రజల జీవితాలను ఏ మాత్రం మార్చిందో గుజరాత్కు వెళ్లి చూస్తే తెలుస్తుంది. తెలంగాణకు అసలు ఒక నమూనా ఉన్నదా, ఆ నమూనా వల్ల వాస్తవ ఫలితాలు అనుభవంలోకి వచ్చాయా? అన్నవి ఇక్కడ వేసుకోవలసిన ప్రశ్నలు. సంక్షేమ నమూనా అయినా ఏదో ఉందనుకోవచ్చు, అభివృద్ధి నమూనా ఏమున్నదో అర్థం కాదు. సరే, ఎవరి ఆకాంక్షలు, ఆశలు వారివి, తప్పు పట్టడానికి లేదు. తమ గురించి తాము గొప్పగా ఊహించుకోవడానికి కూడా అందరికీ హక్కు ఉన్నది. ఫలితం ఏమిటన్నదే సమస్య. అట్లాగే, ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ సొంత రాష్ట్రం సాధించుకున్న తరువాత, పాత పరిధుల్లోనే అట్లాగే ఉండాలని ఏమీ లేదు. వీరు వారు, వారు వీరు కావచ్చును. తప్పేమీ లేదు. కానీ, దానికి ఒక క్రమం ఉంటుంది. అట్లా కాక, ప్రతిఫలాలకు దొరికే అనుచరులతో అక్కడి నేతలు ఇక్కడా, ఇక్కడి నేతలు అక్కడా ఫ్లెక్సీలు కట్టగలరు, దీక్షలు చేయగలరు కానీ, జనం మెప్పుపొందగలరా అన్నది ప్రశ్న. తెలంగాణలో షర్మిల, జాతీయస్థాయిలో కెసిఆర్ స్వయంసంధిత బాణాలే కావచ్చును కానీ, వారి గురి ఎవరికి మేలు చేస్తుందని కదా ఆలోచించవలసింది!

ఎటువంటి అర్థమూ లేని ఈ విన్యాసం ద్వారా మోదీ ప్రభుత్వాన్ని కెసిఆర్ ఢీకొడతారని, కొట్టగలరని అనుకోవడానికి సంకోచం అడ్డువస్తున్నది. కెసిఆర్ కానీ, మమత కానీ, అఖిలేశ్, తేజస్వి, నితిశ్, ఎవరైనా సరే, 2024 కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేయవచ్చు. ఒకరి వెంట ఒకరు నడవకపోయినా, ఒకరిలో ఒకరు కలసిపోకపోయినా, ఏదో ఒక దశలో కలసికట్టుగా నిలబడవచ్చు. పూర్తిగా సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినా, ఒకటి రెండు పార్టీలు గణనీయమైన ఒత్తిడి శక్తిగా నిలబడి, తరువాత రాబోయే ప్రభుత్వం మీద ప్రజాస్వామిక ప్రభావం వేయవచ్చు, అది కూడా ఎంతోకొంత మంచిదే. కానీ, కొన్ని ప్రయత్నాలను చూసినప్పుడు వాటి చిత్తశుద్ధిపై, సమర్థతపై ఏమంత నమ్మకం కలగదు. పైగా, ఇతరత్రా జరిగే గట్టి ప్రయత్నాలను బలహీనపరుస్తాయేమో అనిపిస్తుంది. అనేక చిన్న శక్తులను రంగం మీదకు గుప్పించి, ప్రజల ఓట్లను కకావికలం చేసి, లాభం పొందాలనుకునే బాహుబలులకు ఇటువంటి జాతీయ అభినయాలు కూడా అయాచిత దోహదాలవుతాయేమో?

కె. శ్రీనివాస్

Updated Date - 2022-12-15T01:01:03+05:30 IST

Read more