సింగరేణిని ప్రైవేటీకరిస్తున్నదెవరు?

ABN , First Publish Date - 2022-12-10T01:34:34+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (51శాతం వాటాతో), కేంద్ర ప్రభుత్వం (49శాతం వాటాతో) సంయుక్త నిర్వహణలో నడుస్తున్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రభుత్వ రంగ మైనింగ్ సంస్థ సింగరేణి.

సింగరేణిని ప్రైవేటీకరిస్తున్నదెవరు?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (51శాతం వాటాతో), కేంద్ర ప్రభుత్వం (49శాతం వాటాతో) సంయుక్త నిర్వహణలో నడుస్తున్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రభుత్వ రంగ మైనింగ్ సంస్థ సింగరేణి. నల్లబంగారంతో దేశాభ్యున్నతిలో పాలుపంచుకుంటున్న సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తున్నదన్న వదంతిని టీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. పునరుద్ధరించి, విస్తరించిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి పునరంకితం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల తెలంగాణకు వచ్చినప్పుడు సింగరేణిపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో అసత్య ప్రచారానికి తెరతీసింది. సంస్థను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేయబోతోందంటూ అధికారపార్టీ నేతలు, కమ్యూనిస్టు నేతలు ఆరోపణలు చేసి హడావుడి చేశారు. అయితే, ప్రధానమంత్రి ఒకే ఒక్క చిన్న ప్రశ్నతో వీరి అబద్ధాల బండారాన్ని బయటపెట్టారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వ వాటా 49శాతం అయినప్పుడు, ప్రైవేటీకరణపై కేంద్రం ఎలా నిర్ణయం తీసుకోగలుగుతుందన్న ఆయన ప్రశ్నకు బదులేలేదు. ఒకవేళ అలాంటి చర్య తీసుకోవాల్సి వస్తే– మెజారిటీ వాటా కలిగిన టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఆ పని చేయగలుగుతుంది తప్ప కేంద్రం ఎలా చేస్తుంది? అని నిలదీశారు.

ఇదివరకటి కాంగ్రెస్ పరిపాలన కాలంలో ఏకపక్ష కేటాయింపుల విధానం కారణంగా 10.5 లక్షల కోట్ల రూపాయల మేర ప్రజాధనం నష్టపోయామని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) స్పష్టం చేసింది. అప్పటి కేటాయింపులు అక్రమమైనవి, ఏకపక్షమైనవని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, మోదీ ప్రభుత్వం బొగ్గు రంగంలో అత్యంత పారదర్శకమైన సంస్కరణలు తీసుకువచ్చింది. ఈ సంస్కరణల వల్ల పారదర్శకత సాధ్యమయ్యింది. నిర్ణయాల్లో, కార్యకలాపాల్లో ఆలస్యాలు తగ్గాయి. రాయల్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు, జిల్లా మినరల్ ఫండ్ ద్వారా జిల్లాల ఆదాయాలు పెరిగాయి. కేంద్రం పరిస్థితులను చక్కబెడుతున్న ఈ తరుణంలో టీఆర్‍ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారానికి తెగబడుతోంది. ప్రయివేటుపరం చేయడం కోసమే తెలంగాణాలో ఉన్న బొగ్గు గనులను సింగరేణి కాలరీస్ కు కేటాయించడంలేదన్న ఆరోపణలు చేస్తోంది. టీఆర్‌ఎస్ నాయకుల దుష్ప్రచారాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఈ బొగ్గు గనులను తనకు కేటాయించవలసిందిగా సింగరేణి కాలరీస్ దరఖాస్తుగానీ, బిడ్డింగ్ గానీ చేయలేదని ఆయన వెల్లడించారు.

సింగరేణి విషయంలో కొన్ని మౌలిక ప్రశ్నలు ప్రజల ముందుంచాలి: మొదటి ప్రశ్న – కొత్త బొగ్గు విధానం తెచ్చినప్పుడు పార్లమెంటులో టీఆర్‌ఎస్ మద్దతు పలకడం నిజం కాదా? కొత్త విధానాలు సింగరేణి కాలరీస్ కు, తద్వారా తెలంగాణ ప్రయోజనాలకు భంగకరంగా ఉండి ఉంటే మద్దతు ఎందుకు ఇచ్చింది?

రెండో ప్రశ్న– సింగరేణి కాలరీస్ ఇతర రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకుల కోసం బిడ్డింగ్ జరిపి, వాటిని పొందలేదా? బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించిన కొత్త విధానం పారదర్శకంగా లేకుండా ఉంటే, ఆ విధంగా బిడ్డింగ్ జరిపి బొగ్గు గనులు పొందడం సాధ్యపడేదేనా?

మూడో ప్రశ్న– సింగరేణి కాలరీస్ తెలంగాణలో బొగ్గు గనుల కోసం దరఖాస్తు ఎందుకు చేయలేదు? బిడ్డింగ్ లో పాల్గొని ఉంటే సింగరేణికి ఆ బొగ్గు గనులు సునాయాసంగానే దక్కేవి కదా. దానివల్ల బొగ్గు గనుల నుంచి రాయల్టీలు మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి దక్కేవి కదా. ఆ రాయల్టీలో దాదాపు సగం వాటా కేంద్రం నుంచే దక్కేది. సింగరేణి కాలరీస్ నుంచి కేంద్రం పొందే లాభంలో కొంత భాగం తెలంగాణ ప్రభుత్వ ఖాతాలోనే జమపడేది కదా.

నాలుగో ప్రశ్న – ఇతర రాష్ట్రాల్లో కోల్ బ్లాకుల బిడ్డింగ్ లో పాల్గొని తెలంగాణలో మాత్రం బిడ్డింగ్ కు దూరం కావడం వెనుక మతలబు ఏమిటి?

ఐదో ప్రశ్న – వాస్తవంలో సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను చేపట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కాదా? తాడిచర్ల బొగ్గు గని నిర్వహణను సింగరేణి ఒక ప్రైవేటు కంపెనీకి దఖలుపరిచింది నిజం కాదా? సింగరేణి కాలరీస్ లో 2014 నుంచి ఇప్పటిదాకా మూడోవంతు రెగ్యులర్ ఉద్యోగాలను తగ్గించలేదా? 60 వేలకు పైగా ఉద్యోగులు ఉంటే 40 వేలకు తగ్గించిన మాట నిజం కాదా? శాశ్వత ఉద్యోగులను సాగనంపారు. 2014 తర్వాత అవుట్ సోర్స్ ఉద్యోగుల సంఖ్య మూడింతలైంది. అయినవాళ్ల ప్రయోజనాల కోసం ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటూ, ఉద్యోగుల సంఖ్యను నానాటికీ తగ్గిస్తూ పరోక్షంగా సింగరేణిని ప్రయివేటీకరిస్తున్న టీఆర్‍ఎస్ ప్రభుత్వం అతితెలివితో కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నది. ఇది నిజం కాకపోతే, ఇక్కడ అడిగిన ప్రశ్నలకు వివరణ ఇవ్వగలరా?

కిషోర్ పోరెడ్డి

బిజెపి రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధి

Updated Date - 2022-12-10T01:34:36+05:30 IST