శ్రీకాకుళ విప్లవధీర

ABN , First Publish Date - 2022-09-10T06:44:02+05:30 IST

మహత్తర శ్రీకాకుళ సాయుధ పోరాట యోధురాలు శృంగవరపు జయమ్మ. బాల్యంలోనే తండ్రి నరసింహులు వేలు పట్టుకొని పోరు వనంలోకి..

శ్రీకాకుళ విప్లవధీర

మహత్తర శ్రీకాకుళ సాయుధ పోరాట యోధురాలు శృంగవరపు జయమ్మ. బాల్యంలోనే తండ్రి నరసింహులు వేలు పట్టుకొని పోరు వనంలోకి ప్రవేశించిన తొలితరం మహిళా ఉద్యమ నాయకురాలు ఆమె. 1968లో మహేంద్రగిరి పర్వత ప్రాంతంలోకి వెళ్లి ఆయుధాన్ని పట్టుకున్నారు. బోరివంక, బాతుపురం, బొడ్డపాడు, బంజీరు యువరాజుపురం, వంటి చోట్ల ప్రజా శత్రువులు, భూస్వాములను మట్టుబెట్టే కార్యక్రమంలో జయమ్మ చురుకుగా పాల్గొన్నారు. ఆమె తలకు రాజ్యం వెలకట్టింది. ఆమెపై రూ.20వేలు రివార్డు ప్రకటించింది. 1969 మే 27న పంచాది కృష్ణమూర్తి, జయమ్మ తండ్రి నరసింహులు, మరో ఐదుగురు బూటకపు ఎన్‌కౌంటర్‌లో అమరులయ్యారు. అయినా జయమ్మ గుండె ధైర్యం కోల్పోలేదు. వర్గ కసిని పెంచుకొని ప్రజాపోరాటక్షేత్రాన నిలబడింది. 1970 మే 25న ప్రజావైద్యుడు డాక్టర్ మల్లికార్జునను వివాహం చేసుకున్నది. ఆయన రెండు నెలల్లోనే రామరాయి కొండల్లో జరిగిన పోలీసు కాల్పుల్లో అమరుడయ్యారు. నిత్యం నిర్బంధాల మధ్య, తుపాకీ మోతల నడుమ సహచరులు జయమ్మ కళ్ల ముందే 360 మంది అమరులయ్యారు. ఆ అమరుల నెత్తురు సాక్షిగా ప్రాణం ఉన్నంత వరకు విప్లవోద్యమంలో కొనసాగుతానని ఆమె శపథం చేశారు. జయమ్మ 2020 ఫిబ్రవరి 24 రాత్రి గుండెపోటుతో బొడ్డపాడులో మరణించింది. ఆమె 


52 ఏళ్ళ పాటు విప్లవోద్యమంలో కొనసాగింది. అంతులేని కష్టాల కడగండ్లను దిగమింగుకొని పార్టీ కోసం, ప్రజల కోసం చివరి వరకు నిలబడింది. తాను నమ్ముకున్న విప్లవోద్యమంలో అనేక ఆటుపోట్లలో రాటుదేలింది. ఆమె సుదీర్ఘ విప్లవ జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆమె త్యాగం మహేంద్రగిరి పర్వతమంత ఎత్తు అయినది. 


నేడు ‘జయమ్మ జీవిత చరిత్ర’ 

(ఆమె స్వీయ రచన) పుస్తకావిష్కరణ సభ బొడ్డపాడులో జరగనున్నది.

– వంకల మాధవరావు

న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి (సిపిఐ–ఎంఎల్)

Read more