పంపుసెట్ల వద్దే సోలార్‌ విద్యుత్‌ రైతుకు మేలు

ABN , First Publish Date - 2022-07-05T06:34:21+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 10 మెగావాట్ల సామర్థ్యమున్న రెండు సోలార్‌ పవర్‌ ప్లాంట్లు నిర్మించి రైతుకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడానికి సంకల్పించింది....

పంపుసెట్ల వద్దే సోలార్‌ విద్యుత్‌ రైతుకు మేలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 10 మెగావాట్ల సామర్థ్యమున్న రెండు సోలార్‌ పవర్‌ ప్లాంట్లు నిర్మించి రైతుకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడానికి సంకల్పించింది. అయితే అందులో చాలా సమస్యలున్నాయి. అవి– ఒక్కొక్క మెగావాట్‌కు ఐదు ఎకరాల చొప్పున మొత్తం 20 మెగావాట్లకు లక్ష ఎకరాల భూమి కావాలి. దీనికంతటికీ ఒక్కో మెగావాట్‌కు ఐదు కోట్ల రూపాయల చొప్పున మొత్తం లక్ష కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఇది కాక వేర్వేరు చోట్ల 132 కెవి హై ఓల్టేజి సబ్‌స్టేషన్లు నిర్మించాలి, వీటి నిర్వహణకు ప్రత్యేక సిబ్బంది కావాలి. లైన్లలో కాని, సబ్‌స్టేషన్లలో కాని సమస్య వస్తే అక్కడి రైతులకు సోలార్‌ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. 132 కెవి సబ్‌స్టేషన్ల నుంచి 13 కెవి, 33 కెవి, 11 కెవి, 440వి లైన్స్‌ ద్వారా రైతుకు విద్యుత్‌ సరఫరా అవుతుంది. దీని వల్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో 30 శాతం వరకు లైన్లలో వ్యర్థమవుతుంది. 440వి లైన్లలో గాని, 25 కెవిఎ ట్రాన్స్‌ఫార్మర్లలో కాని లోపం వస్తే రైతుకు విద్యుత్‌ ఉండదు.


పై సమస్యలను అధిగమించడానికి, రైతుల వ్యవసాయ మోటర్ల వద్దనే మూడు కిలోవాట్లు లేదా 5 కిలోవాట్ల సోలార్‌ ప్యానల్స్‌ అమర్చి విద్యుత్‌ ఇవ్వడం మంచిది. ఈ పద్ధతిలో క్రింది లాభాలుంటాయి. అవి– సూర్యరశ్మి ఉదయం 7.30 నుంచి సాయంత్రం 4.30 వరకు తొమ్మిది గంటలపాటు ఉంటుంది. దీంతో రైతుకు నిరంతరాయమైన విద్యుత్‌ లభిస్తుంది. మబ్బు వేసినా కూడా పెద్దగా అంతరాయం ఉండదు. విద్యుత్‌ శాఖ లైన్స్‌లో ఏ కారణం వల్ల విద్యుత్‌ ఆగినా కూడా రైతుకు సోలార్‌ విద్యుత్‌ అందుబాటులో ఉంటుంది. విద్యుత్‌ కోసం రైతు నిరీక్షించనవసరం లేదు. రైతు సర్వీసునకు ఇంపోర్ట్‌–ఎక్స్‌పోర్ట్‌ మీటర్లు పెట్టడం వల్ల రైతు వినియోగించని సమయంలో తయారైన విద్యుత్‌ ఎగుమతి అవుతుంది. ఆ విద్యుత్‌ను ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ఎక్స్‌పోర్ట్‌ అయ్యే విద్యుత్‌ వల్ల రైతుకి నెలకు రెండు వేల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా వారానికి మూడు రోజులు పంప్‌ ద్వారా రైతు నీటిని వాడతాడు. మిగతా రోజుల్లో తయారయ్యే విద్యుత్‌ వల్ల రైతుకు ఆదాయం వస్తుంది. ఈ పద్ధతి వల్ల లైన్లలో విద్యుత్‌ వృథా అవడం చాలా తక్కువగా ఉంటుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో గ్రిడ్‌ కనెక్టెడ్‌ సోలార్‌ పంపులు 200 వరకు ఉన్నాయి. రెండు సంవత్సరాల నుంచి వీటి విద్యుత్‌ మీటర్లలో వాడిన విద్యుత్‌ కన్నా ఎగుమతి చేసిన విద్యుత్‌ ఎక్కువగా కనపడుతోంది. ఈ పద్ధతి వల్ల పంపుసెట్ల వద్ద ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ దగ్గరలో ఉన్న గ్రామాలకు అందిస్తే లైన్లలో నష్టాలు తక్కువగా ఉంటాయి. గ్రిడ్‌ కనెక్టెడ్‌ సోలార్‌ విద్యుత్‌ వల్ల రైతులు లైన్లను లేదా ట్రాన్స్‌ఫార్మర్లను ముట్టుకుని షాక్‌కు గురయ్యే ప్రమాదాలు తగ్గుతాయి. సూర్యుడు ఉన్నంతసేపు విద్యుత్‌ పొందవచ్చు. రైతులకు ప్రయోజనకారి అయిన ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద సోలార్‌ విద్యుత్‌ కొనవలసిన పనిలేదు. దీనికయ్యే ఖర్చును కొంత రైతును భరించమని, ప్రభుత్వం మరికొంత సబ్సిడీ ఇస్తే చాలా మంది రైతులు ముందుకొస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 20 లక్షల పంపుసెట్లకి ఒక్కొక్కటీ ఐదు కిలోవాట్ల చొప్పున 10 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్యానల్స్‌ సరిపోతాయి. కాబట్టి రైతు శ్రేయస్సు, క్షేమం దృష్ట్యా సోలార్‌ గ్రిడ్‌ కనెక్టెడ్‌ విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఉత్తమం.

ఎం. కృష్ణమూర్తి

విశ్రాంత చీఫ్‌ ఇంజినీర్‌

Read more